Agriculture

ఈ శీతల వాతావరణం వ్యవసాయనికి ప్రమాదకరం

Cold Climate Affecting Monsoons All Across The Globe-Telugu Agri News

చలికాలమంటే ‘లేత ఎండలో హాయిగా ఒళ్లు కాచుకోవడమే’ మనకు ఇప్పటి వరకూ తెలుసు. కానీ, మున్ముందు మరింత భయానక ‘శీతలగోళాన్ని’ చూడనున్నామని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శీతోష్ణవర్ష వలయాలలోపడి ప్రపంచం ఇలా గిలగిలా కొట్టుకోవలసిందేనా? అసలు, ఎందుకింతటి వికృత పరిస్థితి? ఈ నేపథ్య విశేషాలే ఇక్కడ చదువండి.
*అత్యంత నివాసయోగ్యమైన మన భూమిని మరో ‘వాతావరణ వికృతి’ ఆవహిస్తున్నది. అదే అతిశీతలం లేదా హిమతుపాన్లు. కారణం ఎవరైతేనేం, ఏదైతేనేం, మనిషిపై ఇంకా ఇక్కడి మన జీవజాతులపై ప్రకృతి ‘పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమైందా?’ అన్న సందేహం కలిగేలా.. అత్యంత పదునైన, అరుదైన ‘చలి పులి’ పంజాలను విసురుతున్నది. ఇప్పటిదాకా అతివృష్టి, అనావృష్టి మాత్రమే అనుకొన్నాం, కానీ వీటికి ఇవాళ ‘అతిశీతలం’ తోడైంది. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ లేని రీతిలో మన దేశరాజధాని ఢిల్లీనుంచి పృథ్వీతలం ఉత్తరధ్రువం అంచు వరకూ మంచువర్షాలు, శీతలగాలులు అత్యంత నిర్దయగా పర్యావరణాలను ముంచెత్తుతున్న సందర్భాలను చూస్తున్నాం.
*ఈ శీతాకాలపు కాఠిన్యం ఏ స్థాయిలో ఉందంటే, పాశ్చా త్య దేశాలు, ఆర్కిటిక్ ప్రాంతాలలో రోడ్లు, భవనాలపైన కొన్ని అంగుళాల మందంతో మంచు పేరుకుపోయేంతగా, ఇంకా వర్షం నీరు పడీ పడడంతోనే ఘనీభవించిపోయేలా, ఆఖరకు జలపాతాలు (ఉదా॥కు శ్రీనగర్)సైతం గడ్డకట్టి పోయేలా’. భూమిమీది రెండు ధ్రువప్రాంతాలైన ఆర్కిటిక్, అంటార్కిటిక్లకు సముద్రహిమ వాతావరణ ముప్పు సర్వసాధారణమే కావచ్చు. కానీ, భూమధ్యరేఖకు దగ్గర (2,447 కి.మీ.)లో, ఇంకా ఉత్తర(ఆర్కిటిక్), దక్షిణ(అంటార్కిటిక్) ధ్రువాలకు ఎంతో దూరం (8,948 కి.మీ., 11,835 కి.మీ.)లో ఉన్న భారతదేశ రాజధాని ఢిల్లీసహా భారతీయ ఉత్తర, వాయువ్య ప్రాంతాలకు సుమారు 119 సంవత్సరాల తర్వాత అంతటి ‘అతిశీతల దుస్థితి’ ఎందుకు ఎదురైంది? మన తలాపున భారీ హిమాలయ శ్రేణులు ఉన్నప్పటికీ, మరీ ఇంతటి చలితీవ్రతకు దారితీసిన కారణాలేమిటి? ఏడాది కేడాది పెచ్చుమీరుతున్న ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల పుణ్యంగానే చలికాలపు ముఖచిత్రంలో ఇంతటి విపరీత మార్పును చవిచూస్తున్నామని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.ముఖ్యంగా ఉత్తరధ్రువ సమీపప్రాంతాలతోపాటు భారతదేశంలోనూ అనేక ప్రాంతాలలో ఇటీవలి శీతాకాలంలో ఇప్పటికే అసాధారణ అత్యల్ప, అతిసగటు ఉష్ణోగ్రతలు నమోదైనాయి. భూమి ఉత్తర-దక్షిణ ధ్రువవృత్త ప్రాంతాల్లోని సుడిగుండాలు, వాయు ఆటంక వ్యవస్థలలో తీవ్ర మార్పులు, వాటి ప్రభావాలు శీతాకాలంలో పెద్ద ఎత్తున పడుతున్నాయని శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. వీటికితోడు ఆయా ప్రాంతాలలో స్థానికంగా కాలుష్యపు పొగమంచువల్ల ఆకాశంలో అత్యల్ప ఎత్తులో సమతల మేఘాల కూర్పులు నెలకొంటుండడం తీవ్ర శీతల వాతావరణానికి కారణమవుతున్నట్టు వారు వెల్లడించారు. ఆర్కిటిక్ సమీపప్రాంతాలతోసహా భారత్, ఆఫ్ఘనిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, టర్కెమినిస్థాన్, ఉత్తర ఇరాన్లలోని కొన్ని ప్రాంతాలు ఇటీవలి అతిశీతల గాలుల ప్రభావానికి తీవ్రంగా లోనైనట్టు వారు చెప్పారు. కెనడా నుంచి ఉత్తర-మధ్య చైనా, మంగోలియాల వరకూ దాదాపు అంతటా ఇంతటి తీవ్ర చలిసాంద్రత ఏర్పడినట్టు వారు గుర్తించారు.
