Devotional

సంకల్పమే సుముహూర్తం

Will Power Is The Best Luck

సంకల్పబలమే సుముహూర్తం!
– మన అదృష్ట, దురదృష్టాలకు కాలంతో పని లేదు!
– కర్మలు చేస్తూ జీవించడమే మన పని
-మంచో, చెడో ఫలితాల్ని ప్రసాదించేది భగవంతుడే!

కాలాన్ని బుద్ధిపూర్వకంగా
ఉపయోగించుకోవాలి. మన
చేతికి వాచీ ఉంటుంది కానీ,
మన చేతిలో కాలం ఉండదు.
‘ముహూర్తానికి బలముంటుందా?’ అన్న సందేహం చాలామందికి కలుగుతుంటుంది. ఎందుకంటే, లోకంలో దాదాపు అందరూ ముహూర్తాలను నమ్ముతారు కనుక. అందుకే, ముహూర్తానికి వున్న బలమేమిటో శాస్త్రీయంగా తెలుసుకొందాం. ‘టైమ్‌ ఈజ్‌ గోల్డ్‌’ అని ఆంగ్లంలో ఒక సూక్తి ఉంది. ‘సమయం బంగారం వంటిదని’ దీనర్థం. అలాగే, సంస్కృతంలోనూ ‘అమృత ఘడియలు’ అనే మాట ఒకటుంది. దీని అర్థం నిజానికి ప్రతీ ఘడియా అమృత సమానమేనని! భగవంతుడిని కాలపురుషుడని అంటాం కదా. దాని అర్థం ‘కాలమనే పురుషుడని’ కాదు. ఎవరి చేతిలో కాలం ఉంటుందో అతడే ‘కాలపురుషుడు’. అదే విధంగా ‘ఆదిత్య పురుషుడ’నే మాటకు ‘సూర్యదేవుడనే’ అర్థం కాక ‘అంతటా వ్యాపించి, ఆదిత్యుని (సూర్యుడు)లోనూ ఉన్న పరమేశ్వరుడని’ అర్థం. చాలావరకు సంస్కృత శబ్దాలకు మనం అనుకొనే అర్థాలు సరిపోవు. ‘కాలపురుషుడ’నే మాట ‘భగవంతుని చేతిలో కాలముంటుందనే విషయాన్ని’ వెల్లడిస్తుంది.

ఆ క్షణంలో అది జరుగుతుందంటే దానికి ఎంతో మహిమ ఉన్నట్లే కదా! అని చెప్పుకొంటాం. కాని, కాలం గురించి తెలిస్తే మనం అనుకొన్నది నిజం కాదని అర్థమవుతుంది. ‘వైశేషిక దర్శనం’ ప్రకారం పదార్థాలు ఆరు. ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయాలు. ఇందులో ద్రవ్యాలు తొమ్మిది. ‘పృథి వ్యాపస్తే జోవాయురాకాశం/ కాలో దిగాత్మా మన ఇతిద్రవ్యాణి’ (వైశేషికం: 1.1.5). పృథ్వి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు. ఈ ద్రవ్యాలలో మొదటి మూడు అనిత్యమైనవి. వాయువు మొదలుకొని మనస్సు వరకు నిత్యమైనవి. వీనిలో ఆత్మ రెండు విధాలు. జీవాత్మ, పరమాత్మ. జీవాత్మ, పరమాత్మలతోపాటు పృథివ్యాదులకు మూలకారణమైన ప్రకృతి మొత్తం ఈ మూడు కూడా పరమార్థ నిత్యాలు. అంటే, ఉత్పత్తి వినాశాలు లేనివని తెలుసుకోవాలి. వాయువు, ఆకాశం, కాలం, దిక్కు, మనస్సు- ఈ అయిదు చాలాకాలం ఉండడం వల్ల ‘నిత్యమైనవి’గా పేర్కొన బడుతున్నాయి. వీటిని ‘వ్యవహార నిత్యాలని’ కూడా పిలుస్తారు. వీటిలో వాయువు, ఆకాశం, కాలం, దిక్కు అనే నాలుగు ద్రవ్యాలు ప్రళయం వరకూ ఉంటాయి. మనస్సు మాత్రం మోక్ష పర్యంతం ఉంటుంది.

