DailyDose

నేటి పది ప్రధాన వార్తలు

Telugu breaking news of the day-january 07 2020

1.చినకాకాని వద్ద జాతీయ రహదారిపై రణరంగం
రాజధాని కోసం పోరు బాట పట్టిన అమరావతి రైతులు ఆందోళనను ఉద్ధృతం చేశారు. నిన్న భారీ పాదయాత్రతో హోరెత్తించిన రైతులు, మహిళలు ఇవాళ చినకాకాని వద్ద జాతీయరహదారిని దిగ్బంధించేందుకు ప్రయత్నించారు. అమరావతి ఐకాస పిలుపుమేరకు జాతీయ రహదారిపై బైఠాయించి పోలీసుల బూట్లు తుడుస్తూ నిరసన తెలిపారు.
2. గల్లా జయదేవ్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరావతి రైతులకు మద్దతుగా చినకాకాని వద్ద రహదారి దిగ్బంధానికి బయలుదేరిన జయదేవ్‌ను ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకుని నోటీసు అందజేశారు. ఇంటి గేటుకు తాళ్లు కట్టి బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం నేరం చేశానని నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు.
3. దేవినేని ఉమా నివాసం వద్ద ఉద్రిక్తత
మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉమా గృహనిర్బంధాన్ని నిరసిస్తూ తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈక్రమంలో ఉమా బలవంతంగా ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఉమా, కార్యకర్తలు.. పోలీసులను నెట్టుకుని ర్యాలీగా బయలుదేరారు. జై అమరావతి అంటూ తెదేపా కార్యకర్తలు నినాదాలు చేశారు.
4. వరంగల్‌లో ఐటీ కంపెనీలను ప్రారంభించిన కేటీఆర్‌
వరంగల్‌లో ఐటీ అడుగులు శరవేగంగా పడుతున్నాయి. మణికొండ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన సైయెంట్‌, టెక్‌ మహీంద్రా ప్రాంగణాలను రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రారంభించారు. 600 నుంచి 700 మంది ఉద్యోగులతో సేవలు అందించేలా ..అత్యాధునిక హంగులతో ఐదు ఎకారాల్లో సైయెంట్‌ నూతన భవనం నిర్మించింది. టెక్‌ మహీంద్రాలో దాదాపు 100 నుంచి 150 మంది ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు.
5. రణరంగంగా గేట్ వే ఆఫ్‌ ఇండియా
దిల్లీలో జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) విద్యార్థులపై దుండగుల దాడిని నిరసిస్తూ ముంబయిలోని గేట్‌ వే ఆఫ్ ఇండియా వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్థానికులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో మంగళవారం పోలీసులు రంగంలోకి దిగారు. గేట్‌ వే ఆఫ్‌ ఇండియాను ఖాళీ చేయాలని నిరసనకారులకు సూచించారు. అయితే వారు పట్టించుకోకపోవడంతో బలవంతంగా అక్కడి నుంచి ఆజాద్‌ మైదాన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఒకింత ఘర్షణ వాతావరణం నెలకొంది.
6. గాయపడిన జేఎన్‌యూ స్టూడెంట్‌ లీడర్‌పై కేసు
గత ఆదివారం దుండగుల దాడిలో గాయపడిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి ఘటనకు ఒక రోజు ముందు అంటే జనవరి 4న వర్సిటీ సర్వస్‌ రూమ్‌ను ధ్వంసం చేసినందుకు గానూ అయిషీ ఘోష్‌, మరో 19 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
7. ట్రంప్‌తో మాట్లాడిన మోదీ..!
భారత్‌-అమెరికా మధ్య సంబంధాలు పటిష్ఠమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో అన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం మరింత బలోపేతం చేసే దిశగా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ట్రంప్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు, అమెరికావాసులకు మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం మంగళవారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేసింది.
8. ఇరాక్‌ నుంచి వైదొలిగే యోచనేమీ లేదు:అమెరికా
ఇరాక్‌ నుంచి అమెరికా బలగాల్ని ఉపసంహరించుకోవడంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అమెరికా రక్షణశాఖ మంత్రి మార్క్‌ ఎస్పర్‌ స్పష్టం చేశారు. అంతకుముందు యూఎస్‌ సైనికులు దేశం విడిచి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుపుతూ అమెరికా సైన్యం ఇరాక్‌ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీనిపై ఎస్పర్‌ స్పందిస్తూ అలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదని తెలిపారు.
9. మ్యాచ్‌ రద్దు కాకముందే క్రికెటర్లు వెళ్లిపోయారు!
భారత్×శ్రీలంక తొలి టీ20ని అంపైర్లు రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించకముందే కొందరు ఆటగాళ్లు స్టేడియం నుంచి వెళ్లిపోయారని అసోం క్రికెట్ అసోషియేషన్‌ (ఏసీఏ) కార్యదర్శి దేవజిత్‌ సైకియా పేర్కొన్నాడు. ‘‘చాలామంది ఆటగాళ్లు తొమ్మిది గంటలకే స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అయితే అంపైర్లు రాత్రి 9.54కి మ్యాచ్‌ రద్దయినట్టు ప్రకటించడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది’’ ఆయన అన్నారు.
10. గజ్వేల్‌లో టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యం: రేవంత్
గజ్వేల్‌లో టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ కేసీఆర్‌…రాష్ట్ర పాలనను గాలికొదిలేసి కుటుంబ సభ్యులకు పదవుల పంపకంపై మల్లగుల్లాలు పడుతున్నారని విమర్శలు గుప్పించారు. పోలీసు కేసులతో ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తున్నారని… కేసులకు భయపడేదిలేదని, నిరంతరం ప్రజల్లోనే ఉంటామని స్పష్టం చేశారు. కేసీఆర్‌ దుష్టపాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు.