*మాజీ మంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు భాజపాలో చేరారు. దిల్లీలో ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావుతో కలిసి నడ్డాతో ఆయన భేటీ అయ్యారు. మోత్కుపల్లికి నడ్డా భాజపా కండువా కప్పి సభ్యత్వ రశీదు అందజేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ మోత్కుపల్లి రాక తెలంగాణలో భాజపా బలోపేతానికి తోడ్పడుతుందన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా మారుతోందని చెప్పారు. తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన సమ్మక్క-సారక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. ఈ అంశంపై పలువురు కేంద్రమంత్రులను కలిశామని చెప్పారు.
* అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: పవన్
అమరావతి రాజధాని రైతులు ప్రజాస్వామిక పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలిపితే ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. చినకాకాని వద్ద రైతులతో పోలీసులు వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదన్నారు. రైతులను, మహిళల్ని భయపెట్టి వారిని నిరసన నుంచి దూరం చేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. నిరసనలు ప్రారంభం కాకముందే తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్‌ను గృహనిర్బంధంలో ఉంచారన్నారు. పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాస్‌ను కారణం చెప్పకుండానే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో ఆందోళనలను ఆపగలమని ప్రభుత్వం భావిస్తే అది పొరపాటే అవుతుందన్నారు. చినకాకానిలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై ఆయన మంగళవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు.
* అభివృద్ధే ధ్యేయంగా వైఎస్ఆర్సిపి పాలన — మంత్రి తానేటి వనిత.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం లోని కొవ్వూరు పట్టణంలో సీసీ రోడ్లు శంకుస్థాపన కార్యక్రమలలో పాల్గొన్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, మరియు ఎంపీ మార్గాని భరత్ . ఈ కార్యక్రమంలో మంత్రి వనిత మాట్లాడుతూ …..రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత గడిచిన ఆరు నెలల కాలంలోనే విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యత కల్పించడం జరిగింది.అదే బాట లోనే ప్రస్తుతం మౌలిక సదుపాయాలకు అంతే ప్రాధాన్యత కల్పిస్తున్నారు.కొవ్వూరు నియోజకవర్గం లోని కొవ్వూరు పట్టణంలో సుమారుగా పదో వార్డు కు 26 లక్షలు , 20వ వార్డు కు 37 లక్షలు , 23 మూడో వార్డుకు 31 లక్షలు ను 14 ఫైనాన్స్ నిధుల నుండి సిసి రోడ్లకు కేటాయించడం జరిగింది.
* నగరి ఎమ్మెల్యే,ఏపీఐఐసి చైర్మన్ రోజా కామెంట్స్
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే ప్రభుత్య విప్ పిన్నిల్లి రామకృష్ణరెడ్డిపై దాడిని తీవ్రంగా కండిస్తున్నాంచిత్తుగా ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు భరించలేక ఇలాంటి దాడులు చేయిస్తున్నాడుచంద్రబాబు వెనకనుండి చేతకాని రాజకీయ్యం చేస్తున్నాడుసినిమాల్లోనే ఇలాంటి దాడులు చూస్తాం..రైతుల పేరుతో టీడీపీ రౌడీలు దాడులు చేస్తున్నారు వైసీపీ ప్రభుత్యం ఎల్లపుడు ప్రజలకోసం పని చేస్తుంది…రైతులకు అన్ని విధాలా ప్రభుత్య అండగా ఉంటుంది
* రాజధాని సమస్య సృష్టించింది వైసీపీనే: సోమిరెడ్డి
రాజధాని సమస్య సృష్టించింది వైసీపీనేనని మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శాంతియుతంగా రైతులు ఆందోళన చేస్తుంటే.. ఏదో జరిగినట్లు పిన్నెల్లి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 5 కోట్ల మంది భవిష్యత్‌ను కమిటీ 5 రోజుల్లో తేల్చేస్తుందా?, జగన్ తలకిందులుగా తపస్సు చేసినా రాజధానిని మార్చలేరు?, ప్రధాని శంకుస్థాపన చేసి నిధులు ఇచ్చాక నువ్వేంటి మార్చేది?, కేంద్రం చూస్తూ ఊరుకోదని తెలిపారు.
