వారం రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలి ధాటికి ముఖ చర్మం చెప్పలేనంతగా పొడిబారిపోతోంది. చర్మానికి తగినంత తేమను అందించటం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. అలాగని ఎడాపెడా క్రీమ్స్ వాడాల్సిన పనిలేదు. ఈ దిగువ చిట్కాలను పాటిస్తే చాలు. అవి… చెంచాడు చొప్పున అరటిపండు గుజ్జు, వెన్న లేదా మీగడ తీసుకొని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖమంతా రాయాలి. దీనివల్ల చర్మానికి సహజసిద్ధమైన తేమ అంది చర్మం పొడి బారదు. ఉడికించిన బంగాళాదుంపని మెత్తగా మెదిపి అర చెంచా పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత నీటితో కడిగితే నల్లబడ్డ చర్మం అసలు రంగులోకి మారటమే గాక ముక్కు, మొహం మీది టాన్ వదిలిపోతుంది. చెంచా చొప్పున తేనె, రోజ్‌వాటర్ కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత కడిగేయాలి. తేనె సహజ మాయిశ్చరైజర్‌గానూ, రోజ్‌వాటర్ టోనర్‌గా పనిచేసి చర్మాన్ని సున్నితంగా మార్చుతాయి. క్యారెట్ గుజ్జు 2 చెంచాలు, చెంచా తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 10 నిమిషాల తరువాత కడిగేయాలి. దీనివల్ల పొడి చర్మానికి సాంత్వన లభించటమే గాక నల్లబడ్డ చర్మం సైతం కాంతులీనుతుంది. తేనె 2 చెంచాలు, 4 చెంచాల పెరుగు కలిపి ముఖానికి, మెడకు ప్యాక్ వేసి పావుగంట తరువాత చన్నీటితో కడిగితే పొడిబారిన చర్మం మెత్తబడుతుంది.
చర్మం పగిలిపోతోందా?
Related tags :