DailyDose

బంగారం ధర 40వేలు దాటేసింది-వాణిజ్యం

Gold Price Crosses 40K INR-Telugu Business News Roundup

* మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో దేశీయ మార్కెట్లో పసిడి ధర భగ్గుమంది. వరుసగా రెండో రోజు భారీగా పెరిగింది. దేశ రాజధానిలో సోమవారం ఒక్క రోజే రూ. 720 పెరగడంతో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 41,730కి చేరి సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. ఇక వెండి ధర కూడా పుత్తడి దారిలోనే పయనించింది. ఇవాళ రూ. 1,105 పెరిగి కేజీ వెండి ధర రూ. 49,430 పలికింది. గత మూడు సెషన్లలో బంగారం ధర ఏకంగా 1800లకు పైగా పెరగడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఈ లోహాల ధరలు పెరిగాయి. కమాడిటీ ఎక్స్ఛేంజీల్లో ఔన్సు బంగారం ధర 2.3శాతం పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం, అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే దీనికి కారణం. అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు సురక్షితమని మదుపర్లు భావించడంతో పసిడి, వెండిపైకి పెట్టుబడులు ప్రవహించాయి. ఫలితంగా ఈ లోహాల ధరలు పెరిగినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తెలిపింది.

* దలాల్‌స్ట్రీట్‌ బేర్‌మంది.. సూచీలు బెంబేలెత్తిపోయాయ్‌.. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ భయాలు మార్కెట్లను తీవ్రంగా కలవరపెట్టాయి. దీనికి తోడు దేశీయంగా అమ్మకాలు మరింత కుదిపేశాయి. ఫలితంగా సోమవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు కుప్పకూలాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ ఏకంగా 750 పాయింట్లకు పైగా పతనమవగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 12వేల దిగువకు పడిపోయింది.

* ప్రముఖ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ అమెజాన్‌ ఇండియా.. రిటైల్‌ దిగ్గజం ఫ్యూచర్‌ గ్రూప్‌తో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకొంది. దీంతో ఫ్యూచర్‌ గ్రూప్‌ రిటైల్‌ స్టోర్లలో లభించే వస్తువులు వినియోగదారులకు మరింత చేరువకానున్నాయని అమెజాన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన ‘ఫ్యూచర్‌ కూపన్స్‌ లిమిటెడ్‌’లో 49శాతం వాటాల్ని కొనేందుకు ఇటీవలే అమెజాన్‌ అంగీకరించింది. ఫ్యూచర్‌ కూపన్స్‌ లిమిటెడ్‌కు ‘ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌’(ఎఫ్‌ఆర్‌ఎల్‌)లో వాటాలుండడం గమనార్హం. తాజా ఒప్పందంతో ఫ్యాషన్, ఫుట్‌వేర్ వంటింటి, ఇతర సాధారణ వస్తువులు అమెజాన్‌ ఆన్‌లైన్‌ ద్వారా వినియోగదారులకు అందించనున్నారు. అలాగే ఎఫ్‌ఆర్‌ఎల్‌ స్టోర్స్‌కి అమెజాన్‌ ఇండియా అధికారిక సేల్స్‌ ఛానెల్‌గా మారనుంది.

* భారత్‌ జీడీపీ వృద్ధిరేటు ఇప్పటికే 5శాతం కంటే తక్కువకు చేరింది.. దీనికి తోడు ఇప్పటికే ఉల్లిపాయల ధరలు పెరిగి ప్రభుత్వానికి, ప్రజలకు కన్నీరు పెట్టించాయి. మరోపక్క దాదాపు ఆరునెలల నుంచి క్రమంగా పెరుగుతున్న చమురు ధరలు కూడా తోడవుతున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక.. వసూళ్లు క్రమంగా తగ్గిపోయాయి. గత నెల కొంత మెరుగ్గా ఉన్నా.. అంతకుముందు నెలల్లో భారీగానే తగ్గుముఖం పట్టింది. ద్రవ్యలోటును కట్టడి చేయడానికి ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం కూడా అనుకున్నంత ముందుకు సాగలేదు. దీంతో ఎయిర్‌ఇండియా మరింతగా అప్పుల సుడిలో చిక్కుకుపోయే పరిస్థితి నెలకొంది. దీంతో ద్రవ్యలోటు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

* ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ బీఎస్‌-వీ ప్రమాణాలు కలిగిన యాక్సెస్‌ 125 స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ధరను రూ. 64,800-69,500 (ఎక్స్‌ షోరూమ్‌ దిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. స్టాండర్డ్‌ వేరియంట్‌తో పాటు అల్లాయ్‌ డ్రమ్‌ బ్రేక్‌, అల్లాయ్‌ డిస్క్‌ బ్రేక్‌, స్టీల్‌ డ్రమ్‌ బ్రేక్‌ ఆప్షన్లు కలిగిన స్పెషల్‌ వేరియంట్‌ను కూడా బీఎస్‌-వీ ప్రమాణాలతో తీసుకొస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. స్టాండర్డ్‌ వేరియంట్‌ ధరను రూ.64,800గా నిర్ణయించగా.. స్పెషల్‌ ఎడిషన్‌ ధర రూ.68,500 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది.

* ఇరాన్‌-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధర పెరగడం, రూపాయి క్షీణించడంతో ఈ ఉదయం సూచీలు కుప్పకూలాయి. దీనికి తోడు దేశీయ కంపెనీల డిసెంబరు త్రైమాసిక ఫలితాలపై మదుపర్లు దృష్టిపెట్టడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది. దీంతో సోమవారం నాటి ట్రేడింగ్‌ను సూచీలు భారీ నష్టాలతో ప్రారంభించాయి. 300 పాయింట్ల నష్టంతో మొదలైన బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ కాసేపటికే మరింత దిగజారింది. ఉదయం 9.40 గంటల ప్రాంతంలో 459 పాయింట్లు నష్టపోయి 41,005 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అటు జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ కూడా 138 పాయింట్ల నష్టంతో 12,089 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 26 పైసలు క్షీణించి 72.05గా ట్రేడ్‌ అవుతోంది. ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

* ప్రభుత్వం 2020 బడ్జెట్‌లో బ్యాంకులకు మూలధన నిధులను సమకూర్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మొండిబకాయిల వసూలును ప్రోత్సహించే విధంగా, మార్కెట్ల నుంచి నిధులు సేకరించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించనుంది. ముఖ్యంగా నిధుల సేకరణకు బ్యాంకుల ఇతర వ్యాపారాలను(నాన్‌ కోర్‌ బిజినెస్‌)విక్రయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు ఎన్‌సీఎల్‌టీ, ఎన్‌సీఎల్‌టీ యేతర మార్గాల్లో మొండిబకాయిల వసూలు ఆశాజనకంగా ఉండటంతో మూలధన అవసరాలను ఈ మార్గంలో తీర్చుకోవచ్చని భావిస్తున్నారు. దీంతోపాటు ప్రొవిజన్ల కవరేజీ నిష్పత్తి కూడా ఏడేళ్లలో అత్యధికంగా 76.6శాతానికి చేరింది.