*భారతదేశంలోని ఉత్తరాది, వాయువ్య ప్రాంతాలలో ప్రతి ఏడూ డిసెంబర్ రెండో అర్ధమాసం, జనవరి మొదటి అర్ధమాసం మధ్య నెలరోజులలో సగటున 2-4 డిగ్రీలమేర ఉష్ణోగ్రతలు పడిపోవడం సహజమే. మామూలుగానే డిసెంబర్లో పంజాబ్, హర్యానా, హిమాచల్ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలలో ప్రతిరోజూ అత్యధిక ఉష్ణోగ్రతలు 16-18 డిగ్రీల సెల్సియస్ను మించవు. ఇక, ఢిల్లీతోపాటు ఉత్తరాది రాజస్థాన్ ప్రాంతాలలోనూ డిసెంబర్ కాలంలో రోజూ అత్యధిక ఉష్ణోగ్రతలు 20-22 డిగ్రీ సెల్సియస్ లోపలే నమోదవుతాయి. కానీ, గత కొన్నేండ్లుగా శీతాకాలం పొడుగునా ఉత్తరాదికి చెందిన అనేక ప్రాంతాలలో ఆయా రోజులలో సగటు ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్కు పడిపోతున్నాయి. డిసెంబర్లో ప్రత్యేకించి ఢిల్లీలో సగటున అత్యధిక ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ లోపే ఉంటున్నాయి. గడచిన 118 సంవత్సరాలలో ఈ పరిస్థితి కేవలం 4 పర్యాయాలే నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (India Meteorological Department: IMD) అధికారులు తెలిపారు. ఈ డిసెంబర్ (2019) నెలను 1901 తర్వాత ‘రెండవ అతిశీతల మాసం’గా వారు పరిగణించారు. 1901 డిసెంబర్లో అత్యధిక సగటు ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.
*2019 డిసెంబర్ 14-27 మధ్య 14 రోజులను ‘శీతల దినాలు’గా ఐఎండీ శాస్త్రవేత్తలు గుర్తించారు. 1997 తర్వాత ఇంత ‘సుదీర్ఘ శీతల వాతావరణమూ’ ఇదేనని వారన్నారు. సగటుకన్నా 7 నుంచి 12 డిగ్రీల సెల్సియస్ తగ్గిపోయిన పరిస్థితిని ‘అతితీవ్ర శీతలస్థితి’గా శాస్త్రవేత్తలు పరిగణిస్తారు. ఇది 2019 డిసెంబర్ 25న నమోదైంది. 2019 డిసెంబర్- ఈ ఏడాది (2020) జనవరి నెలల మధ్య కాలంలో ఢిల్లీతోసహా దేశంలోని ఉత్తరాది, వాయువ్య ప్రాంతాల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు గత కొన్నేండ్లుగా అదేపనిగా సంభవిస్తున్న భారీ వర్షాలు, అత్యధిక ఉష్ణోగ్రతల తీవ్రతను తలపిస్తున్నట్టు భారతీయ శాస్త్రవేత్తలు అంటున్నారు. న్యూఢిల్లీలో డిసెంబర్ 30న గరిష్ఠ ఉష్ణోగ్రతలు 9.4 డిగ్రీలకు పడిపోగా, ఇది 119 ఏండ్ల (1901 తర్వాత) అతిశీతల దినమని వారు పేర్కొన్నారు. ఉత్తరభారతంలోని శీతల వాతావరణ ప్రభావం దక్షిణ భారతదేశంపైనా పడుతున్నది. తెలంగాణలో మారుమూల అటవీప్రాంతాలలో సుమారు 10 డిగ్రీల సెల్సియస్ లోపుకు పడిపోయినట్లు, హైదరాబాద్లోనూ సుమారు 14.5 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నట్టు వార్తలు వచ్చాయి.
