* ఏపీ లో జిల్లా పరిషత్ ల చైర్ పర్సన్ క్యాటగిరికి సంబంధించిన గెజిట్ విడుదల చేసిన పంచాయతీ అండ్ రూరల్ డెవలప్ మెంట్ కమిషనర్ గిరిజ శంకర్.
జిల్లాల వారీగా రిజర్వేషన్లు:
శ్రీకాకుళం – జనరల్
విజయనగరం – ఎస్సి ( మహిళ )
విశాఖపట్నం – బీసీ ( మహిళ )
వెస్ట్ గోదావరి – బీసీ ( మహిళ )
ఈస్ట్ గోదావరి – జనరల్ ( మహిళ )
కృష్ణ జిల్లా – బీసీ
గుంటూరు – జనరల్ ( మహిళ )
ప్రకాశం జిల్లా – జనరల్
నెల్లూరు జిల్లా – ఎస్టీ
కర్నూల్ – జనరల్ ( మహిళా )
వై ఎస్ ఆర్ జిల్లా – జనరల్
చిత్తూర్ -బీసీ
అనంతపురం – ఎస్సి
* రాజధానిపై జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలి: జనసేన
మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. నిరసనల్లో భాగంగా శుక్రవారం జనసేన నేతలు దీక్షకు దిగారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జనసేన నేతలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రాజధాని ఒకసారి ఏర్పాటైన తర్వాత ఇప్పుడు మారుస్తామని ప్రకటన చేయడం సరికాదని అన్నారు. ప్రభుత్వానికి ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఇష్టమొచ్చినట్లు ప్రకటనలు చేయడం సరికాదన్నారు.
* ఆ నివేదికపై ఆందోళన అక్కర్లేదు: బోండా
విశ్వసనీయత లేని కమిటీలు ఇచ్చే నివేదికపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ మంగళగిరి మండలం ఎర్రబాలెంలో రైతులు చేస్తున్న ధర్నాకు బోండా ఉమ సంఘీభావం ప్రకటించారు. ఆందోళనలో భాగంగా మహిళలు లక్ష్మీ సహస్రనామం చేస్తూ నిరసన తెలియజేశారు. ఎన్ని రోజులైనా ఆందోళన చేస్తామని రైతులు తెలిపారు. రాజధాని భూముల విషయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బోండా ఉమ డిమాండ్ చేశారు. రైతుల తరఫున అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. స్థానిక శాసనసభ్యులు ముసుగు తీసి రైతుల మధ్యకు రావాలని అప్పుడే నిజాలు తెలుస్తాయని బోండా హితవుపలికారు.
* మహా’ కేబినెట్‌లో ఎన్సీపీకి జాక్‌పాట్
సిద్ధాంత పరంగా వైరుద్యాలున్న శివసేన, కాంగ్రెస్‌లను ఏకతాటిపైకి తెచ్చి మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ).. మంత్రివర్గ కేటాయింపుల్లో జాక్‌పాట్ కొట్టినట్లు కన్పిస్తోంది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా ఆ పార్టీ నేత అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేయగా.. తాజాగా కీలక మంత్రిత్వశాఖల్లో చాలా వరకు ఆ పార్టీకే దక్కినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. హోం, ఆర్థిక, ఇరిగేషన్, హౌసింగ్ మంత్రిత్వ బాధ్యతలను ఎన్సీపీ మంత్రులు చేపట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి.
