Politics

నిరాశ చెందితే నామినేటెడ్ పోస్టులు

Harish Rao Promises Nominated Posts

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో సర్వేలన్నీ తెరాసకు అనుకూలంగా ఉన్నప్పటికీ పని విషయంలో అలసత్వం వద్దని మంత్రి హరీశ్‌రావు పార్టీ నేతలకు సూచించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ప్రతి వార్డులో ఉన్నారని ఆయన అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన తెరాస మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వార్డులో ఇంటింటికెళ్లి ప్రతి ఓటరును కలవాలని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని అన్నారు. ప్రజలు కోరుకున్న, గెలిచే అభ్యర్థులనే పార్టీ ఎంపిక చేస్తుందని చెబుతూ.. పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కష్టపడి పని చేయాలని కోరారు. టికెట్‌ రాలేదని ఆశావహులు నిరాశ చెందొద్దని చెప్పారు. అవకాశం రానివారిని నామినేటెడ్‌ పోస్టులతో గౌరవించుకుందామన్నారు. వార్డుల వారీగా ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, పురపాలక ఎన్నికల్లో పాల్గొనేవారు వార్డుల్లో సేవకులుగా ఉండాలని హరీశ్‌రావు అన్నారు.