*2016లోను, తదనంతర కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రదేశాలలో సంభవించిన తీవ్రతను మించిన రీతిలో ఇటీవల (డిసెంబర్ 2019- జనవరి 2020) అధిక చలిగాలులు నమోదైనట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2016లో ఆర్కిటిక్లో అక్టోబర్-నవంబర్ మధ్య సగటు ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ ఉండగా, డిసెంబర్-జనవరి (2017)లో 10 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. ఇదే ఏడాది ప్రపంచంలోని ఆయా ప్రదేశాలలో మంచువర్షం పెద్ద ఎత్తున నమోదైంది. 2017లోనూ పలు మంచుతుపాన్లు అనేక ప్రాంతాలలో సంభవించాయి. అదే ఏడాది జనవరి 5, 7వ తేదీలలో అయితే, గ్రీకు దీవిలోని ఈజియన్ సముద్రం వద్ద, ఏథెన్సులోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలు మైనస్ 15 డిగ్రీల సెల్సియస్కు చేరాయి. ఈ కాలంలోనే మాస్కోలో మైనస్ 30 డిగ్రీలు నమోదైంది. ఇది అప్పటికే 120 సంవత్సరాలలోనే ‘అత్యంత అసాధారణ రికార్డు’గా నమోదైంది. 2018లోనూ పలు దుర్భర శీతల పరిస్థితులే ఆయా ప్రదేశాలలో ఏర్పడ్డాయి.ధ్రువ సుడిగుండాలు (Polar Vortex), అక్కడ్నించి వీచే శీతల పవనాలు (Cold Waves) భూగోళాన్ని ప్రాణాంతక ‘శీతాగోళం’గా మారుస్తున్నాయన్న అభిప్రాయాన్ని కొందరు ప్రపంచ శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి మన దేశంలోని ఉత్తరాదిపై చలిపులి పంజా విసురుతుండడం వెనుక ‘పాశ్చాత్య ఆటంక వాయువ్యవస్థ’ (Western Disturbance wind system) ప్రభావం ఉన్నట్టు ఐఎండీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ గాలులు మధ్యధరా సముద్రం మీదుగా వస్తూ అక్కడి తేమనుకూడా కొని తెస్తున్నట్లు వారన్నారు. ఆకాశంలో అత్యంత సమీప ఎత్తు (సుమారు 300 నుంచి 400 మీటర్లు)లో సమతల మేఘాలు (low stratus clouds) ఏర్పడడం, స్థానికంగా పొగమంచు వంటివీ కారణాలుగా ఉంటున్నట్టు వారు అభిప్రాయపడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, లడక్ సమీప ప్రాంతాలలోని శీతలసాంద్రత అక్కడి హిమపాతంపై ఆధారపడి ఉంటున్నట్టు కూడా వారన్నారు.తీవ్ర వాతావరణ మార్పు పర్యవసానాలలో భాగంగానే తీవ్రశీతల పరిస్థితులూ ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్నట్టు శాస్త్రవేత్తలు అంతిమంగా నిర్ధారించారు. గత కొన్నేండ్లుగా అత్యుష్ణ వాయువులకుతోడు అతిశీతల గాలులూ తరచుగా, మరింత గాఢతతో వీస్తున్నట్లు వారు గుర్తుచేశారు. పెరుగుతున్న భూతాపం కారణంగా, 1981-2010 మధ్య కాలంతో పోల్చినప్పుడు గడచిన నాలుగైదేండ్లలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. ఇదే సమయంలో తీవ్రశీతల పవనాలు చలికాలంలోనే కాకుండా, ఇతర రోజుల (కాలం కాని కాలం)లోనూ వీస్తున్నట్టు వారు పేర్కొన్నారు. ఉత్తర అమెరికా, మధ్య-ఈశాన్య యూరప్, సైబేరియాలను ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా ఉటంకించారు.
*భవిష్యత్తు మరింత భయానకమా?
‘ఉష్ణం ఉష్ణేన శీతలం’ అన్న ఒక వైద్య (హోమియో) విధానంలోని సూత్రాన్ని ప్రకృతి పాటిస్తున్నదా?’ అంటే ‘అవున’నే శాస్త్రవేత్తలు అంటున్నారు. కారణం, ఆధునిక మానవులు అభివృద్ధి పేరుతో కాలుష్య కారకాలను విడుదల చేయవద్దంటే వింటున్నారా? పైగా, ఒకరి నొకరు పోటీలు పడుతూ అప్రాకృతిక విధానాలనే అవలంభిస్తున్నారు. సృష్టి ధర్మం ప్రకారం ‘పుట్టిన ప్రతిదీ నశించవలసిందే’. భూమి వేడెక్కుతున్నకొద్దీ ‘ఈ ఉష్ణమంతా ఎక్కడికి వెళ్లాలి?’ భూమి వాతావరణంలోనే మళ్లీ ఏదో రూపంలోకి మారి, విడుదల కాక తప్పదు కదా. కరువు కాటకాలైనా, భారీ వర్షాలైనా దీని పర్యవసానమేనని వారు తేల్చేస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా గతి తప్పిన ఋతుపవనాల వికృతరూపాల్నే చూశాం. ఇప్పుడు, మున్ముందు ఎముకలు, రాళ్లను సైతం మింగేసే క్రూర ‘శీతల వాతావ‘రణాన్ని’ దర్శించబోతున్నామేమో. దీనికి సూచనప్రాయంగానే గత అయిదేండ్లుగా ప్రపంచవ్యాప్తంగా అతిశీతల, హిమపాత పరిస్థితులు సంభవిస్తున్నాయని వారంటున్నారు.