Business

బెజవాడ నుండి దోహా, షార్జా, షిర్డీకి విమానాలు

New Flights To Doha And Sharjah From Vijayawada Airport

విజయవాడ విమానాశ్రయం నుంచి త్వరలో రెండు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభంకానున్నాయి. విజయవాడ నుంచి దోహా, ముంబయిలకు ఈ విమాన సర్వీసులు నడుస్తాయి. ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సంస్థ ఈ విదేశీ సర్వీసులను నడపటానికి ఆసక్తి చూపిస్తోంది. విజయవాడ నుంచి ముంబయికి ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సంస్థ వారంలో మూడు రోజులు బోయింగ్ 737-800 విమాన సర్వీసులను న డుపుతోంది. ఇక్కడి నుంచి బయల్దేరే ఈ సర్వీసు మూడు రోజుల్లో ఒకరోజు దోహాకు, మరోరోజు షార్జాకు నడపాలని భావిస్తున్నారు. అయితే, ఆయా దేశాలకు ఇక్కడి నుంచి వెళ్లేవారు ముంబయికి కచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. బ్యాగేజీ చెకిన్ వంటివి విజయవాడ విమానాశ్రయంలోనే నిర్వహిస్తారు. బోర్డింగ్ పాస్ కూడా ఇక్కడే ఇస్తారు. ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్, ఇమిగ్రేషన్ చెకిన్ పూర్తి చేసుకుంటే చాలు.
*విజయవాడ విమానాశ్రయంలో కస్టమ్స్, ఇమిగ్రేషన్లు ఉన్నాయి. అయినా భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ముంబయిలోనే కస్టమ్స్, ఇమిగ్రేషన్ చెకిన్ నిర్వహించనున్నారు. విజయవాడ విమానాశ్రయంలో లగేజీ చెకిన్, బోర్డింగ్ పాస్ పూర్తయినవారు మాత్రం ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్, ఇమిగ్రేషన్ హోల్డింగ్ ఏరియాలోకి వెళ్లిపోవచ్చు. అక్కడ క్లియరెన్స్ అయ్యాక నేరుగా ఆయా దేశాలకు వెళ్లే విమానాల్లో వెళ్లిపోవచ్చు. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు.. ముంబయికి వచ్చిన విమానంలోనే డోహా, షార్జాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. మరో విమాన సర్వీసులో వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ఈ విమానాలు ఏ రోజు, ఏ ప్రాంతానికి నడుపు తారన్న దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. షెడ్యూల్ను త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 45 రోజుల్లోపే విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
*వారణాసి, షిర్డీకి షెడ్యూల్స్
దేశీయంగా వారణాసి, షిర్డీలకు కూడా త్వరలో విమాన సర్వీసులు నడవనున్నాయి. ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సెక్రటరీ చొరవతో ఈ మేరకు ఉన్నతస్థాయిలో విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఢిల్లీ, ముంబయితో పాటు పలు ఇతర నగరాలకు విమాన సర్వీసులు నడిపే అవకాశాలపై విజయవాడ విమానాశ్రయ అధికారులు ఆయనకు నివేదికను పంపినట్టు సమాచారం. వారణాసి, షిర్టీలకు ఎక్కువ మంది స్థానికులు హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి మరో విమానంలో వెళ్తున్న విషయాన్ని గుర్తించారు. దీంతో వారణాసి, షిర్డీలకు విజయవాడ నుంచి నేరుగా విమాన సర్వీసులు నడపాలని చూస్తున్నారు. త్వరలో విమానయాన సంస్థల పేర్లతో పాటు, షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది.