చిన్నప్పుడు ఎవరైనా ఏమవుతావని అడిగితే వెంటనే ప్రపంచ ఛాంపియన్ అని బదులిచ్చేవాడినని భారత చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ అన్నారు. మూడు దశాబ్దాలుగా భారత చదరంగం చరిత్రలో తనదైన ముద్ర వేసిన ఆయన నూతన సంవత్సరం రోజు ఇండియా టుడే ఇన్‌స్పిరేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. తన చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ‘నేను చాలా అమాయకత్వంతో ఉన్న రోజులవి. అప్పుడు ఎవరైనా నా వద్దకు వచ్చి పెద్దయ్యాక చదరంగంలో ఏమౌతావ్ అని అడిగితే వెంటనే మరేమీ ఆలోచించకుండా ప్రపంచ ఛాంపియన్ అని బదులిచ్చేవాడిని’ అని ఆనంద్ చెప్పుకొచ్చారు. ‘నేను ఆ జవాబు చెప్పిన తర్వాత కొంత మంది వచ్చి నాతో ఒక విషయం చెప్పారు. ప్రపంచ ఛాంపియన్ అవుతానని చెప్పగానే వారంతా ఆశ్చర్యపోయామన్నారు. ఆ సమయంలో నేనలా చెప్పడానికి ప్రత్యేక కారణమంటూ ఏమీ లేదు. అలాగే విర్రవీగి కాని, దాన్ని లక్ష్యంగా పెట్టుకొని గానీ చెప్పలేదు. అది అమాయకత్వంతో చెప్పిన జవాబు’ అని వివరించారు. ఇదిలా ఉండగా ఆనంద్ 1988లో భారత్ నుంచి తొలి గ్రాండ్ మాస్టర్‌గా ఎంపికయ్యారు. 2000 నుంచి 2013 వరకు ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆయన 2013లో మాగ్నస్ కార్ల్‌సన్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక 2017లో ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ గెలుపొంది మరోసారి తన సత్తా చాటారు.
అమాయక ఛాంపియన్
Related tags :