Politics

మీకు కులాల సంగతి ఎందుకు?

What is this caste game? Chandrababu questions jagan

అభివృద్ధి వికేంద్రీకరణ అంటే సీఎం జగన్‌కు తెలియదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. రాజధానిలో రూ.3వేల కోట్లు లేదా రూ.4వేల కోట్లు పెడితే మొత్తం భవనాలు పూర్తవుతాయని చెప్పారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలాట చేస్తారా? అని మండిపడ్డారు. ‘‘తెదేపా హయాంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేశాం. అన్ని జిల్లాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించాం. ఎన్ని ఇబ్బందులున్నా విద్యార్థులకు ఉపకార వేతనాలు ఆపలేదు. ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉంది. ప్రతిచోటా కులప్రస్తావన ఎందుకు తెస్తున్నారు? స్టాక్‌మార్కెట్లు, వ్యాపారంలోనే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఉంటుంది. రాజధానిలో సీఎం జగన్‌ ఇల్లు ఎవరి పేరుతో కట్టారో చెప్పాలి? రాజధానితో అనేకమందికి పని ఉంటుంది. నా జీవితంలో జగన్‌లాంటి సీఎంను చూడలేదు. ఒక్కొక్కరూ ఒక్కోచోట ఉంటే పనులెలా అవుతాయి? మంత్రులు, కార్యదర్శులు, విభాగాల అధిపతులు ఒకేచోట ఉండాలి. ఇదంతా ఒకరి సమస్య కాదు.. ఐదు కోట్ల ప్రజల సమస్య. నాకెందుకు అనుకుంటే నేను కూడా ఇంట్లో పడుకోవచ్చు.. కానీ భావితరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్నా. మూడు రాజధానుల అంశాన్ని వైకాపా మినహా అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాల్సిన అవసరముంది. ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే ఎక్కడికి వెళ్లాలో ఎవరికీ తెలియదు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.