అది సకల కార్యాలకూ కారణ స్థానం… అది సర్వ దేవతలకూ పూజా స్థలం…
సృష్టి, స్థితి, లయలకు అవసరమైన శక్తి, సంకల్పాలు ఉద్భవించేది అక్కడే…అందుకే ఏడాదికో రోజైనా ఆ దిక్కుకు తిరిగి నీవే దిక్కని మొక్కుతారందరూ.మనం నివసిస్తున్న భూమి సౌరమండలంలో ఉంది. అలాంటి ఎన్నో మండలాలు కలిస్తే అది అండం. అంతులేనన్ని అండాల సమాహారమే బ్రహ్మాండం. అందుకే వాటన్నిటికీ పరిపాలకుడైన పరమాత్మను అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అంటారు.
**ఆయన నివసించే వైకుంఠం రెండు భాగాలుగా ఉంటుందని చెబుతారు. వాటిపేర్లు కార్య వైకుంఠం, కారణ వైకుంఠం. పరమాత్మ నిర్వర్తించే సృష్టి, స్థితి, లయలను లీలలంటారు. వీటన్నిటికీ కేంద్ర స్థానం కార్య వైకుంఠం. ఇది విరజానదికి ఈవలి వైపు ఉంటుందని చెబుతారు. కార్య వైకుంఠం నుంచి సృష్టించిన లోకాలన్నిటినీ కలిపి లీలా విభూతి అని పిలుస్తారు. అసలీ కార్యాలన్నిటికీ కారణమైన స్థలం మరొకటుంది. దాన్ని కారణ వైకుంఠం లేదా పరమపదం అని పిలుస్తారు. ఇది విరజానది ఆవల ఉంటుందని చెబుతారు. ఈ పరమపదానికి ఆది లేదు అంతం లేదు. అందుకే దాన్ని నిత్యం అంటారు. దాన్నే నిత్య విభూతి అని కూడా పిలుస్తారు. మహర్షులు, దేవతలు, పుణ్య చరితులు కార్య వైకుంఠంలోకి ప్రవేశం పొందగలుగుతారు. కారణ వైకుంఠం మహా విష్ణువుకు ఆంతరంగిక ప్రదేశం అని చెబుతారు. అందులోకి ప్రవేశం లోకోత్తరమైన వ్యక్తులకే సాధ్యం. అలా ప్రవేశం పొందినవారు విష్ణువుతో ఐక్యం చెందారని అర్థం చేసుకోవాలి. అది అందరికీ లభించే అవకాశం కాదు. కార్య, కారణ వైకుంఠాలకు సంబంధించిన వివరాలు బ్రహ్మ వైవర్త, విష్ణు పురాణాల్లో కనిపిస్తాయి. బ్రహ్మ శరీరం నుంచి పుట్టిన మధుకైటభులనే రాక్షసులు తమ తెలివితేటలతో కారణ వైకుంఠ ప్రవేశాన్ని పొందారు. దీనికో కథ చెబుతారు.
*సృష్టి ఆరంభంలో భగవానుడు లోకకల్యాణం కోసం వేదాలను సృజించాడు. వాటిని మధుకైటభులు అపహరించి పారిపోసాగారు. వారిని అడ్డుకోడానికి ప్రయత్నించిన విష్ణువుతో యుద్ధం చేశారు వారిద్దరూ. వారి నుంచి వేదాలను రక్షించిన విష్ణువుకు వారిపై అనురాగం కలిగింది. మీకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. ఆ మాటకు వారు తమకు కారణ వైకుంఠ ప్రాప్తి కలిగించమని కోరారట. సంకట స్థితిలో పడ్డ విష్ణువు ఆలోచించి ఎప్పుడూ, ఎవరూ ప్రవేశించని ఉత్తర ద్వారం ద్వారా వారిని వైకుంఠంలోకి పంపాడని చెబుతారు. అప్పుడు వారు ‘అల్పులమైన మాకే ఇంతటి వరం ప్రసాదించావు. మరి నీ భక్తిలో తేలియాడే భక్తులకు ఇలాంటి అవకాశం కలిగించవా ప్రభూ’ అని ప్రార్థించారు. దానికి శ్రీ మహా విష్ణువు ‘మిమ్మల్ని ఇక్కడకు చేర్చిన ఈ రోజున తన భక్తులు ఉత్తర ద్వారం నుంచి తనను దర్శించుకుంటే వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని’ వరం ఇచ్చాడని చెబుతారు. మకర సంక్రాంతికి నెల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అది దేవతలకు బ్రాహ్మీ ముహూర్త కాలం అని చెబుతారు. ఆ సమయంలో ముక్కోటి దేవతలు విష్ణువును దర్శించుకుంటారని, ఆ సమయంలో వచ్చే ఏకాదశి కాబట్టి ‘ముక్కోటి ఏకాదశి’ అని, ఆ రోజు విష్ణువును పూజిస్తే వైకుంఠప్రాప్తి కలుగుతుంది కాబట్టి ‘ వైకుంఠ ఏకాదశి’ అనీ పేర్లు వచ్చాయని పౌరాణికులు అంటారు.
**తిరుమలలో ‘ఉత్తరం’ కాదు…
వైకుంఠద్వార దర్శనం అన్ని దేవాలయాల్లో ఉత్తర దిక్కునుంచి జరుగుతుంది. కానీ కలియుగ వైకుంఠమైన తిరుమలలో మాత్రం మనకు ఉత్తర ద్వారం కనిపించదు. తిరుమల ఆలయానికి ప్రధాన ద్వారం తూర్పు అభిముఖంగా ఉంటుంది. ప్రధాన ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులతో కూడింది మహాప్రదక్షిణ మార్గం. ఆలయంలోకి ప్రవేశించాక వెండి వాకిలి ముందువైపు ఆలయం చుట్టూ ఉంది సంపంగి ప్రదక్షిణ మార్గం. వెండి వాకిలి లోపల ఆలయం చుట్టూ ఉన్నదాన్ని విమాన ప్రదక్షిణ మార్గం అంటారు. కాగా ప్రధాన ఆలయానికి ఆనుకుని ఉన్న చిన్న మార్గమే వైకుంఠ ప్రదక్షిణ మార్గం. ఇది ఏడాదిలో రెండు రోజులు మినహా అన్ని రోజుల్లో మూసి ఉంటుంది. స్వామివారిని దర్శించుకుని ప్రధాన ఆలయం నుంచి వెలుపలకు రాగానే కుడి చేతి వైపు ఇది కనిపిస్తుంది.
* కాలగణన సూర్యచంద్రుల గమనాన్ని బట్టి చేస్తారు. భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు అనుసరించేది చాంద్రమానం. అందువల్లనే తెలుగువారి పండగలన్నీ చాంద్రమాన గణన ప్రకారమే జరుగుతాయి. సౌరమానం ప్రకారం వచ్చే పండగలు అతి తక్కువ ఉంటాయి. వాటిలో వైకుంఠ ఏకాదశి ఒకటి. దీన్నే ముక్కోటి ఏకాదశి, స్వర్గద్వారైకాదశి అని కూడా పిలుస్తారు.
* నిరంతర విష్ణు చింతనాపరుడు, సేవా తత్పరుడు అయిన నమ్మాళ్వార్‌కు కూడా శ్రీమహావిష్ణువు ముక్కోటి ఏకాదశి నాడు కారణ వైకుంఠ ప్రాప్తి కలిగించాడని పురాణ కథనం. అందువల్ల వైష్ణ్వాలయాల్లో ముక్కోటి ఏకాదశికి ముందు పది రోజులు, తర్వాత పది రోజులు ఆళ్వారుల స్తోత్రాలతో స్వామిని పూజిస్తారు. ఇలా చేసే ఉత్సవాల్లో పగటి పూట ఉత్సవాలను పగల్ పత్తు. అని, రాత్రి పూట చేసే ఉత్సవాలని రాపత్తు అని పిలుస్తారు.
* మనకు ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు ఉంటాయి. మనస్సును పదకొండవ ఇంద్రియంగా భావిస్తారు. వికుంఠం అంటే లోపాలు లేకుండా సక్రమ స్థితిలో ఉండడం. మనిషికి ఉన్న పదకొండు ఇంద్రియాలు మంచి మార్గంలో ప్రయాణించడమే వైకుంఠ ఏకాదశి పర్వదినం ఇచ్చే సందేశం.
* ముక్కోటి ఏకాదశి నాడు.. వేకువజామునే నిద్రలేచి అవకాశం ఉన్నవారు నదీ స్నానం చేయాలి. వైష్ణ్వాలయానికి వెళ్లి ఉత్తర ద్వారం నుంచి శ్రీహరిని దర్శించుకోవాలి. ఆరోగ్యవంతులు ఆనాడు ఉపవాసం ఉండి, వీలైనంత ఎక్కువ సమయం విష్ణు చింతనలో కాలం గడపాలి. విష్ణుకథలు వినటం, హరినామ సంకీర్తనం చేయాలి. మర్నాడు ఉదయం మళ్లీ విష్ణువును పూజించి విష్ణుభక్తుడైన సత్పురుషుణ్ని భోజన వస్త్ర తాంబూలాదులతో సత్కరించి, ద్వాదశి పారణం (భోజనం) చేస్తారు.
రేపే వైకుంఠ ఏకాదశి
Related tags :