DailyDose

జగన్ చిత్రపటానికి నలుపు రంగు-నేరవార్తలు

YS Jagan Photo Vandalized In Gannavaram-Telugu Crime News Roundup

* మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్‌ చేస్తున్న పాకిస్తాన్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులను గుజరాత్‌ పోలీసులు అరెస్టు చేశారు. పాక్‌ వ్యక్తుల నుంచి 35 కేజీల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ. 175 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. తీరప్రాంతం గుండా డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తున్నారని యాంటీ టెర్రరిస్ట్‌ స్కాడ్‌(ఏటీఎస్‌), గుజరాత్‌ పోలీసులకు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో తీర ప్రాంతంలో పోలీసులు గస్తీ నిర్వహించారు. పాకిస్తాన్‌ నుంచి చేపల బోటులో వచ్చిన ఐదుగురి వద్ద హిరాయిన్‌ను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అన్నీస్‌(30), ఇస్మాయిల్‌ మహ్మమద్‌(50), ఆష్రఫ్‌ ఉస్మాన్‌(42), కరీం అబ్దుల్లా(37), అబుబాకర్‌ ఆష్రఫ్‌(55)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

* గన్నవరం మండలం కేసరపల్లి పంచాయతీ కార్యాలయం గోడపై ఉన్న ముఖ్యమంత్రి జగన్‌ చిత్రపటానికి గుర్తుతెలియని వ్యక్తులు నల్లరంగు పూశారు. అక్కడే రాసి ఉన్న పథకాల వివరాలపైనా గీతలు గీశారు. ఘటనపై పంచాయతీ కార్యదర్శి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

* ఎయిర్ కెనడాకు చెందిన ఓ విమానం టేకాఫ్ అవుతోంది. ప్రయాణికులంతా సీట్‌బెల్టులు పెట్టుకొని ప్రశాంతంగా కూర్చున్నారు. ఇంతలో ఓ ప్రయాణికుడు చెప్పిన మాట అక్కడ బాంబులా పేలింది. ఇంతకీ అతనేం చెప్పాడో తెలుసా? విమానం సరిగ్గా గాల్లోకి లేచినప్పుడు ల్యాండింగ్ గేర్‌కు సంబంధించిన ఓ చక్రం ఊడిపోయింది. కిటికీ పక్కనే కూర్చున్న సదరు ప్రయాణికుడు ఆ చక్రం మధ్యలోంచి నిప్పులు రావడం చూసి దాన్ని వీడియో తీశాడు. తీరా విమానం అలా గాల్లోకి లేవగానే ఆ చక్రం ఊడి కిందపడిపోయింది. దీంతో భయపడిపోయిన అతను వెంటనే విమాన సిబ్బందికి సమాచారమిచ్చాడు. ఈ విషయాన్ని పైలట్ విమానాశ్రయ అధికారులకు తెలియజేశాడు. దీంతో వారు విమానం అత్యవసర ల్యాండింగ్ కోసం చర్యలు తీసుకున్నారు. దాదాపు రెండు గంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన ఆ విమానం కాసేపటికి మళ్లీ విమానాశ్రయంలో ల్యాండయింది.

* కాజీపేట్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ రైలు ఇంజన్‌ పట్టాలు తప్పింది. ట్రైన్‌ ఇంజన్‌ మార్చడానికి వెళ్తున్న క్రమంలో ప్రమాదావశాత్తు ఈ ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు కాజీపేట్‌ స్టేషన్‌లోనే నిలిపారు. గన్‌పూర్‌ స్టేషన్‌లో దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. దీంతో ప్రయాణీకులు అసౌకర్యానికి గురయ్యారు. కాగా, రైల్‌ ఇంజన్‌ను పట్టాలపై నుంచి పూర్తిగా పక్కకు జరిపిన సిబ్బంది, మరమ్మతులు చేపట్టారు. దీంతో, రైళ్ల రాకపోకలకు మార్గం సుగమమైంది.

* బళ్లారిలో అగ్ని ప్రమాదం జరిగింది. సంజీవరాయణ ఫోర్ట్ తాలూకాకు చెందిన ఓ ఇంట్లో సిలిండర్ పేలి తల్లి, కుమార్తె మృతి చెందారు. సిలిండర్​ పేలుడు ధాటికి మంటలు భారీగా చెలరేగాయి. ఉదయం 8గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు తల్లి పార్వతి, కుమార్తె హులిగేగా పోలీసులు తెలిపారు. కొద్దికాలంగా భార్యాభర్తల మధ్య కోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో తల్లీకూతురే సిలిండర్​కు నిప్పంటించి ఆత్మహత్య చేసుకొని ఉంటారని భావిస్తున్నారు పోలీసులు.

* మద్యం మత్తులో దారుణం.. అనంతగిరి మండలం జీలికపాడు గ్రామంలో 68 ఏళ్ల వృద్ద మహిళలపై 25 ఏళ్ల యువకుడు అర్థరాత్రి అత్యాచారం.. యువకునికి దేహశుద్ది చేసిన గ్రామస్తులు.. మహిళ పరిస్తితి విషమం.. ఎస్.కోట చ్చ్ లో వైద్యసేవలు.. నిందితుడు దేవాబత్తుల రఘును అదుపులోకి తీసుకున్న అనంతగిరి పోలీసులు..

* జీతాలు ఇవ్వలేదని సెక్యూరిటీ గార్డులు నిరసన చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తి దేవస్థానం సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు నాలుగు నెలలుగా జీతం ఇవ్వలేదంటూ ఆలయంలోని కార్యనిర్వహణ అధికారి కార్యాలయం వద్ద సెక్యూరిటీ గార్డులు నిరసన తెలియజేసారు. అనంతరం ఆలయసెక్యూరిటీ గార్డులు మాట్లాడుతూ తాము ప్రైవేటు సంస్థనుంచి 150 మంది సెక్యూరిటీ గార్డులుగా ఈ దేవస్థానంలో పనిచేస్తున్నామని దాదాపుగా నాలుగునెలల నుంచి జీతబత్యాలు ఇవ్వకపోవడంతో మా కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ జీతాలను ఇవ్వమంటూ అటు తమ సంస్థ ఉన్నత ఉద్యోగుల కోరిన ఇటు ఆలయ అధికారాలను కోరిన మొండిచేయి చూపిస్తున్నారని దీంతో పండుగ దినాన కూడా పస్తుఉండవలసి పరిస్థితి తమకు ఏర్పడిందని అంటూ ఆలయం వద్ద నిరసన తెలియజేస్తూ సెక్యూరిటీ గార్డులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

* చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం ,కాళెేపల్లి, దళిత వాడకు చెందిన గోపాల్ భార్య భారతికి గత కొన్ని సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన దినకర్(25)తో అక్రమ సంబంధం ఉండేది.ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి గోపాల్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో భార్య భారతి ప్రియుడు దినకర్ ను ఇంటికి పిలిపించుకుని , భర్త గోపాల్ పై కత్తితో దాడి చేసి హతమార్చడానికి ప్రయత్నించారు.మెలకువ వచ్చిన గోపాల్ వారిని ఎదుర్కొని చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. గాయపడ్డ గోపాల్ ను స్థానికులు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్చగా చికిత్సపొందుతున్నాడు.చాతీ,భుజము,గడ్డము పై గాయాలకు15 కుట్లు పడినట్లు పోలీసులు తెలిపారు.ప్రస్తుతం భార్య భారతి పోలీసుల అదుపులో ఉండగా ప్రియుడు దినకర్ పరారీలో ఉన్నాడు.ఇదిలావుండగా గతంలో కూడా వీరి అక్రమ సంబంధంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులున్నాయి .