DailyDose

నేటి పది ప్రధాన వార్తలు-జనవరి 03 2020

Today's Top Breaking News In Telugu - January 03 2020

1.ఆరోగ్యశ్రీలో 2059 వైద్యసేవలు: జగన్‌
ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలెట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ‘‘వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. ఇక నుంచి ఆరోగ్యశ్రీ కింద 2059 వైద్యసేవలు అందిస్తాం. ఫిబ్రవరి 1 నుంచి క్యాన్సర్‌ రోగులకు పూర్తిగా వైద్యం ఉచితం’’అని జగన్‌ తెలిపారు.
2. నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఆర్కే
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం నీరుకొండలో తనకు 5 ఎకరాల భూమి ఉన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్‌ విసిరారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్కే మాట్లాడుతూ…తన భార్య పేరిట ఐదెకరాల భూమి ఉందని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.
3. రాజధాని పోరు మరింత ఉద్ధృతం
రాజధాని పోరును రైతులు మరింత ఉద్ధృతం చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు, విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్షలు 17వ రోజుకు చేరాయి. ఆందోళనల్లో భాగంగా ఇవాళ ఐకాస నేతలు సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చారు. అత్యవసర సేవలు మినహా అన్నికార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మందడంలో రైతులు దుకాణాలు మూసివేయించారు.
4. బహుమతుల పేరుతో భారీ మోసం
ఈ కామర్స్‌లో మరో మోసాన్ని సైబరాబాద్‌ పోలీసులు బట్టబయలు చేశారు. బిహార్‌లోని కబీర్‌పూర్‌కి చెందిన నలుగురు సభ్యుల ముఠా ఈ కామర్స్‌ నుంచి డేటాను సేకరించి బహుమతుల పేరుతో వినియోగదారులకు గాలం వేస్తోంది. ఈ కామర్స్‌లోని డేటా లేకేజీపై దృష్టిపెట్టిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బిహార్‌ ముఠా అక్రమాలను గుర్తించారు.
5. రాయపాటిపై ఈడీ కేసు నమోదు
తెదేపా నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసు నమోదు చేసింది. ట్రాన్స్‌ట్రాయ్‌ ద్వారా విదేశాలకు నిధులు మళ్లించినట్లు ఈడీ అభియోగం. రాయపాటిపై ఇటీవల సీబీఐ కూడా కేసు నమోదు చేసింది. ట్రాన్స్‌ట్రాయ్‌ ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని ఇతర అవసరాలకు మళ్లించినట్లు సీబీఐ పేర్కొంది.
6. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి 2020 ఏప్రిల్‌లో జరిగే విశేష ఆర్జిత సేవా టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. కరెంట్‌ బుకింగ్‌ కింద 54,600 అర్జితసేవా టికెట్లు, ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానం కింద 10,680 సేవా టికెట్లు విడుదల చేసింది. క్రవారం ఉదయం 10 నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానంలో భక్తులను తితిదే ఎంపిక చేస్తుంది.
7. ‘యువ శాస్త్రవేత్తలు సృజనాత్మకంగా ఉండాలి’
యువ శాస్త్రవేత్తలు సృజనాత్మకంగా ఆలోచించాలని, అప్పుడే దేశం వేగంగా అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో 107వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సును మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాస్త్ర, సాంకేతిక, సృజనాత్మక రంగాల్లో మార్పు అవసరమని అభిప్రాయపడ్డారు.
8. శకటాల వివాదం.. రక్షణశాఖ ఏం చెబుతోంది
ఈ ఏడాది జరిగే గణతంత్ర వేడుకల పరేడ్‌లో కొన్ని రాష్ట్రాల శకటాలకు చోటు దక్కకపోవడం వివాదానికి దారితీసింది. ఉద్దేశపూర్వకంగానే భాజపాయేతర రాష్ట్రాల శకటాలను ప్రభుత్వం తిరస్కరించిందని ఆయా రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. అయితే సమయాభావం కారణంగా అన్ని రాష్ట్రాలకు అవకాశం ఇవ్వలేకపోతున్నామని, నిపుణుల కమిటీ ఎంపిక చేసి వాటికే అనుమతినిచ్చినట్లు రక్షణ శాఖ వెల్లడించింది.
9. ట్రంప్‌ ఆదేశాలతోనే…
బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడి తామే చేసినట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ ధ్రువీకరించింది. ఇరాన్‌ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సోలెమన్‌ను చంపాలన్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాల మేరకే ఈ దాడి జరిపినట్లు వెల్లడించింది. ఇరాన్‌ ఖడ్స్‌ ఫోర్స్‌ విభాగాధిపతి జనరల్‌ ఖాసీం సోలెమన్‌ని చంపడాన్ని ఆ దేశం తీవ్రంగా ఖండించింది. దీనివల్ల సంభవించబోయే తీవ్ర పరిణామాలకు అమెరికాయే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావద్‌ ఝరీఫ్‌ హెచ్చరించారు.
10. సూడాన్‌లో కూలిన విమానం..18 మంది మృతి
సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ దర్‌ఫూర్‌ రాష్ట్ర రాజధాని ఎల్ జెనైనాలో టేకాఫ్‌ అయిన ఐదు నిమిషాల్లోనే ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు సిబ్బంది, ముగ్గురు న్యాయమూర్తులు, నలుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది పౌరులు ఉన్నారు.