*ఎమ్మెల్యే పిన్నెల్లి కారుపై రాళ్ల దాడి
వైఎస్‌ఆర్‌సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై రాళ్ల దాడి జరిగింది. ఏపీలోని గుంటూరు జిల్లా చినకాకాని వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రాళ్లదాడిలో పిన్నెల్లి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పిన్నెల్లి గన్‌మెన్‌లపై ఆందోళనకారులు పిడిగుద్దులు కురిపించారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆందోళనకారులు ఎమ్మెల్యే వాహనాన్ని చుట్టుముట్టి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అరగంట తర్వాత ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చినకాకాని నుంచి పిన్నెల్లిని సురక్షితంగా తీసుకెళ్లారు.
*చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు: ఎమ్మెల్యే రోజా
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలన్నారు. ఎమ్మల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి టీడీపీ కుట్రే అన్నారు. చంద్రబాబు వల్లే ఏపీకి రాజధాని లేకుండా పోయిందన్నారు. రైతులను చంద్రబాబు సర్వనాశనం చేశారన్నారు. మూడు రాజధానులకు ఓకే అన్న గంటా శ్రీనివాస్‌రావుపై ఎందుకు దాడులు చేయడం లేదని ప్రశ్నించారు. అన్నం పెట్టే రైతులు దాడి ఎందుకు చేస్తారు? రైతుల ముసుగులో టీడీపీ నాయకులే పిన్నెల్లిపై దాడికి పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు.
* బెంజి సర్కిల్ వద్ద నారా లోకేశ్ అరెస్టు
అమరావతి రైతులకు మద్దతుగా చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధంలో పాల్గొనేందుకు బయల్దేరిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే పలువురు తెదేపా నేతలను గృహనిర్బంధంలో ఉంచిన పోలీసులు లోకేశ్‌తో పాటు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే రామానాయుడిని విజయవాడ బెంజిసర్కిల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. రాజధాని రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేపట్టిన దీక్షలో పాల్గొని లోకేశ్ తిరిగి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అవనిగడ్డ- విజయవాడ కరకట్ట రహదారి మీదుగా తెదేపా నేతలను తీసుకెళ్లారు. తోట్లవల్లూరు పోలీసు స్టేషన్‌కు లోకేశ్‌ను తీసుకెళ్లనున్నట్టు సమాచారం.
* విజయలక్ష్మి, భారతి గురించి మేం మాట్లాడలేమా?: లోకేష్
నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు చేపట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్ష ముగిసింది. ఈ దీక్ష ముగింపు కార్యక్రమంలో టీడీపీ నేత నారా లోకేష్ పాల్గొని గద్దెకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రాజధానులు కాదు.. మూడు ముక్కల రాజధాని చేశారని విమర్శలు గుప్పించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వైఖరితో పరిశ్రమలన్నీ తెలంగాణకు వెళ్లాయన్నారు. రాజధాని కోసం కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని ఈ సందర్భంగా లోకేష్ డిమాండ్ చేశారు.
* వైసీపీ ఎమ్మెల్యే వాహనంపై రాళ్ల దాడి…
మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని చినకాకాని హైవేపై రైతులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కారును చుట్టుముట్టి నినాదాలు చేశారు. అయితే ఎమ్మెల్యే కారును ఆపకుండా ముందుకెళ్లడంతో కొందరు రైతులు రాళ్లతో దాడి చేశారు. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రైతులను నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం చినకాకాని వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంగళగిరి మండలం, చినకాకాని వద్ద రైతుల మంగళవారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు. దీంతో చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై రెండు గంటలపాటు ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. రోడ్డుకిరువైపులా 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా రైతులు తరలిరావడంతో పోలీసులు కట్టడిచేయలేక చేతులెత్తేశారు.