* ఆ భూమి 2006లోనే కొన్నా: కంభంపాటి
రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వైకాపా తన పేరు ప్రస్తావించడాన్ని తెదేపా సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు ఖండించారు. రాజధాని ప్రకటించక ముందే.. 2006 జులైలో అక్కడ ఎకరా భూమి కొనుగోలు చేసినట్లు తెలిపారు. తనకు బినామీ ఉంటే చెప్పాలని.. ఆ భూములను తీసుకోవాలని వైకాపాకు సవాల్ విసిరారు. ఒక వర్గం మీద కక్షతో వైకాపా నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తన కుమార్తె ఎప్పుడో కొన్న భూమితో తనకు సంబంధమేంటని ప్రశ్నించారు. విశాఖలో విజయసాయిరెడ్డి బంధువులు వందల ఎకరాలు కొన్నారని వార్తలు వస్తున్నాయని.. ముందు వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజధానికి 30 వేల ఎకరాలు ఉండాలని అప్పట్లో ప్రతిపక్ష నేతగా జగన్ అంగీకరించారని గుర్తు చేశారు. వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో రాజధాని మార్పు చేస్తామని ఎందుకు పేర్కొనలేదని కంభంపాటి నిలదీశారు. వ్యాపారం కోసం ఎవరైనా భూములు కొనుగోలు చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. అక్రమాలు జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేస్తున్నా ఆ పని ఎందుకు చేయడం లేదని దుయ్యబట్టారు.
* బోస్టన్ కమిటి కాదు.. బోగస్ కమిటి: ప్రత్తిపాటి పుల్లారావు
తాము ఎవ్వరినీ బెదిరించి భూములు తీసుకోలేదని… రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. మంత్రులకు ధైర్యం ఉంటే ఉద్యమాలు చేసే రైతులకు దగ్గరకు వెళ్లి మాట్లాడాలని పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల రిఫరెండం పెట్టకొని ఎన్నికలకు వెళదామని… దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు.
*రాజధానిపై జగన్ కీలక వ్యాఖ్యలు
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంతంలో ఉద్యమం ఉద్ధృతమైన నేపథ్యంలో రాజధాని అంశంపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.‘‘ ప్రతి నిర్ణయానికి ప్రాతిపదిక.. అందరూ బాగుండాలి.. అన్ని ప్రాంతాలు బాగుండాలి. గ్రామం నుంచి రాష్ట్రం పరిపాలన వరకు అందరూ సమానమే. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, పరిపాలన ఫలాలు అందాలి. గతంలో అన్యాయంగా తీసుకున్న నిర్ణయాలను సరిదిద్దుతాం. అన్న దమ్ముల్లా అన్ని ప్రాంతాలు ఉండేలా ఈ పదవిని అందరి అభివృద్ధికి వినియోగిస్తా. అందరికీ నీరు, నిధులు, పరిపాలన దక్కితేనే న్యాయం’’ అని సీఎం జగన్ అన్నారు.
*రాయపాటిపై ఈడీ కేసు నమోదు
తెదేపా నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. ట్రాన్స్‌ట్రాయ్ ద్వారా విదేశాలకు నిధులు మళ్లించినట్లు ఈడీ అభియోగం. రాయపాటిపై ఇటీవల సీబీఐ కూడా కేసు నమోదు చేసింది. ట్రాన్స్‌ట్రాయ్ ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని ఇతర అవసరాలకు మళ్లించినట్లు సీబీఐ పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి ఈడీ కూడా ఫెమా చట్టం కింద తాజాగా కేసు నమోదు చేసింది. ట్రాన్స్ ట్రాయ్ నుంచి కొన్ని నిధులు సింగపూర్, మలేసియాకు మళ్లించినట్లు ప్రధాన అభియోగం. ఆర్‌బీఐ, విదేశాంగశాఖ నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించారని ఆరోపణ. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ సంస్థ డైరెక్టర్లందరిపైనా కేసు నమోదు చేసిన అధికారులు బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.
*నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఆర్కే
రాజధాని అమరావతి ప్రాంతం నీరుకొండలో తనకు 5 ఎకరాల భూమి ఉన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్కే మాట్లాడుతూ…తన భార్య పేరిట ఐదెకరాల భూమి ఉందని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. వెంటనే ఆభూమిని వారికే రిజిస్ట్రేషన్ చేస్తానన్నారు. తెదేపా నేత బోండా ఉమా చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. చంద్రబాబే రాజధానికి శాపమని ఆరోపించారు. ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదన్నారు. భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
*గాజులివ్వడానికి ఇదేమైనా జాతీయ ఉద్యమమా?తీసుకున్న భూములిస్తే బాగుండేది
చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యలురాజధాని ఉద్యమం కోసం రెండు గాజులివ్వడం కాదు… రాజధాని రైతుల నుంచి తీసుకున్న భూములను చంద్రబాబు, ఆయన భార్య వెనక్కి ఇచ్చివుంటే బాగుండేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన విశాఖలో విలేకర్లతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన భార్య పెద్ద డ్రామానే నడిపారని మంత్రి విమర్శించారు. ‘‘గాజుల దానమంటున్నారు… ఇదేమైనా జాతీయ ఉద్యమమా? అమరావతిలో దీక్షలు చేస్తున్నవారికి ఏ ఎజెండా లేదు. చంద్రబాబు చెప్పినట్లే చెయ్యాలంటే ఎట్లా? రాజధానిపై కులం ముద్ర వేస్తున్నామని అంటున్నారు. అసలు కులం ముద్ర ఎందుకు వచ్చింది? రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారు. ఇది ఆరోపణ కాదు నిజం’’ అని మంత్రి బొత్స ఆరోపించారు.
*నాగిరెడ్డి తెరాసకు అమ్ముడుపోయారు:జగ్గారెడ్డి
ఎన్నికల్లో తెరాస డబ్బులు, మద్యం పంపిణీ చేస్తుంటే పోలీసులు భద్రత కల్పిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. తెరాస ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నాయకులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల అధికారి నాగిరెడ్డి తెరాసకు అమ్ముడు పోయారని విమర్శించారు. ఐఏఎస్ అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలకడం మానుకోవాలని సూచించారు. అధికారులను అడ్డుపెట్టుకొని తెరాస సర్కారు ప్రతిపక్షాలను ఎన్నికల సమయంలో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అందుకే ప్రతిపక్షాలు కోర్టులను ఆశ్రయిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. సంగారెడ్డిలో మంచినీటి ఇబ్బందికి మంత్రి హరీష్రావే కారణమని విమర్శించారు.
*రాజధానిపై తక్షణమే ప్రకటన చేయాలి:పవన్
రాజధానిపై కాలయాపన చేయడం తగదని.. ప్రభుత్వం తక్షణమే అధికారిక ప్రకటన చేయాలని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. ఈ అంశంలో వైకాపా నాయకుల ప్రకటనలు ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నాయని ఆరోపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ పదేపదే చెబుతున్నారని.. అధికారం మీచేతిలోనే ఉన్నప్పుడు చర్యలు తీసుకోవచ్చు కదా అని పవన్ ప్రశ్నించారు. అప్పట్లో అమరావతిని సీఎం జగన్ అంగీకారం తెలిపారని.. ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారని విమర్శించారు. ఇప్పుడు పెట్టే రాజధాని అయినా అందరి ఆమోదంతో నిర్ణయించాలని పవన్ డిమాండ్ చేశారు. పాలకుల నిర్ణయాలతో అమరావతి త్రిశంకు స్వర్గంలా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
*ఏపీ రాజధానిపై అప్పుడే స్పందిస్తా: కిషన్రెడ్డి
ఏపీ రాజధాని అంశంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి స్పందించారు. రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమే అయినప్పటికీ మూడు రాజధానులను ఎలా నిర్ణయిస్తారు..విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చిన తర్వాతే తాను స్పందిస్తానని చెప్పారు. రాజధానిపై వేసిన కమిటీల నివేదికలు వచ్చాక భాజపా స్పందిస్తుందని.. ఆ తర్వాతే కేంద్ర హోంశాఖ తన అభిప్రాయం చెబుతుందని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. రాజధాని అంశంలో రాష్ట్ర పార్టీ నిర్ణయమే అంతిమం అని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర భాజపా ఎంపీలు సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు
*భాజపా, శివసేన మధ్య మరో వివాదం
ఇటీవల ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారిన చిరకాల మిత్రులు భాజపా, శివసేన మధ్య తాజాగా మరో వివాదం నెలకొంది. రిపబ్లిక్ పరేడ్లో మహారాష్ట్ర శకటానికి చోటు దక్కక పోవడమే ఇందుకు కారణం. రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకే పరేడ్లో రాష్ట్రానికి స్థానం దక్కకుండా కేంద్రం కుట్రలు చేస్తోందని శివసేన సీనియర్ నేత సంజయ్రౌత్ మీడియాతో అన్నారు. పరేడ్లో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్కే చోటు దక్కకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆ రెండు రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వం లేకపోడమే ఇందుకు కారణమా? అని ఆయన మండిపడ్డారు.
*కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి?:మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రం మొత్తం కేసీఆర్, కేటీఆర్ల నాయకత్వం కోరుకుంటున్నారని, కేటీఆర్ సమర్థుడని, కేసీఆర్ తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అవుతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. మున్సిపల్ ఎన్నికల్లో తెరాస విజయం ఏకపక్షంగా ఉంటుందన్నారు. కేటీఆర్ నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత సర్పంచి, లోక్సభ ఎన్నికలు, జడ్పీ ఎన్నికల్లో వరుసగా తెరాస విజయం సాధించిందని గుర్తుచేశారు. స్వాతంత్య్రం సాధించామని నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, ఆమె తర్వాత రాజీవ్గాంధీ ప్రధానమంత్రులు అయ్యారని, మరి రాష్ట్రం సాధించిన కేసీఆర్ తర్వాత ఆయన తనయుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేముందని ప్రశ్నించారు. అయితే నిర్ణయం కేసీఆర్ తీసుకోవాలని అన్నారు.
*ముసుగు రాజకీయాల్ని ఎదుర్కొంటాం
తెరాస ముసుగులో మజ్లిస్ రాజకీయాలు చేస్తోందని..పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల్లో వీటికి అడ్డుకట్ట వేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. తెరాస నాయకుల్ని దొడ్డిదారిన కాంగ్రెస్ నుంచి బరిలో దింపి గెలిచిన తర్వాత సొంతగూటికి తీసుకువచ్చేందుకు అధికార పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రధాన పోటీ కాంగ్రెస్తోనే అన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ గురువారమిక్కడ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో లక్ష్మణ్ మాట్లాడారు. మజ్లిస్ పార్టీ ఎజెండా అమలుకు తెరాస, కాంగ్రెస్, వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
*పీసీసీ సమన్వయకర్తల నియామకం
పురపాలిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లాల వారీగా పీసీసీ సమన్వయ కర్తలను నియమించింది. హైదరాబాద్ మినహా 32 జిల్లాలకు సమన్వయకర్తలను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమన్వయకర్తలు ఆయా జిల్లాల్లో జరిగే పురపాలిక ఎన్నికలకు స్థానిక నాయకత్వాన్ని సన్నద్ధం చేస్తారు. డీసీసీ అధ్యక్షుడు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్ఛార్జీలు, మాజీ మున్సిపల్ ఛైర్మన్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీలతో కలిసి 4వ తేదీన జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుని ప్రతి మున్సిపాలిటీ నుంచి మున్సిపల్/ కార్పొరేషన్ ఛైర్మన్ అభ్యర్థులు, వార్డు అభ్యర్థులకు సంబంధించి ఒకరు లేదా ఇద్దరు పేర్లను టీపీసీసీకి ప్రతిపాదించాలని సూచించారు.
