Kids

కుట్టుమిషన్ కనిపెట్టింది ఈయనే

Sewing Machine Designer Life Story

ఇదొక సరికొత్త వస్త్ర ప్రపంచం. వినూత్న రీతుల్లో.. విభిన్న రంగుల్లో.. వివిధ రకాల డ్రెస్సులు మనముందు ఉంటున్నాయి. కొందరు ఫేషన్ అంటారు. మరికొందరు ప్యాషన్ అంటారు. కొత్త కొత్త మోడల్స్‌ తో మోడ్రన్ ట్రెండ్‌ను సెట్ చేస్తున్నది వస్త్రం. వస్త్రం పుట్టుక ఏంటి? అది వస్త్రమెలా అయ్యింది? విభిన్న రీతుల్లో ఎలా డిజైన్ చేయగలుగుతున్నారు? బట్టల్ని కుట్టే సాధనాన్ని ఏమంటారు? దానిని ఎవరు కనిపెట్టారు? తెలుసుకుందాం.
*ఆదిమానవుడు చెట్ల తొర్రల్లో నివసించేవాడు. చెట్ల ఆకులతో శరీరం కప్పుకునేవాడు. ఎందుకు? అప్పుడు బట్టలెక్కడివి? ఆ ఆలోచన ఎక్కడిది? మనిషి రాయిని రాయిని రాపాడించి నిప్పు పుట్టించగలిగిన తర్వాత తిండి కోసం మనసు పెట్టి ఆలోచనలు చేసిన తర్వాత శరీరాన్ని కప్పుకోవడం గురించి ఆలోచించాడు. ఆ క్రమంలో చెట్ల ఆకులనే వస్త్రంగా వాడుకున్నాడు. కానీ కాలక్రమేణా ఆలోచనా విధానంలో మార్పు ఏర్పడి దారం తయారుచేయడం.. దానితో బట్టలు నేయడం.. చుట్టుకోవడం నేర్చుకున్నాడు. మనిషి ఆలోచన పదునెక్కింది. బట్టలు చుట్టుకునే స్థాయి నుంచి బట్టల్ని శరీరాకృతినిబట్టి కుట్టుకునే స్థాయికి చేరుకున్నాడు. వస్త్రం తయారుచేసినప్పటి నుంచి చూసుకుంటే తమకు తోచిన విధంగా ఒక్కొక్కరు ఒక్కో ప్రయోగం చేస్తూ వచ్చారు. అలా ఎన్నో ఏండ్లు గడిచాయి. ఆధునిక పరిజ్ఞానం రూపుదిద్దుకున్న తర్వాత బట్టలు కుట్టేందుకు ఒక సాధనం కనుక్కోవాలనే ప్రయోగాలెన్నో జరిగాయి. ఎవరి ప్రయత్నం వారు చేశారు. అలా ఎన్నో ప్రయోగాల ఫలితమే కుట్టుమిషన్.
*ఆధునిక యుగంలో కుట్టుమిషన్ లేని జీవితాన్ని ఊహించగలమా? మొదట్లో కుట్టుపని అంతా చేతులతోనే జరిగేది. అలా ఎంతసేపు కుడతాం? ఎన్ని బట్టలని కుడతాం? అందుకే ఐజాక్ మెరిట్ సింగర్ అనే సాదాసీదా వ్యక్తి ఇప్పుడు మనం వాడుతున్న కుట్టు మిషన్‌ను రూపొందించాడు. అయితే మెరిట్ సింగర్ కన్నా ముందు కుట్టుమిషన్‌ను ఎలియాస్ హోవే అనే అమెరికన్ కనిపెట్టాడు. కానీ ఆధునిక పద్ధతుల్లో నేటి పరిస్థితులకు అనుగుణంగా కుట్టుమిషన్‌ను చేసిపెట్టింది మాత్రం సింగరే అని చెప్పొచ్చు.
సింగర్ అక్టోబర్ 27, 1811న జన్మించాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబం. అమెరికాలోని న్యూయార్క్ పిట్స్‌టౌన్‌లో వాళ్ల నివాసం. జర్మనీ నుంచి వలస వచ్చిన యూదు కుటుంబం. తండ్రి ఆడమ్ సింగర్.. తల్లి రూత్ బెన్సన్. రోజూ ఏదో ఒక పనిచేస్తేనే కుటుంబం గడిచేది. వాళ్ల నాన్న ఏదో కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సింగర్ ఇంట్లో చిన్నవాడు. చిన్నప్పటి నుంచి అల్లరి పిల్లవాడిగా పెరిగాడు. ఎక్కడా నిలకడలేని మనస్తత్వం.
*ఏం చెప్పినా పెడచెవిన పెట్టే ధోరణి. ఎట్లా బుద్ధి వస్తుందో అని సింగర్ గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందేవాళ్లు. పెద్దయితే ఏ లక్ష్యమూ లేకుండా తయారవుతాడని భయపడేవాళ్లు. పేరెంట్స్ ఎంత భయపడుతున్నారో అంతకంటే రెట్టింపు చేష్టలతో చిరాకు పుట్టించే మనస్తత్వం సింగర్‌ది. చదువుకోమంటే వినేవాడు కాదు. తల్లిదండ్రులు శ్రద్ధగా చదువకోమని స్కూల్‌కి పంపిస్తే అతడు ఎవరికీ చెప్పకుండా ఒక మెకానిక్ షెడ్డులో పనికి కుదిరాడు. అక్కడ తనకంటే వయసులో పెద్దవారితో స్నేహం ఏర్పడింది. దీంతో ఏది చేసినా వయసుకు మించిన పనులు చేస్తుండేవాడు. అది తల్లిదండ్రులకు ఏమాత్రం నచ్చేది కాదు. అలా తల్లిదండ్రుల మాటను పెడచెవిన పెట్టి ఒకవైపు మెకానికల్‌గా మరోవైపు వీధి నాటకాలు వేసే ఆర్టిస్టుగా సెటిల్ అయ్యాడు. ఎనిమిది మంది సంతానం కావడం.. కుటుంబ అవసరాల కోసం తీరిక లేకుండా పనిచేయాల్సి రావడం వల్ల సింగర్‌ను తల్లిదండ్రులు అతిని ఇష్టానికి వదిలేశారు. చూడు సింగర్.. జీవితం మనం అనుకున్నంత తేలికైంది కాదు. మనమేదో చేయాలి అనుకుంటాం. అదెటో వెళ్తుంది. పక్కా ప్లాన్‌తో ఉంటేనే ఇలాంటి సమస్యలు తప్పవు. అలాంటిది నువ్వు ప్రతీది ఈజీగా తీసుకుంటావ్. ఇలా అయితే కష్టం. భవిష్యత్‌లో సమస్యలు కొనితెచ్చుకోవాల్సిందే. మాకు నువ్వొక్కడివే కాదు.. నీతో పాటు ఇంకో ఏడుగురు పిల్లలున్నారనే విషయం గుర్తుంచుకో. ఏదో నువ్వు చిన్నవాడివని మరీ మరీ చెప్తున్నా పట్టించుకోవడం లేదెందుకు? అని తల్లిదండ్రులు గట్టిగా క్లాస్ తీసుకునేవారు.
*అస్తవ్యస్థమైన జీవన విధానాన్ని అలవర్చుకున్న సింగర్‌కు స్థిరమైన ఆదాయం అవసరం. తల్లిదండ్రుల మాటలు బాగానే పనిచేసినట్టున్నాయి.. మెకానిక్ షెడ్డులో పని మానేసి ఓహియోలోని ఫెడ్రిక్స్‌బర్గ్‌లో ఒక మెకానిజమ్ ప్లాంట్‌లో పనికి కుదిరాడు. అది ప్రింటర్ల కోసం చెక్క నుంచి కాగితం తయారుచేసే ప్లాంట్. అక్కడ సుదీర్ఘకాలం పనిచేయడం వల్ల మంచి అనుభవం సంపాదించుకున్నాడు. అతడు అనుకున్నట్లుగానే స్థిరమైన ఆదాయం లభించింది. అలా 1850లో పేపర్‌ప్లాంట్‌లో ఒక కొత్త యంత్రాన్ని తయారుచేశాడు. దానిని చూసిన అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఏంటి సింగర్.. నీలో ఇంత టాలెంట్ ఉందా? ఇన్ని అద్భుతాలు చేసే నైపుణ్యం నీ దగ్గర పెట్టుకొని ఎందుకు జీవితం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తావు? నువ్వు కరెక్టుగా దృష్టి పెడితే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు అని స్నేహితులు ఎంకరేజ్ చేయడంతో సింగర్ ఉబ్బితబ్బి పోయాడు. నిజంగానే నాలో ఇంత టాలెంట్ ఉందా? అని లోలోపల ప్రశ్నించుకునేవాడు.
*సింగర్‌కు తన సత్తా ఏంటో తెలిసిన తర్వాత పనిలో ఉత్సాహం కనబరిచాడు. పనిపై శ్రద్ధ ఏర్పడింది. ఏది చేసినా ఏకాగ్రతతో చేసేవాడు. ఒకసారి బోస్టన్‌కు ఒక యంత్రం డెలివరీ ఉంటే తీసుకెళ్లాడు. జాన్ ఎ.లెరో, షేర్‌బర్న్.సి బ్లేడ్‌గెట్ పరిచయం అయ్యారు. అక్కడ బట్టలు కుట్టే పరికరం గురించి తెలుసుకున్నాడు. తర్వాత కుట్టు పరికరం గురించి అధ్యయనం చేశాడు. బోస్టన్‌లో తాను చూసిన కుట్టు పరికరం కంటే మెరుగైన పరికరాన్ని తయారుచేస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించాడు. తన పరిశోధనలను వేగవంతం చేసి మొత్తానికి ఒక సరళమైన కుట్టు పరికరాన్ని తయారుచేశాడు సింగర్. దానికి కుట్టు మిషన్ అని పేరుపెట్టాడు. లెరో, బ్లేడ్‌గెట్ దగ్గర చూసిన కుట్టు పరికరం కంటే తాను రూపొందించిన కుట్టుమిషన్ మెరుగ్గా పనిచేస్తుందని నమ్మాడు. అనుకున్నట్లుగానే సింగర్ కుట్టుమిషన్ ఫేమస్ అయ్యింది. సరళమైన మార్గంలో కదులుతూ.. వృత్తంలో తిరుగుతూ క్షితిజ సమాంతర దిశలో తిరిగే సూది కాకుండా నిటారుగా తిరిగే సూదితో నిలువుగా కదిలిస్తూ బట్టలు కుట్టడం అనేది అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండటంతో చాలా త్వరగా ప్రచారం పొందింది. అప్పటికే కుట్టు మిషన్ ప్రయోగాల్లో తలమునకలై ఉన్న షెల్ప్స్ దీనిని ఆమోదించాడు.
*సింగర్ కుట్టుమిషన్ విప్లవాత్మకమైంది. మిగతా అన్ని యంత్రాలను కాకుండా మహాత్మాగాంధీ సింగర్ కుట్టుమిషన్ గురించి చాలా సందర్భాల్లో మెచ్చుకున్నాడు. ఇప్పటివరకు కనిపెట్టిన కొన్ని ఉపయోగకరమైన ఆవిష్కరణల్లో సింగర్ కుట్టుమిషన్ ఒకటి అంటూ ప్రశంసించారు. సింగర్ ఆవిష్కరణకు మార్కెట్లో మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో సింగర్ కుట్టుమిషన్‌ల తయారీ సంస్థ ఏర్పాటుచేశాడు. సింగర్ కంపెనీ అమెరికాలోని మొట్టమొదటి బహుళజాతి సంస్థల్లో ఒకటిగా నిలువడం విశేషం. అతడే మొదటిసారిగా కుట్టుమిషన్‌ను కనిపెట్టకపోయినప్పటికీ అతడు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను పరిశీలించి పేటెంట్ కూడా సంపాదించుకున్నాడు. తన మిషన్‌ల ద్వారా తొలినాళ్లలో అలెగ్జాండర్-3 ఆర్డర్ తీసుకొని ఇంపీరియల్ ఆర్మీ కోసం 2,50,000 గుడారాలను తయారుచేశాడు. అంటే సింగర్ కుట్టుమిషన్ వ్యాపారం చేసుకోవడానికి అనుగుణంగా ఉండేది.
*ఇంతవరకు బాగానే ఉంది. కానీ సింగర్ కుట్టుమిషన్‌ను కనిపెట్టడానికి అసలు కారణం వేరే ఉందని అంటుంటారు. చిన్నప్పుడు అతడు క్రమశిక్షణ లేకుండా తిరగడం వల్ల పెద్దయ్యాక ఆ ప్రభావం తన భవిష్యత్‌పై పడింది. సిస్టమేటిక్‌గా లేకపోవడంతో అతడు ఐదుగురిని పెండ్లి చేసుకున్నాడు. ఎంతోమందితో రిలేషన్‌షిప్ మెయింటెన్ చేశాడు. అతడి సంతానం సంఖ్య 24 మంది పిల్లలు అంటే అర్థం చేసుకోవచ్చు. వాళ్లందరికీ తిండిపెట్టడానికే డబ్బులేని పరిస్థితి. అలాంటిది ఇక బట్టలు ఎక్కడి నుంచి కొనివ్వగలడు?
ఏదైనా పరిశోధన చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు పిల్లలు.. వారి అవసరాల ఆలోచనలు వచ్చేవట. వాటి నుంచి తొందరగా బయటపడితేనే ఆవిష్కరణల మీద కాన్‌సెంట్రేట్ చేయగలుగుతా అని భావించిన సింగర్ ముందుగా తన 24 మంది పిల్లలకు సరిపోను బట్టలు తయారు చేయాలనుకున్నాడు. సరిగ్గా అప్పుడే బోస్టన్ వెళ్లాడు. అక్కడ జాన్ ఎ.లెరో, షేర్‌బర్న్. సి బ్లేడ్‌గెట్ దగ్గర ఉన్న కుట్టు పరికరాన్ని పరిశీలించాడు. ఇలాంటిది ఏదైనా కనిపెడితే ముందు తన పిల్లలకు రకరకాల బట్టలు కుట్టి ఇవ్వొచ్చు కదా అనుకొని ఎన్నో ప్రయోగాలు చేశాడు. అతడి శ్రమ ఫలించి ప్రయోగం సక్సెస్ అయి కుట్టు మిషన్ ఆవిష్కృతమైంది. తన 64 సంవత్సరాల వయసులో ఎంతో సంపదను.. పేరును కూడగట్టిన సింగర్ ఇంగ్లండ్‌లో మరణించాడు. ఇప్పుడు అతడు లేడు. కానీ అతడు తయారుచేసిన సింగర్ కుట్టుమిషన్ ఫార్ములా ప్రకారమే మనం వేసుకునే బట్టలు కుడుతున్నారు!