* రాష్ట్రవ్యాప్తంగా భూములు దోచుకునే కుట్ర: కనకమేడల
రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ ఐక్యంగా పోరాడాలని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా భూములు దోచుకునే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం రాజధానిని ఒకే చోట ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పథకాలు, అభివృద్ధి కనిపించకూడదని కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విభజన కన్నా… జగన్ పాలన వల్లే ఎక్కువ నష్టం జరుగుతోందన్నారు. మూడు రాజధానుల వల్ల హింస, దాడులు, అభద్రత పెరుగుతాయని తెలిపారు. జగన్ మొండిగా ముందుకెళ్తే చట్టసభల్లో పోరాడతామని ఎంపీ కనకమేడల స్పష్టం చేశారు.
* ఏసీపీని అడ్డుకున్న ఎమ్మెల్యే; తీవ్ర విమర్శలు
చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధుల్లో భాగంగా పాతబస్తీలోని శాలిబండలో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్న ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్‌ని ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్, ఎంఐఎం నేతలు సీఏఏ వంకతో అడ్డుకున్నారు. ప్రజలందరి ముందే ఎమ్మెల్యే ఏసీపీ మహ్మద్ మజీద్‌ని నిలదీశారు. దీంతో ఏసీపీ, సిబ్బంది చేసేదేం లేక తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. కాగా, పోలీసుల తీరుపైనా ప్రజలు మండిపడుతున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణ పోలీసులకే తలవంపులు వచ్చాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. విధులకు ఆటంకం కలిగించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే పోలీసులు వెనుదిరిగారని ఎద్దేవా చేస్తున్నారు.
* ఎన్నికలంటే ప్రతిపక్షాలకు భయం : మంత్రి ఈటల
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు కనబడుతాయని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికలంటే ప్రతిపక్షాలకు భయమని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీదే విజయమని తేల్చిచెప్పారు. కౌన్సిలర్ల ఎన్నిక తర్వాతనే మున్సిపల్ ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియ ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వడంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలను ఓట్లు అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
* ఈ నెల 13న కేసీఆర్-వైఎస్ జగన్‌ల సమావేశం
ఈ నెల 13న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ భేటీకి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వేదిక కానుంది.! ఇప్పటికే పలుమార్లు తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి పలు విషయాలపై చర్చించుకున్న సంగతి తెలిసిందే. అయితే.. త్వరలో జరగనున్న ఈ భేటీలో ఏమేం చర్చించబోతున్నారు..? అసలు భేటీ ఎందుకు జరుగుతోంది..? నదుల అనుసంధానం గురించి సమావేశం జరగనుందా..? లేకుంటే మరేమైనా రాజకీయ కారణాలున్నాయా..? అనేది మాత్రం తెలియారాలేదు.
*గజ్వేల్‌లో టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యం: రేవంత్
గజ్వేల్‌లో టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ కేసీఆర్…రాష్ట్ర పాలనను గాలికొదిలేసి కుటుంబ సభ్యులకు పదవుల పంపకంపై మల్లగుల్లాలు పడుతున్నారని విమర్శలు గుప్పించారు. పోలీసు కేసులతో ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తున్నారని… కేసులకు భయపడేదిలేదని, నిరంతరం ప్రజల్లోనే ఉంటామని స్పష్టం చేశారు. కేసీఆర్ దుష్టపాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు
*మాచర్ల ఎమ్మెల్యే కారుపై రైతుల దాడి
రాజధాని రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. గుంటూరు సమీపంలోని చినకాకాని వద్ద జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. ఈక్రమంలో అటుగా వచ్చిన మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కారును రైతులు అడ్డుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేయడంతో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళన కారులపై పోలీసులు లాఠీఛార్జి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరుకు నిరసనగా పలువురు వాహనాలపై రాళ్లురువ్వారు.