*10 మున్సిపల్ కార్పొరేషన్లకు పీసీసీ పరిశీలకులు
త్వరలో జరగనున్న 10 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకులను నియమించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నియమితులైన పరిశీలకులు 5, 6 తేదీల్లో కార్పొరేషన్ స్థాయిలో పార్టీ కార్యకర్తలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. కరీంనగర్ కార్పొరేషన్కు ఎన్నికల పరిశీలకులుగా ఎమ్మెల్సీ జీవన్రెడ్డిని నియమించారు. రామగుండం- ఎం.అంజన్కుమార్ యాదవ్, బడంగ్పేట్- వి.హనుమంతరావు, మీర్పేట్- ఎం.కోదండరెడ్డి, బండ్లగూడ జాగీర్- రాములు నాయక్, బోడుప్పల్- గీతారెడ్డి, ఫిర్జాదిగూడ- ఎం.శశిధర్రెడ్డి, జవహర్నగర్- ఎం.ఎ.ఖాన్, నిజాంపేట్- పొన్నాల లక్ష్మయ్య, నిజామాబాద్- దామోదర రాజనర్సింహను నియమించారు. అదే విధంగా ఎన్నికలు జరిగే 95 మున్సిపాలిటీలకూ పీసీసీ పరిశీలకులను కాంగ్రెస్ నియమించింది.
*మార్చి 8న ఎమ్మార్పీఎస్ యుద్ధభేరి: మందకృష్ణ
హత్యలు, హత్యాచారాల ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం.. అగ్రకులాల విషయంలో ఒక రకంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి మరో రకంగా స్పందిస్తోందని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆరోపించారు. దీన్ని నిరసిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మార్చి 8న ‘చలో కొంగరకలాన్’- ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యుద్ధభేరి’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. దీన్ని విజయవంతం చేసేందుకు ఈ నెల 16 నుంచి మార్చి 5 వరకు రాష్ట్రంలోని 119 శాసనసభా నియోజకవర్గాల్లో సన్నాహక సభలను జరపనున్నట్లు తెలిపారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాట్లాడారు. సభకు ఏ రాజకీయ పార్టీని ఆహ్వానించడం లేదని, దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నేతలు పాల్గొంటారని చెప్పారు.
*విశాఖలో రాజధాని కావాలని ఎవరడిగారు?యనమల ధ్వజ
విశాఖలో రాజధాని కావాలని అక్కడి ప్రజలు మిమ్మల్ని అడిగారా? అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు సీఎం జగన్ను ప్రశ్నించారు. వైకాపా ఎన్నికల గుర్తు ఫ్యాన్కు మూడు రెక్కలున్నట్లు రాష్ట్రాన్ని సైతం మూడు ముక్కలు చేయాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘రాష్ట్రానికి సంపద సృష్టించడంపై జగన్కు శ్రద్ధ లేదు. తన సంపద పెంచుకోవడంపైనే ఆయన దృష్టంతా. జరుగుతున్న అభివృద్ధిని చెడగొట్టడం, జరగాల్సిన అభివృద్ధిని పక్కన పెట్టడం.. ప్రాంతాల మధ్య చిచ్చు.. ఇవే జగన్ విధానాలు’’ అని యనమల ధ్వజమెత్తారు.
*విదేశాలకూ నిధుల మళ్లింపు?
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆర్థిక లావాదేవీలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ సంస్థ ఖాతాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇతర ఖాతాలకు నిధులు మళ్లించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 2013 నుంచి 2015 వరకు జరిగిన బ్యాంకు లావాదేవీల వివరాలు సేకరించే పనిలో సీబీఐ అధికారులు నిమగ్నమయ్యారు. ఎంత డబ్బు రుణాల రూపంలో వచ్చింది.. వాటిని ఎలా ఖర్చు పెట్టారు? ఏయే ఖాతాలకు ఎంతెంత మళ్లించారు? అలా మళ్లించిన వాటిలో విదేశీ ఖాతాలు కూడా ఉన్నాయా? తదితర విషయాల గురించి ఆరా తీస్తున్నారని సమాచారం. ట్రాన్స్ట్రాయ్ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఇలాంటి సంస్థకు పోలవరం పనులు కట్టబెట్టడంపై అప్పట్లో పెద్ద దుమారమే రేగిన విషయం తెలిసిందే.
ZP ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఇవే-రాజకీయ
Related tags :