Food

బెల్లం…తియ్యని ఔషధం

Jaggery Is The Best Sugar-Telugu Food And Diet News

ప్రకృతి సంపదను ఆరోగ్యం కోసం ఆహారంగా, ఔషధాలుగా మలచుకోవడం ఆయుర్వేద శాస్త్ర విశిష్టత. ఆరు రుచులలోనూ (తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు) మధుర రసానిదే అగ్రస్థానం. కొన్ని పదార్థాలు నాలుకకు తగలగానే తీపి స్ఫురిస్తుంది. కొన్నింటిలో తీపి అంతర్లీనంగా అనురసంగా ఉంటుంది. వివిధ ఫలాలు, దుంప జాతులు, కొబ్బరి నీళ్ల వంటి ద్రవ్యాలలోని మాధుర్యం అందరికీ తెలిసినదే. బయటకు గట్టిగా కర్రలా ఉన్నా, చెరకులో నిండుగా తీపి ఉంటుంది. చెరకును సంస్కృతంలో ఇక్షు అంటారు.
***మన దేశంలో చాలాకాలంగా ఇక్షు రసం నుంచి బెల్లం (గుడం) తయారుచేస్తున్నారు. ఔషధాల తయారీలో, వంటకాలలో బెల్లాన్ని ఉపయోగిస్తారు. సితా (పటిక బెల్లం), ఖండ శర్కర (ఇసుకలా అతి సన్నగా ఉన్న పంచదార), మధు శర్కర (తేనె నుంచి తయారైన పంచదార)… ద్రవ్యాల ప్రయోజనాల గురించి భావప్రకాశ సంహితలో కనిపిస్తుంది. కాని వీటి తయారీ గురించి కనపడదు. ఈనాడు రసాయనిక పదార్థాలతో తయారుచేస్తున్న పంచదారకు, నాటి సహజ సిద్ధమైన శర్కరలకు చాలా తేడా ఉంది. బెల్లం అమోఘమైన పోషకాహారం.
***చెరకు బెల్లం – సశాస్త్రీయ వివరాలు
*చెరకు రసం:
శరీరానికి చలవ చేస్తుంది. వీర్యవర్థకం, కఫకరం. కాచిన చెరకు రసం శరీరం లో వేడిని ఉత్పత్తి చేస్తుంది. కడుపులోని వాయువుని, కడుపు నొప్పిని పోగొడుతుంది. నిల్వ చేయటం వలన పులిసిన చెరకు రసం మంచిది కాదు (కొన్ని గంటలపాటు పులిస్తే పరవాలేదు). మలమూత్రాలను సాఫీగా జారీ చేస్తుంది.
**గుణాలు:
తియ్యగా, జిగురు (స్నిగ్ధం) గా ఉంటుంది. వాతహరం. కొంతవరకు వేడిని తగ్గిస్తుంది, కాని శర్కరంత చలవ చేయదు. మూత్రాన్ని సాఫీగా చేసి మూత్ర వికారాలను తగ్గిస్తుంది. వృష్యం (శుక్రకరం, వీర్యవర్థకం), బలవర్థకం. దేహంలో కొవ్వును (మేదస్సు) పెంచుతుంది. కఫాన్ని, క్రిములను పెంచుతుంది.
(ఇక్షో రసో యస్సపక్వో జాయతే… సగుడౌ… వృష్యో గురుః స్నిగ్ధో వాతఘ్నో మూత్ర శోధనః‘ నాతి పిత్త హరో మేదః కఫ కృమి బలప్రదః)
*కొత్త బెల్లం:
జఠరాగ్నిని పెంచుతుంది, కాని కఫాన్ని, కృములను కలుగచేస్తుంది. దగ్గు, ఆయాసాల ను పెంచుతుంది. (గుడో నవః కఫ శ్వాస కాస కృమి కరో అగ్నికృత్‌)
*పాత బెల్లం:
చాలా మంచిది (పథ్యం). లఘువు అంటే తేలికగా జీర్ణమై శరీరాన్ని తేలికపరుస్తుంది. వేడిని తగ్గించి కొవ్వును కరిగిస్తుంది. జఠరాగ్నిని పెంచి, పుష్టిని కలిగిస్తుంది. వృష్యం. రక్తదోషాన్ని పోగొడుతుంది. వాతరోగాల్ని తగ్గిస్తుంది.
*గుడో జీర్ణ లఘుః పథ్యో న అభిష్యంది అగ్ని పుష్టికృత్‌
పిత్తఘ్నో మధురో వృష్యో వాతఘ్నో అసృక్‌ ప్రసాదనః
*ఔషధ గుణాలు:
బెల్లాన్ని శుంఠి (శొంఠి)తో కలిపి సేవిస్తే, అన్నిరకాల వాతరోగాలు తగ్గుతాయి. అల్లంతో కలిపి సేవిస్తే కఫవ్యాధులు పోతాయి. కరక్కాయ చూర్ణంతో కలిపి సేవిస్తే, అన్ని పిత్తరోగాలు ఉపశమిస్తాయి. ఇది మూలవ్యాధి (పైల్స్‌)ని తగ్గించడానికి మంచి మందు.
*మత్స్యండీ:
చెరకు రసాన్ని ఒక పద్ధతిలో వేడి చేస్తూ బెల్లాన్ని తయారుచేసేటప్పుడు, చివరన కొంచెం ద్రవాంశలు మిగిలిపోతాయి. దానినే మత్స్యండీ అంటారు. ఇది బలకరం, మృదురేచకం, రక్తశోధకం, వీర్యవర్ధకం.
(మత్స్యండీ భేదినీ, బల్యా, బృంహణీ వృష్యా, రక్తదోషాపహాః స్మృతా)
**ఆధునిక జీవరసాయన పోషక వివరాలు:
తాటి బెల్లం, ఖర్జూర బెల్లం, కొబ్బరి బెల్లాలు కూడా తయారీలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం చెరకు »ñ ల్లాన్నే ఎక్కువ వాడుతున్నారు. దీనిలోని పోషకల విలువలు కూడా విశిష్టం. నూరు గ్రాముల బెల్లంలో ప్రొటీన్లు 0.4, కొవ్వులు 0.1, మినరల్స్‌ 0.6 శర్కరలు (కార్బోహ్రైడ్రేట్స్‌) 95 శాతం, కాల్షియం 80 శాతం, ఫాస్ఫరస్‌ 40 శాతం, ఐరన్‌ 2.64, కేలరీలు 383 ఉంటాయి.
**తయారీలో – ఆసక్తికర అంశాలు:
రిఫైన్డ్, డిస్టిలేషన్‌ చేయకుండా ఉన్నది మంచి బెల్లం. దీంట్లో కెమికల్స్‌ వాడకపోవటం వలన అన్ని పోషక ఖనిజాలు (ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్‌) భద్రంగా ఉంటాయి. మట్టిరంగు వంటి నలుపు రంగులో ఉండే బెల్లం ఉత్తమం. దీంట్లో విటమిన్లు, ఫైబర్‌ కూడా ఉంటాయి. కనుక ఆరోగ్యకరం.
*ఆర్గానిక్‌ బెల్లం (జాగరీ):
ఇది మరింత శ్రేష్ఠం. చెరకును పండించినపుడు కృత్రిమ రసాయనిక ఎరువులు గాని, క్రిమిసంహారక మందులు గాని వాడరు. బెల్లంలో తెలుపు లేదా ఎరుపు రంగు రావటం కోసం కెమికల్స్‌ (బేకింగ్‌ సోడా, కాల్షియం కార్బొనేట్‌/సున్నం పొడి, జింక్‌ ఫార్మాల్‌ డిహైడ్‌ సల్ఫాక్సిలేటు వంటివి) వాడరు. కనుక పసుపు మిశ్రిత మట్టిరంగులో చూర్ణం రూపంలో ఉంటుంది. సుక్రోజ్, యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. పొటాషియం, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు వార్థక్యాన్ని దూరం చేయటానికి ఉపకరిస్తాయి.
*కల్తీ బెల్లాలు:
నిగనిగలాడే ఎరుపు, తెలుపు, పసుపు రంగులు విరజిమ్మటం కోసం హానికర కెమికల్స్, తీపిని అధికం చేసే కెమికల్స్, నిల్వ ఉండటానికి కెమికల్స్‌ అధిక మోతాదులో కలుపుతారు. అసలైన మట్టిరంగు కంటె ఈ ఆకర్షిత రంగు బెల్లానికి వినియోగదారులు ఆకర్షితులవుతారు. పంచదార తయారీలో మితిమీరిన తెలుపు, తీపి మినహా పోషక విలువలు ఉండవు. బ్రౌన్‌ సుగర్‌లో బ్లీచింగ్‌ తక్కువ ఉంటుంది కాబట్టి కొంతవరకు నయం. తెల్లటి పంచదార తయారీ లో రసాయనిక పదార్థాలు అధికంగా ఉంటాయి. ఆ పంచదార ఆరోగ్యానికి చేటు చేస్తుంది కనుక జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.