*ప్రజలంటే ప్రభుత్వానికి ఎందుకంత భయం.- కళా వెంకట్రావు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
నిన్న రైతులు చేసిన కవాతుకు ప్రభుత్వంలో భయం పట్టుకుంది.రైతులను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.ప్రజలను అడ్డుకోవడం ప్రభుత్వ పిరికిపంద చర్య.తెలుగుదేశం నేతలు, కార్యకర్తల అక్రమ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నాం.అరెస్ట్‌చేసిన రైతులు, తెలుగుదేశం నాయకులను వెంటనే విడుదలచేయాలి.ప్రభుత్వం భయపడుతోంది కాబట్టే అరెస్టులతో భయపెట్టాలని చూస్తోంది.ఎన్ని భయభ్రాంతులకు గురిచేసినా ప్రజా ఉద్యమం ఆగదు.
*హౌస్ అరెస్ట్‌పై ఎంపీ గల్లా సీరియస్
గృహ నిర్బంధంపై ఎంపీ గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎందుకు హౌస్ అరెస్టు చేశారో చెప్పాలని గల్లా పోలీసులను నిలదీశారు. టీడీపీలో ఉంటే ఇష్టానుసారంగా అరెస్ట్‌లు చేస్తారా అని మండిపడ్డారు. తాను బయటకు వెళ్తే ఏం చేస్తారో చేసుకోండన్నారు. పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోవాలా అని ఎంపీ గల్లా జయదేవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు హైవే దిగ్బంధానికి పొలిటికల్ జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ముఖ్య నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
*వెనక్కి తగ్గకపోతే ఉద్యమం ఉద్ధృతం: నక్కా
రాజధాని అంశంపై వైకాపా నాయకులు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. వైకాపా తప్ప రాజధాని అమరావతికి అన్ని ప్రాంతాలు మద్దతు తెలుపుతున్నాయని అన్నారు. ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్కు కనిపించడం లేదని దుయ్యబట్టారు. ‘ మన రాజధాని- మన అమరావతి’ నినాదంతో తెనాలి మార్కెట్ సెంటర్లో అఖిలపక్ష ఐకాస ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. దీనికి ఆనందబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిపై వారం రోజుల్లో నివేదికలు రావడం అంతుబట్టని విషయమన్నారు. విశాఖలో స్థిరాస్తి వ్యాపారం కోసమే రాజధాని పేరు పెడుతున్నారని ఆరోపించారు. రాజధాని మార్పుపై వెనక్కి తగ్గకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
*ఉద్ధవ్ ప్రభుత్వంపై గడ్కరీ కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీది అపవిత్ర కూటమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుందని వ్యాఖ్యానించారు. సీఏఏకి మద్దతుగా భాజపా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయనిక్కడ మీడియాతో మాట్లాడారు.
*ప్రభుత్వంతో ఎన్నికల సంఘం కుమ్మక్కు-టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్నికల సంఘం కుమ్మక్కై పురపాలక ఎన్నికలను హడావుడిగా నిర్వహిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. ఆదివారం సూర్యాపేటలో నిర్వహించిన పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. నామినేషన్ల దాఖలుకు అవసరమైన పత్రాలు తెచ్చుకోవడానికి సమయం ఇవ్వకుండా షెడ్యూలు ప్రకటించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రిజర్వేషన్ల ప్రకటన తర్వాత వారం రోజుల గడువుకు సంబంధించి తాము హైకోర్టును ఆశ్రయిస్తే.. ఎన్నికలకు భయపడుతున్నారని తెరాస నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు.
*చట్టాన్ని అమలు చేయబోమని తీర్మానించాలి: సీపీఎం
జాతీయ పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక, జాతీయ జనాభా పట్టికలను తెలంగాణలో అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. బి.వెంకట్ అధ్యక్షతన సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ భేటీలో ఈ మేరకు తీర్మానించారు.
