ఒకప్పుడు వాళ్లు వేల కోట్ల రూపాయలకు అధిపతులు. రాజభోగాలు అనుభవించారు. వ్యాపార సామ్రాజ్యాలను శాసించారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చాలామంది ఇండియన్ బిలియనీర్లు అప్పుల ఊబిలో కూరుకుపోయి, సంపదనంతా పోగొట్టుకున్నారు. కొందరి కంపెనీలు దివాలా బాటలో ఉన్నాయి. ఆస్తులు సీజ్ అవ్వడంతో పాటు, కేసులు చుట్టుముట్టాయి. కొత్త ఐబీసీతో గత 18 నెలల్లో ఇండియన్ బ్యాంకులు వీరి నుంచి రూ. 2,76,900 కోట్లకు పైగా మొండిబకాయిలను వసూలు చేసుకోగలిగాయి. నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో (ఎన్బీఎఫ్సీ) సంక్షోభం ఏర్పడటంతో, అప్పుల మీద ఆధారపడే వ్యాపారాలు విపరీతంగా నష్టపోయాయి. ఫైనాన్స్ మార్కెట్లో కొత్తగా అప్పులు పుట్టడం కష్టమయింది. చాలా వరకు కంపెనీలు పేక మేడల్లా పడిపోయాయి. కొంత మంది విదేశాలకు పారిపోయారు. వీరిని తిరిగి ఇండియా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఒకప్పటి బిలియనీర్ల గురించి వివరించే కథనమిది.
*అనిల్ అంబానీ
ప్రపంచ ధనవంతుల జాబితా–2008 లో ఆరో స్థానంలో నిలిచిన అనిల్ అంబానీ, అప్పులు చెల్లించలేక జైలుకు వెళ్లే పరిస్థితికి దిగజారారు. ఎరిక్సన్ కంపెనీ అప్పులు చెల్లించలేకపోవడంతో అనిల్ అంబానీ గత ఏడాది తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ స్వీడన్ కంపెనీకి రూ. 550 కోట్లు(వడ్డీలతో సహా) పాత బకాయిల చెల్లించకపోతే మూడు నెలలు జైలుకు వెళ్లాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అన్న ముకేష్ అంబానీ చివరి నిమిషంలో ఆయనను ఆదుకున్నారు. అనిల్ అంబానీ టెలికాం కంపెనీ 2019 లో దివాలాకు వచ్చింది. రిలయన్స్ నావల్, ఇంజనీరింగ్ విభాగం నష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. అప్పులను తీర్చడానికి రిలయన్స్ క్యాపిటల్ ఆస్తులను విక్రయించేస్తున్నారు. లాభాల్లో నడిచే రిలయన్స్ మ్యూచువల్ ఫండ్‌లోని వాటాలనూ అమ్మేశారు.
*నరేష్ గోయల్
ఒకప్పుడు ఎయిర్ టికెట్ ఏజెంట్‌గా పనిచేసిన నరేష్ గోయల్, జెట్ ఎయిర్ వేస్ను దేశంలో అతి పెద్ద ఎయిర్‌లైన్‌గా నిలిపారు. ఖర్చులు విపరీతంగా పెరగడంతో పాటు, అప్పులు పెరగడంతో జెట్ ఎయిర్వేస్ నష్టాల్లోకి జారుకుంది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి తీసుకున్న అప్పులను కంపెనీ తీర్చలేకపోయింది. జెట్ ఎయిర్వేస్ను బ్యాంకులు టేకోవర్ చేశాయి. నరేష్ గోయల్ కంపెనీ టాప్ పొజిషన్ నుంచి దిగిపోయారు. జెట్ ఎయిర్వేస్లో రూ. 18,460 కోట్ల మోసం జరిగిందని, దీనిని దర్యాప్తు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దీని తర్వాత నరేష్ గోయల్ విదేశాలకు పారిపోకుండా సుప్రీం కోర్టు అడ్డుకుంది. జెట్ ఎయిర్వేస్ గత ఏప్రిల్‌లో ఎయిర్‌లైన్ సేవలను నిలిపివేసింది. లెండర్లు దొరక్కపోవడంతో, కంపెనీ దివాలా కోర్టుకు వెళ్లింది.
*వీజీ సిద్ధార్థ
ఇండియాలోని అతి పెద్ద కాఫీ చెయిన్ కేఫ్ కాఫీడే ఫౌండర్ వీజీ సిద్ధార్థ 2019 లో ఆత్మహత్య చేసుకున్నారు. అప్పిచ్చినవాళ్లు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థల నుంచి ఒత్తిడి పెరిగిందని, ట్యాక్స్ ఆఫీసర్ల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని లెటర్ రాసి ఆత్మ హత్య చేసుకున్నారు. కాఫీ డే లోని షేర్లను తనఖా పెట్టి, షార్ట్ పీరియడ్ కోసం అధిక వడ్డీతో అప్పులు తీసుకున్నారు. ‘చాలా కాలం నుంచి పోరాడుతున్నా. ఈ రోజు అన్నీ వదిలేస్తున్నా’ అని లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఇండియా ఇండస్ట్రీవర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
*గౌతమ్ థాపర్
పేపర్ మిల్ నుంచి పవర్ ట్రాన్స్మిషన్ వరకు వ్యాపారాలను నిర్వహిస్తున్న అవంతి గ్రూప్‌ను గౌతమ్ థాపర్ స్థాపించారు. ఈ గ్రూప్ బాకీలు తీర్చకపోవడంతో, తనఖాగా పెట్టిన గ్రూప్ సబ్సిడరీ సీజీ పవర్ షేర్లను లెండర్లు తీసుకున్నారు. దీంతో సీజీ పవర్లో యెస్ బ్యాంక్ అతి పెద్ద వాటాదారుగా మారింది. సీజీ పవర్లో మోసపూరిత ట్రాన్సాక్షన్స్ జరిగాయని బోర్డు డైరెక్టర్లు గుర్తించారు. దీంతో ఈ కంపెనీ చైర్మన్ పొజిషన్ నుంచి గౌతమ్ థాపర్ తప్పుకున్నారు. కంపెనీలో ఫోరెన్సిక్ ఆడిట్‌ను జరపాలని సెబీ ఆదేశించింది. సెక్యురిటీస్ మార్కెట్‌ను యాక్సెస్ చేయకుండా థాపర్‌పై నిషేధం విధించింది.
*మల్విందర్, శివిందర్ సింగ్
దేశంలో రెండో అతిపెద్ద హాస్పిటల్ చెయిన్ అయిన ఫోర్టిస్ హెల్త్‌కేర్‌ను మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ స్థాపించారు. ఈ సంస్థ నుంచి అక్రమంగా రూ. 2,392.7 కోట్లను, ప్రమోటర్ కంపెనీలకు దారి మళ్లించారని గత అక్టోబర్‌లో వీరిని అరెస్ట్ చేశారు. తర్వాత ఈ అన్నదమ్ములు ఫోర్టిస్ హెల్త్ కేర్‌లోని టాప్ పొజిషన్ల నుంచి వైదొలగాల్సి వచ్చింది. వీరు తమ హాస్పిటల్ కంపెనీకి రూ. 403.99 కోట్లు వరకు మోసం చేశారని సెబీ 2018లో గుర్తించింది.
*రాణాకపూర్
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ యెస్ బ్యాంక్ ఫౌండర్ రాణా కపూర్. యెస్ బ్యాంక్ షేర్లను విలువ కట్టలేమని, వారసత్వంగా వచ్చే షేర్లను తన పిల్లలు దాచుకుంటారని సెప్టెంబర్ 2018 లో ఆయన ట్వీట్ చేశారు. కానీ యెస్ బ్యాంక్‌లోని తన వాటాను 2019 అక్టోబర్ నాటికి అమ్మేశారు. మొండి బకాయిలు విపరీతంగా పెరగడంతో బ్యాంక్ లాభాలు దెబ్బతిన్నాయి. యెస్ బ్యాంక్ టాప్ పొజిషన్ నుంచి రాణాకపూర్ తప్పుకోవాల్సి వచ్చింది.
*సుభాష్ చంద్ర
మీడియా మొఘల్‌గా ఎదిగారు సుభాష్ చంద్ర. 1990 లో జీ టీవీని స్థాపించి, కేబుల్ టీవీని జనానికి దగ్గరగా తీసుకొచ్చారు. అయితే, అప్పులను తీర్చేందుకు జీ ఎంటర్టైన్ మెంట్లోని ప్రమోటర్ల వాటాను విక్రయించడం ప్రారంభించారు. 2019 నాటికి జీ గ్రూప్‌పై పట్టు కోల్పోవడంతో పాటు, చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు.
*శశికాంత్, రవికాంత్ రుయా
అప్పుల, లీగల్ సమస్యల వల్ల ఎస్సార్ స్టీల్‌ను గతేడాది రూ. 41,890 కోట్లకు ఆర్సెల్ మిట్టల్‌కు విక్రయించారు. ఎస్సార్ గ్రూప్‌ను కంట్రోల్ చేస్తున్న శశికాంత్ రుయా, రవి కాంత్ రుయా డాక్యుమెంట్లను దాచి పెట్టారని 2019 మార్చిలో యూకే జడ్జ్ మందలించారు. ఎస్సార్ కన్స్ట్రక్షన్ కంపెనీగా 1969 లో ప్రారంభమైన ఎస్సార్ గ్రూప్, 2008–12 మధ్య కాలంలో వివిధ సెక్టార్లలో రూ. 1,27,800 కోట్లను పెట్టుబడిగా పెట్టింది.
కరిగిపోయిన కోట్ల సంపద
Related tags :