WorldWonders

జనవరి 22న నిర్భయ దగ్గరకు వెళ్తున్నారు

Nirbhaya Culprits To Be Hanged On The 22nd

ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన 2012 నాటి నిర్భయ హత్యాచారం కేసులో దోషులు నలుగురికీ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు డెట్ వారెంట్ జారీ చేసింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు వీరందరినీ ఉరి తీయాలని ఆదేశాలిచ్చింది. నిర్భయ నిందితులకు ఉరిశిక్ష అమలు చేసేలా డెత్ వారెంట్ జారీ చేయాలంటూ ఆమె తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ మేరకు ఢిల్లీ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. అంతకు ముందు మధ్యాహ్నం వరకు తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ధర్మాసనం… సాయంత్రం 4.45 గంటల సమయంలో తీర్పు వెలువరించింది. 2012 డిసెంబర్ 16న 23 ఏళ్ల నిర్భయపై నిందితులు అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా వేధించారు. 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన నిర్భయ.. 29 డిసెంబర్ 2012న తుదిశ్వాస విడిచింది.కాగా తమ కుమార్తె కేసులో న్యాయం కోసం ఏడేళ్లుగా ఎదురు చూస్తున్నామనీ… కోర్టు తమకు సత్వర న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకు ఉందని నిర్భయ తల్లి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేసి వారిపై అత్యాచారం, హత్యానేరం సహా పలు అభియోగాలు మోపారు. వీరిలో ఒకరు మైనర్ కావడంతో మూడేళ్ల జైలు శిక్ష అనంతరం విడుదలై అజ్ఞాతంలో జీవిస్తున్నాడు. మరో నిందితుడు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగతా నలుగురికి మరణశిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు 2013 సెప్టెంబర్‌లో తీర్పు వెలురించింది. 2014 మార్చిలో ఈ తీర్పును ధ్రువీకరించిన సుప్రీంకోర్టు.. దీన్ని సమర్థిస్తూ 2017 మేలో తీర్పు వెలువరించింది. నిందితులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్లను సైతం సుప్రీంకోర్టు తిరస్కరించింది