Sports

ఇర్ఫాన్ పఠాన్ విరమణ

Irfan Pathan Retires From Cricket

భారత సీనియర్‌ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌(35) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించినట్లు తెలిపాడు. కెరీర్‌లో గాయాలు, ఫామ్‌లేమితో తీవ్రంగా ఇబ్బందిపడి జాతీయ జట్టులో చోటు కోల్పోయిన ఇర్ఫాన్‌ ఆ తర్వాత మళ్లీ పునరాగమనం చేయలేకపోయాడు. చివరిసారిగా 2019 ఫిబ్రవరిలో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో జమ్ము కశ్మీర్‌ తరఫున అతడు పోటీ క్రికెట్‌ ఆడాడు. గత నెలలో జరిగిన ఐపీఎల్‌-2020 వేలంలో కూడా తన పేరును నమోదు చేసుకోలేదు.2003లో అడిలైడ్‌ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. టీమ్‌ఇండియా తరఫున 2012 అక్టోబర్‌లో చివరిసారిగా ఆడాడు. 29 టెస్టుల్లో( 1105 పరుగులు, 100 వికెట్లు), 120 వన్డేల్లో(1544 పరుగులు, 173 వికెట్లు), 24 టీ20(172 పరుగులు, 28 వికెట్లు)ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2007 ట్వంటీ20 వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచిన భారత జట్టులో ఇర్ఫాన్‌ ఉన్నాడు. టోర్నీలో పాకిస్థాన్‌తో ఫైనల్‌ మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు కూడా అందుకున్నాడు.2006లో పాకిస్థాన్‌ పర్యటనలో అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. కరాచీ టెస్టులో సల్మాన్‌ బట్‌, యూనిస్‌ ఖాన్‌, మహ్మద్‌ యూసుఫ్‌లను వరుస బంతుల్లో ఔట్‌ చేశాడు. టెస్టుల్లో సీనియర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తర్వాత హ్యాట్రిక్‌ నమోదు చేసిన రెండో భారత ఆటగాడు లెఫ్టార్మ్‌ పేసర్‌ పఠాన్‌ కావడం విశేషం.