*ఒవైసీ కనుసన్నల్లో రాష్ట్ర ప్రభుత్వం: లక్ష్మణ్
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కనుసన్నల్లో తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. మోదీ నిర్ణయాలతో భయాందోళనకు గురై కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కావాలనే కొన్ని వర్గాల ప్రజలను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. ఆదివారం నల్గొండ జిల్లా దేవరకొండలో పౌరసత్వ సవరణ చట్టంపై జరిగిన అవగాహన సదస్సులో లక్ష్మణ్ మాట్లాడారు. మాయమాటలతో ముస్లిం సోదరులను.. కాంగ్రెస్, వామపక్షాలు, తెరాస నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల నిజామాబాద్లో ఒవైసీ నిర్వహించిన సమావేశానికి తెరాస ఎమ్మెల్యేలు హాజరయ్యారంటేనే ఎంఐఎం పార్టీకి ఎంత దాసోహమయ్యారో తెలుస్తోందన్నారు. తెరాస అంటే తెలంగాణ రజాకార్ల సమితిగా పేరు మార్చుకోవాలని వ్యాఖ్యానించారు.
*రాహుల్ సీఏఏపై పది పాయింట్లు చెప్పగలరా?’
భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. సీఏఏ వల్ల భారత పౌరులకు కలిగే సమస్యలేమిటో రాహుల్గాంధీ ముందుకు వచ్చి సరిగ్గా పది పాయింట్లు మాట్లాడాలని సవాల్ విసిరారు. అసోంలోని గువహటిలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో నడ్డా మాట్లాడ. ‘మతపరమైన హింస కారణంగా మిలియన్ల మంది ప్రజలు రాత్రికి రాత్రి దేశాన్ని మారవల్సి వచ్చింది
*విశాఖ కేంద్రంగా ఇన్సైడర్ ట్రేడింగ్
మాజీ ఎంపీ రాయపాటి
రాజధాని మార్పు వ్యవహారాల్లో విశాఖను కేంద్రంగా చేసుకొని ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతోందని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆరోపించారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ విశాఖలో భూములను నోటిఫై చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే డబ్బులు రావని అందుకే విశాఖ వెళ్లి అక్కడ భూములు కొనుగోలు చేస్తున్నారన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.
*కేసీఆర్కు నాగం బహిరంగ లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే తెలంగాణలోని పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రకటనలపై తెరాస సర్కార్ ఎందుకు స్పందించడంలేదని నాగం లేఖలో ప్రశ్నించా
*ఎన్నికల సంఘంతో తెరాస కుమ్మక్కు
రిజర్వేషన్లు ఖరారు చేయకుండా, తుది ఓటర్ల జాబితా రూపొందించకుండా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం వెనుక కుట్ర దాగి ఉందని భాజపా ఆరోపించింది. ప్రతిపక్ష పార్టీలు న్యాయస్థానానికి వెళ్లే అవకాశం లేకుండా అధికార తెరాస, రాష్ట్ర ఎన్నికల సంఘం కలిసి నాటకం ఆడాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. ఇల్లెందు నియోజకవర్గం కాంగ్రెస్ నేత భాస్కర్నాయక్, నాగార్జునసాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు పలువురు లక్ష్మణ్ సమక్షంలో శనివారమిక్కడ కమలదళంలో చేరారు.
*సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం పెట్టాలి
పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. మిర్యాలగూడలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఏఏకి వ్యతిరేకంగా అత్యధిక రాష్ట్రాల సీఎంలు తీర్మానాలు చేస్తుంటే.. తెలంగాణలో కేసీఆర్ భాజపాకు లోపాయికారిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి కాంగ్రెస్ పూర్తి వ్యతిరేకమన్నారు. పురపాలిక ఎన్నికల్లో దొడ్డిదారిన గెలవాలన్న ఉద్దేశంతో ఇష్టారాజ్యంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పురపాలికల్లో సుమారు 4 వేల మంది అభ్యర్థులు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారని.. మూడు రోజుల్లో అభ్యర్థుల ఎంపిక, సంబంధిత పత్రాలతో వారు నామినేషన్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించారు. సమావేశంలో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి పాల్గొన్నారు.
భాజపాలో చేరిన మోత్కుపల్లి-రాజకీయ
Related tags :