కాలం అనేది అనిత్య పదార్థాలన్నింటికీ సాధారణమైన కారణం. ఆత్మ, పరమాత్మలు ‘నిత్య పదార్థాలు’ కనుక, వాటికి కాలం వర్తించదు. కాలానికి లొంగి ఉన్నవే అనిత్య పదార్థాలు. లొంగనివి నిత్య పదార్థాలు. కాలమహిమను గుర్తించటానికి సూర్యోదయాస్తమయాలు, పగలు రేయి, శైశవాది దశలు, అనిత్య వస్తువుల ఆవిర్బావ వినాశాలు తోడ్పడుతాయి. అనుకోకుండా సుఖం కలిగితే అదృష్టమని, దు:ఖం కలిగితే దురదృష్టమని చెప్పడం కూడా కాలాన్నిబట్టే జరుగుతుంది. కాని, కాలం అనేది సుఖదు:ఖాలకు కారణం కాదన్న సంగతి చాలామందికి తెలియదు. నిమిత్త కారణాలలో అదొకటి మాత్రమే. ‘అతనికి కాలం కలిసి వచ్చింది. కాలం అనుకూలించలేదు’ అని చెప్పడం వల్ల కాలమే అన్నింటికీ కారణమనే భావన కలుగుతుంది. కానీ, మన జీవితంలో కాలం కూడా ఒక పనిముట్టు లాంటిదేనని గ్రహించాలి.

మనం ఏ పని ఆరంభించినా ఒక సమయాన్ని ఎన్నుకొంటాం. ఆ పని సఫలం కాకపోతే ‘కాలం అనుకూలించలేదని’ కాలాన్ని నిందించటానికి కూడా వెనుకాడం. కాని, ‘మన పని సఫలం కావటానికి కాని, దుష్ఫలితాన్ని ఇవ్వటానికి కాని కాలం కారణం కాదని, కేవలం అదొక నిమిత్త కారణం మాత్రమేనని’ తెలుసుకోవాలి. అందుకే, కాలాన్ని బుద్ధిపూర్వకంగా ఉపయోగించుకోవాలి. కాలాన్ని అధిగమించడం మానవునికి సాధ్యం కాదు. మన చేతికి వాచీ ఉంటుంది కానీ, మన చేతిలో కాలం ఉండదు. మరి, ‘మనం కాలం చెప్పినట్లు వినవలసిందేనా?’, ‘అది మనం చెప్పినట్లు వినటానికి మనం చేయవలసిన పనేమైనా ఉన్నదా?’ కాలాన్ని మితంగా వాడుకోవాలని, ఏ వేళకు ఏ పని చేయాలో అది చేయాలని, కాలాన్ని విస్మరించి లేదా ధిక్కరించి ఉండరాదని, ఫలితం దొరికేదాకా నిగ్రహం కలిగి ఉండాలని పెద్దలు చెప్పిన మాటలు మరవరాదు.

దేనికైనా సమయం ఉండాలంటాం. ఈ సమయానికే ‘కాలమని’ పేరు. ఏ సమయంలో ఏం జరగాలో అది జరుగుతుందని చెప్పడం సులభమే కాని, అలా జరగటం వెనుక ఒక బలమైన శక్తి పని చేస్తుంది. అదే భగవంతుడు! మనం లోకంలో సుఖదు:ఖాలను అనుభవించవలసిన కర్మలు మూడు విధాలు. 1. ప్రారబ్ద కర్మలు 2. సంచిత కర్మలు 3. క్రియామాణ కర్మలు. నేడు అనుభవిస్తున్నవి ప్రారబ్దకర్మలు. ఇంకా అనుభవించవలసినవి సంచిత కర్మలు. ఎప్పటికప్పుడు అనుభవిస్తున్నవి క్రియామాణ కర్మలు. ఏ కర్మఫలాన్ని ఏ ముహూర్తంలో మనం అనుభవించవలసి వస్తుందో మనకు తెలియదు. అలాగే, ఏ కర్మను ఎప్పుడు ఆరంభించి, ఎప్పుడు ముగిస్తామో కూడా తెలియదు. కేవలం సమయమే ఫలాన్ని నిర్ణయిస్తే చేసే కర్మకు విలువే లేదు. ఈ కర్మ చేయదగిందా? లేక, చేయరానిదా? అని ఆలోచించి బుద్ధిపూర్వకంగా చేసినప్పుడే అది ఫలవంతమవుతుంది. కనుక, కాలానికి ఫలం గురించి తెలియదు.