* ఇటీవల తెదేపాను వీడిన సాదినేని యామిని శర్మ భాజపాలో చేరారు. శనివారం కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన భాజపా సీనియర్ నేత, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకొన్నారు. గజేంద్ర సింగ్ షెకావత్ ఆమెకు పార్టీ కండువా కప్పి కమల దళంలోకి ఆహ్వానించారు. గతేడాది నవంబర్ మాసంలో తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి యామిని రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలో కొన్ని అంతర్గత విభేదాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ చంద్రబాబు ఇచ్చిన తోడ్పాటు మరువలేనిదని రాజీనామా సందర్భంలో ఆమె రాసిన లేఖలో పేర్కొన్నారు. తన వ్యక్తిగతమైన, దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఇతర బలమైన కారణాలతో తెదేపాను వీడుతున్నట్టు స్పష్టంచేసిన ఆమె తాజాగా భాజపాలో చేరడం గమనార్హం. ఆమెతో పాటు పలువురు భాజపాలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరితో పాటు పలువురు భాజపా నేతలు పాల్గొన్నారు.
* పురపాలికల్లో విజయం మనదే: కేసీఆర్
రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలోనూ తెరాస విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలతో తెలంగాణ భవన్‌లో ఆయన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలంతా పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సర్వేలన్నీ తెరాసకే అనుకూలంగా ఉన్నాయని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు
* ఏపీ పరిణామాలను కేంద్రం గమనిస్తోంది: సుజనా
రాజధాని అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపై ఉందని భాజపా ఎంపీ సుజనాచౌదరి అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా కడప నగరంలో భాజపా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 13 జిల్లాల ప్రజలంతా రాజధానిని రక్షించుకోకపోతే తీవ్రంగా నష్టపోతామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
* 27 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు
మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటైన కేబినెట్‌లో 27 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారిలో 18 మంది సీరియస్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఎలక్షన్స్ టైంలో ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన సమాచారం ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. సీఎం ఉద్ధవ్ థాక్రే ఎన్నికల్లో పోటీ చేయనందున ఆయన వివరాలు తెలియలేదు. ఆడ్వకసీ గ్రూప్ అసోసి యేష్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఈ మేరకు రిపోర్ట్ రిలీజ్ చేసింది. శివసేన , ఎన్సీపీ ,కాంగ్రెస్ ప్రభుత్వంలో ని 42 మంది మినిస్టర్లలో 41మంది కోటీశ్వరులని రిపోర్ట్ తెలిపింది. వారి యావరేజ్ ఆస్తులు రూ.22 కోట్లు. కాంగ్రెస్‌కు చెందిన విశ్వజిత్ కాదమ్ రూ.217 కోట్ల ఆస్తితో మొదటి ప్లేస్‌లో ఉన్నారు.
* శివసేనకు భారీ షాక్.. మంత్రి రాజీనామా!
ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది కాలంలోనే మహారాష్ట్రలోని మహా వికాస్ ఆఘాడి సర్కార్‌కు భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో ఏకైక ముస్లిం మంత్రిగా ఉన్న అబ్దుల్ సత్తార్ కేబినెట్ నుంచి వైదొలిగినట్లు వార్తులు వినిపిస్తున్నాయి. కేబినెట్ హోదా ఇవ్వకపోవడం, మంత్రిగా ప్రమాణం చేసి వారం గడుస్తున్నా ఇంకా శాఖలు కేటాయించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ రాజీనామాపై అబ్దుల్ సత్తార్ ఇప్పటి వరకు బహిరంగ ప్రకటన చేయలేదు. మరోవైపు అధికార శివసేన మాత్రం రాజీనామా వార్తలను తీవ్రంగా ఖండించింది. సత్తార్ ప్రభుత్వంలోనే కొనసాగుతారని ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా సిల్లోద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సత్తార్.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఔరంగాబాద్ సీటు ఆశించిన ఆయన.. తనకు సీటు దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడి శివసేన కండువా కప్పుకున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్నారు.
*జగన్ తన పతనానికి తానే నాంది పలికాడు: జలీల్‌ఖాన్
ఏపీ సీఎం జగన్ తన పతనానికి తానే నాంది పలికాడని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన అంతా ఒకే దగ్గర నుంచి జరగాలన్నారు. రాజధాని మార్చకుండా ఉంటే జగన్‌కు పాదాభివందనం చేస్తానన్నారు. జగన్ అంటే ఉద్యోగులు భయపడుతున్నారన్నారు. అందుకే ఉద్యోగులు సైలెంట్ అయ్యారని జలీల్‌ఖాన్ పేర్కొన్నారు
*ఏ రాయి ఐతేనేం పళ్ళు రాలకొట్టుకోవడానికి?: కన్నా
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వ్యవహారంపై ఇప్పటికే జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ కమిటీలు సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి నివేదికలు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్‌లో స్పందించారు. ‘ఏ రాయి ఐతేనేమి పళ్ళు రాలకొట్టుకోడానికి..?. సమయాన్ని, ప్రజధనాన్ని వృధా చేస్తూ మొన్న G.N రావు కమిటీ, నిన్న బోస్టన్ కమిటీ, రేపు హైపవర్ కమిటీ.. పేరు ఏదయినా సీఎం మనసులో ఉన్న ఆలోచననే నివేదికగా ఇచ్చి ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని ప్రజలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నారు’ అని ట్విట్టర్‌లో కన్నా రాసుకొచ్చారు.
*.కేటీఆర్ ఇప్పుడు కాకుంటే.. భవిష్యత్‌లో సీఎం కాలేడు: లక్ష్మణ్
కేటీఆర్ పట్టాభిషేకం వార్తలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖారారైందన్నారు. కేటీఆర్ ఇప్పుడు కాకుంటే… భవిష్యత్‌లో సీఎం కాలేడని వ్యాఖ్యానించారు. రాహుల్ విషయంలో సోనియా చేసిన తప్పును కేసీఆర్ చేయదల్చుకున్నట్టు లేదన్నారు. మున్సిపల్ షెడ్యూల్ వెనుక ఎన్నికల సంఘం, ప్రభుత్వం కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. రాజకీయ కారణంతోనే సోమేష్‌ను సీఎస్‌గా నియమించారని విమర్శించారు. సీనియర్లను కాదని సోమేష్‌కుమార్‌ను సీఎస్‌గా ఎలా నియమిస్తారని లక్ష్మణ్ ప్రశ్నించారు.
*అర్ధరాత్రి రైతుల ఇళ్లలో సోదాలా?: ట్విట్టర్‌లో లోకేష్
రాజధాని రైతుల ఇళ్లలో పోలీసుల సోదాలపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్‌లో స్పందించారు. రైతులపై జగన్‌కి అంత కక్ష ఎందుకో అర్ధం కావడం లేదని విమర్శించారు. రైతుల ఇళ్ల మీదకి పోలీసులను పంపి భయభ్రాంతులకు గురి చేసి ఏమి సాధించాలని ప్రశ్నించారు. అర్ధరాత్రి రైతుల ఇళ్లలో సోదాలా? అని మండిపడ్డారు. శాంతియుతంగా పోరాడుతున్న రైతుల పట్ల జగన్ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతుల కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని లోకేశ్ ట్వీట్ చేశారు.
* అశ్వత్థామకు మరో ఎదురుదెబ్బ
ఆర్టీసీ కార్మిక నాయకుడు అశ్వత్థామ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. అదనపు సాధారణ సెలవును మంజూరు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం నిరాకరించింది. ఆరు నెలల సెలవు కోరుతూ పెట్టుకున్న దరఖాస్తును యాజమాన్యం ఇప్పటికే తిరస్కరించింది. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. విధులకు హాజరుకాకపోతే తదుపరి చర్యలు ఉంటాయని అశ్వత్థామకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
* నిజమే.. సీబీఐకి ఫిర్యాదు చేసింది వాళ్లే : రాయపాటి
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన కంపెనీలు, ఇళ్లపై సీబీఐ దాడులు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం సీబీఐతో పాటు ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలో రాయపాటి, ఆయన కుమారుడు మీడియాతో మాట్లాడిన దీనిపై క్లారిటీ ఇచ్చారు. శనివారం నాడు విద్యాదాత గోగినేని కనకయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాయపాటి మాట్లాడారు.
* రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న బంద్
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, నిన్న మందడంలో మహిళలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా రాజధాని గ్రామాల్లో స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతోంది. పోలీసుల వైఖరికి నిరసనగా శనివారం ఉదయం తుళ్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. వ్యాపర, వాణిజ్య సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ… బోస్టన్ కమిటీ ముమ్మాటికీ బోగస్ కమిటీ అని విమర్శించారు. ‘బోస్టన్ కమిటీ చెప్పినట్టు ఆరు నెలల క్రితం వరకు ఈ ప్రాంతంలో ఎకరం భూమి రూ.2కోట్లు పలికింది.
*పౌరసత్వ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదు: రాంమాధవ్
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై విపక్షాలన్నీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. దేశ ప్రజలను మతపరంగా విభజన చేయాలని వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఏఏపై నిర్వహించిన అవగాహన సదస్సుకు రాంమాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
*మీరు ప్రధానా? పాక్ రాయబారా?: మమత
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఎప్పుడూ పాకిస్థాన్తో మన దేశాన్ని పోల్చడమేంటని ప్రశ్నించారు. మీరు ప్రధానా? ఆ దేశానికి రాయబారా? అంటూ తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సిలిగురిలో శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
*కాంగ్రెస్, శివసేన.. సావర్కర్ వివాదం
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం సిద్ధాంత విభేదాలను మరిచి చేతులు కలిపి కాంగ్రెస్, శివసేనల మధ్య తాజాగా వివాదం రాజుకుంది. హిందుత్వ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్పై అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకు గానూ.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా మండిపడ్డారు. వారి బుర్రంతా చెత్తతో నిండిపోయిందంటూ కాంగ్రెస్పై పరోక్షంగా విరుచుకుపడ్డారు.
*అధిష్ఠానం ముందు మోకరిల్లొద్దు: అమిత్షా
రాజస్థాన్లోని కోటలో కేవలం ఒక్క నెలలోనే 100 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయినా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్కు ఏమాత్రం పట్టించుకోవడంలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకించే పనిలో ఆయన తీరిక లేకుండా ఉన్నారని ఎద్దేవా చేశారు.
*ప్రతిపక్షాలకు నూకలు చెల్లాయి: హరీశ్రావు
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, భాజపాలకు నూకలు చెల్లాయని.. పురపాలక ఎన్నికల్లో ఓటమి భయంతోనే కోర్టులకు వెళ్లి వాయిదా వేయాలని కోరుతున్నాయని ఆర్థిక మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ఏవైనా గెలుపు గులాబీ పార్టీదే అవుతుండటంతో విపక్షాలు ఆందోళన చెందుతున్నాయన్నారు.
*పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు వద్దు
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపును వెంటనే ఆపాలని.. లేకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్రెడ్డి డిమాండ్ చేశారు. పునరాకృతి పేరిట పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఎస్) అంచనాలను పెంచి, గుత్తేదారులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఇదే పథకం పరిధిలోని లక్ష్మీదేవపల్లి జలాశయానికి ఇంతవరకు టెండర్లే నిర్వహించలేదని తెలిపారు. మహబూబ్నగర్లోని డీసీసీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వట్టెం జలాశయాన్ని నాసిరకంగా నిర్మిస్తున్నారని ఆరోపించారు. 9 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టుకు గండిపడితే పలు గ్రామాలు ముంపునకు గురవుతాయని ఆందోళన చెందారు.
*పౌరసత్వ చట్టంపై కాంగ్రెస్, భాజపాలది ఒకే వైఖరి-ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య
దేశంలో పౌరసత్వ చట్టంపై కాంగ్రెస్, భాజపాలది ఒకటే వైఖరి అని, ఉద్దేశపూర్వకంగానే ఈ అంశాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నాయని తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ధ్వజమెత్తారు. పురపాలక ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను ప్రజలు చిత్తుగా ఓడిస్తారన్నారు. శుక్రవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కేంద్ర సహాయ మంత్రి కిషన్రెడ్డి పురపాలక ఎన్నికల్లో తమకు, మజ్లిస్కు మధ్య పోటీ అంటూ హాస్యాస్పదంగా మాట్లాడారు. పురపోరులో తెరాస ఘనవిజయం ఖాయం. కేసీఆర్ది పేదల ఎజెండా. మిగతా పార్టీలు పోటీలో లేవు’’ అని పేర్కొన్నారు.
*పునరావాస కేంద్రంగా సీఎం కార్యాలయం: దాసోజు
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం విశ్రాంత ఉద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్లో మాట్లాడారు. సీఎం తన అనుయాయులైన జూనియర్ అధికారులకు పదోన్నతులు కల్పించి ఉన్నత పదవుల్లో కూర్చోబెడుతున్నారని ఆరోపించారు. దాదాపు 15 మంది సీనియర్లను పక్కనపెట్టి.. సోమేశ్కుమార్ను సీఎస్గా నియమించడమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సోమేశ్కుమార్ పరోక్షంగా తెరాసకు లబ్ది చేకూర్చారని ఆరోపించారు. ఈ నియామకం ఓ క్విడ్ప్రోకో అని శ్రవణ్ దుయ్యబట్టారు.
*పౌరసత్వ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదు: రాంమాధవ్
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై విపక్షాలన్నీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. దేశ ప్రజలను మతపరంగా విభజన చేయాలని వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఏఏపై నిర్వహించిన అవగాహన సదస్సుకు రాంమాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మతపరమైన కారణాలతో దేశ ప్రజల పౌరసత్వం రద్దు చేయరని ఆయన స్పష్టం చేశారు. పాక్, బంగ్లా దేశాలు ఇస్లామిక్ దేశాలుగా ఏర్పడ్డాక అక్కడి మైనార్టీలపై దాడులు అధికమయ్యాయన్నారు.
*73 రాజ్యసభ స్థానాలకు ఈ ఏడాది ఎన్నికలు
రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 69 మంది సభ్యుల పదవీకాలం ఈ ఏడాది ముగియనుంది. ఇప్పటికే మరో నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే ఈ ఏడాది మొత్తం 73 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. పార్టీల వారీగా చూస్తే ఈ ఏడాది భాజపాకు చెందిన 18 మంది, కాంగ్రెస్కు చెందిన 17మంది సభ్యుల పదవీకాలం ముగుస్తోంది. ప్రస్తుతం పెద్దల సభలో భాజపాకు 83మంది, కాంగ్రెస్కు 43మంది సభ్యుల బలం ఉంది. రాష్ట్రాల వారీగా ఖాళీ అయ్యే స్థానాలను పరిగణనలోకి తీసుకుంటే ఉత్తర్ప్రదేశ్లో 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మహారాష్ట్ర-7, తమిళనాడు-6 పశ్చిమబెంగాల్, బిహార్లో చెరో 5, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఒడిశాల్లో 4 స్థానాలు, తెలంగాణ, హరియాణా, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్లలో 2 స్థానాల చొప్పున ఖాళీ అవుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, మిజోరం, మేఘాలయ, మణిపుర్, అరుణాచల్ప్రదేశ్ల్లో ఒక్కోస్థానం ఖాళీ అవుతుండగా వీటన్నింటికీ ఈ ఏడాదిలో ఎన్నికలు నిర్విహించాల్సి ఉంటుంది.
*మున్సిపల్ ఎన్నికల షెడ్యూలు సవరించాలి-రాష్ట్ర ఎన్నికల సంఘానికి భాజపా విజ్ఞప్తి
రిజర్వేషన్లు ఖరారు చేయకుండా పురపాలక, నగరపాలక సంఘాల ఎన్నికలకు షెడ్యూలు విడుదల చేయడంపై భాజపా అభ్యంతరం వ్యక్తం చేసింది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత.. అభ్యంతరాలు తెలిపేందుకు కనీసం వారం రోజుల సమయం ఉండాలని, ఆ మేరకు షెడ్యూలును సవరించాలని కోరింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డిని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి, హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ తెలంగాణ ఎన్నికల సంఘం కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
*సీఎం ఇంటికే అనుమతుల్లేవు: ధూళిపాళ్ల
అమరావతికి కూతవేటు దూరంలోనే 2015-16 మధ్య జగన్ బినామీలు, కంపెనీలు పెద్ద ఎత్తున భూములు కొన్నాయని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ‘కాంక్రీట్, లైట్స్టోన్ ఇన్ఫ్రా యజమాని అనీల్కుమార్రెడ్డి నుంచి తాడేపల్లిలోని గృహాన్ని జగన్ కొన్నట్లు ఆధారాలున్నాయి. ఈ కంపెనీ తాడేపల్లి ప్రాంతంలో 2016నుంచి పెద్ద ఎత్తున భూములు కొంది. దీని నుంచి సండూర్పవర్, హరీశ్ఇన్ఫ్రా కంపెనీలు 2016లోనే భూములు కొన్నాయి. ఈ రెండు కంపెనీల వెనక జగన్ భార్య భారతి, పి.రమేశ్బాబు ఉన్నారు. జగన్ ఇంటికి సీఆర్డీఏ అనుమతులు లేవు’ అని ధూళిపాళ్ల తెలిపారు.
*విశాఖ భూ కుంభకోణంపై విచారణ జరిపించండి: దేవినేని ఉమా
‘విశాఖపట్నంలో వేలాది ఎకరాలు చేతులు మారాయి. జాయింట్ కలెక్టర్ శివశంకర్ను నియమించి భూములను సర్వే చేస్తున్నారు’ అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తిని డీసీపీగా విశాఖలో పెట్టి అక్కడ బెదిరింపులకు పాల్పడుతున్నారని, విశాఖలో మార్వాడీని బెదిరించి వైకాపా నాయకులు కోటి రూపాయలు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. విజయవాడలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాడిసన్ గ్రూప్నకు చెందిన హోటల్ యాజమాన్యాన్ని వైకాపా నేతలు బెదిరించి అందులో మేఘా కృష్ణారెడ్డికి 50 శాతం వాటా ఇప్పించారు. సాగర్నగర్లో 1000 గజాల స్థలాన్ని కబ్జా చేశారు. ఉడా అప్రూవల్ లే అవుట్లో 4 సైట్లను వైకాపా నేత ఆక్రమించారు. సీఎంకు ధైర్యముంటే విశాఖ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ చేపట్టగలరా?’ అని ప్రశ్నించారు.
*7.5 ఎకరాలు ఉన్నట్లు అసత్య ప్రచారం: పల్లె
వైకాపా నాయకులు చెబుతున్నట్లుగా అమరావతి ప్రాంతంలో తనకు, తన కుటుంబ సభ్యులకు 7.5 ఎకరాలు లేవని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. రాజధాని ప్రకటించాక నేలపాడులో 2.5 ఎకరాలు కొనుగోలు చేశామని శుక్రవారం అనంతపురంలో మాట్లాడుతూ చెప్పారు. వైకాపా నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
*బీసీ గొంతుకను దిల్లీకి వినిపించాలి: కృష్ణయ్య
చదువులు, పదవులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు దక్కేలా బీసీ గొంతుకను దిల్లీ వరకు వినిపించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. విద్యుత్తు బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర 14వ మహాసభ కృష్ణా జిల్లా కొండపల్లిలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉద్యోగాల్లో, చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించడంతోపాటు బీసీలపై క్రీమిలేయర్ ఎత్తివేయాలి. బీసీ రిజర్వేషన్పై ఇప్పటికే పలుమార్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం. సావిత్రిబాయి ఫులే 189వ జయంతి సందర్భంగా విద్యుత్తు బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ నిర్వహించడం ఆనందించదగ్గ విషయం’ అని వ్యాఖ్యానించారు. అనంతరం ట్రాన్స్కో సీఎండీ ఎన్.శ్రీకాంత్తో కలిసి సావిత్రిబాయి ఫులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
భాజపాలోకి దూకిన యామిని-రాజకీయ
Related tags :