*బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార జేడీయూ-బీజేపీ కూటమిలో ఆధిపత్య పోరు తప్పదన్నసంకేతాలు వెలువడుతున్నాయి. నాయకుల వ్యాఖ్యలు ఈ వేడిని పెంచుతున్నాయి. బీహార్‌లో బీజేపీకి సొంతంగానే గెలిచే సత్తా ఉందని ఆ పార్టీ నేత సంజయ్ పాశ్వాన్ తాజాగా అన్నారు.బుధవారంనాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీహార్ ప్రజలు బీజేపీ నేతను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ బాగా బలమైన పార్టీనే కాకుండా, చురుకైన పార్టీ అని ఆయన అన్నారు. అంతిమంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ తీసుకున్న నిర్ణయానికే తాము కట్టుబడి ఉంటామని, అయితే సొంతంగా ఎన్నికల్లో గెలిచే సత్తా తమ పార్టీకి ఉందని ఆయన ఢంకా బజాయించారు.
*వచ్చే నెల నుంచి ఇంటివద్దకే పింఛన్లు:జగన్
వచ్చే నెల నుంచి అన్ని రకాల పింఛన్లను లబ్ధిదారుల ఇంటివద్దకే తీసుకెళ్లి అందజేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఉపాధిహామీ పనులు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, నాడు-నేడు కింద పాఠశాలల్లో ప్రహరీ గోడల నిర్మాణం, వాటర్‌గ్రిడ్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. సర్వేలతో ముడిపెట్టి ఇళ్లపట్టాలను నిరాకరించవద్దని.. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి లబ్ధిదారులను గుర్తించాలని సీఎం ఆదేశించారు. అర్హులు ఎంతమంది ఉన్నా పట్టాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.
*గురుదక్షిణగానే విశాఖకు రాజధాని:యనమల
సీఎం జగన్‌కు రాజ్యాంగం కన్నా శారదా పీఠమే మిన్న అని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వైకాపాకు ఏపీ పునర్విభజన చట్టం కంటే శారదా పీఠాధిపతి స్వరూపానంద శాసనమే ఎక్కువని ఆయన ఎద్దేవా చేశారు. అమరావతిలో యనమల మీడియాతో మాట్లాడారు. ఈరోజు స్వరూపానందతో, 13న తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జగన్ భేటీ వెనుక ఉద్దేశమేంటని నిలదీశారు. ఆ ముగ్గురూ ఒకే పడవలో ప్రయాణిస్తున్నారని.. వారి లక్ష్యం ఒక్కటేనని వ్యాఖ్యానించారు. రాజధాని తరలింపుపై 5కోట్ల ప్రజల ఆందోళనలు సీఎం జగన్‌కు పట్టడం లేదని యనమల ఆక్షేపించారు. స్వరూపానంద స్వామికి గురుదక్షిణగానే రాజధాని విశాఖకు తరలింపు నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. రాజధానిపై వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు రాష్ట్రపతి, కేంద్రానికి పంపిన వినతులు అర్ధరహితమైనవని విమర్శించారు.
* కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికపై హైకోర్టుకు
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ లంచ్ మోషన్ దాఖలు చేసేందుకు ధర్మాసనం అనుమతి కోరింది. దీంతో అత్యవసర వ్యాజ్యంగా మధ్యాహ్నం విచారణ చేపట్టేందుకు ధర్మాసనం అంగీకరించింది. కరీంనగర్ నగర పాలక సంస్థలో మూడు డివిజన్ల రిజర్వేషన్లపై నిన్న సింగిల్ జడ్జి అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో కరీంనగర్ మినహా రాష్ట్రంలోని 8 కార్పొరేషన్లకు ఎన్నిక సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడంతో ప్రభుత్వం స్పందించి హైకోర్టును ఆశ్రయించింది.
*విశాఖ వద్దంటే బాబును ఉత్తరంద్రాలో అడుగు పెట్టనీయం- తమ్మినేని
విశాఖను రాజధానిగా చేయడం వల్ల ఉత్తరంద్రాలో పాటు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని దీన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తే ఆయనను ఉత్తరంధరాలో అడుగు పెట్టనీయమని శ్రీకాకుళం జిల్లా అముదాలవలస ఎమ్మెల్యే స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. స్పీకర్ గా తానూ మాట్లాడడం లేదని, ఉత్తరాంధ్ర పౌరిడిగా ఇది తన డిమాండ్ అన్నారు. రాజధాని పై తితిదే రాద్దాంతం చేయడం తగదన్నారు. రాజధానితో సామాన్యుడికి పనిలేదని అది ఎక్కడ ఉన్నా వారికి ఒకటేనని అన్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన వారే మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానిని అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు.
* జననేత అంటే జనాల్ని జైల్లో పెట్టడమా: జీవీ
రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రమయ్యాయని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. అమరావతి కోసం రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే ఆ ప్రాంతంలో అప్రకటిత కర్ఫ్యూ విధించటం ఎందుకని ప్రశ్నించారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
* విజయవాడలో జనసేన నేత ఒక్క రోజు దీక్ష
అమరావతి రైతులకు మద్దతుగా జనసేన నేత పోతిన మహేష్ ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములిచ్చిన రైతుల్ని క్రిమినల్స్‌లా చూస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ వెనుక జగన్, విజయసాయి స్వార్ధం ఉందని విమర్శించారు. నివేదికలు రాకముందే ప్రకటనలు చేయడం జగన్ మాయ అని ఆయన అన్నారు. అమరావతి ముంపులో ఉందంటున్నారని…మరి హుద్‌హుద్‌తో నష్టపోయిన విశాఖ గురించి చెప్పలేదే? ప్రశ్నించారు. జగన్ వద్ద కోట్ల రూపాయలు తీసుకుని కృష్ణా, గుంటూరు వైసీపీ నేతలు గుంటనక్కల్లా వ్యవహరిస్తున్నారని మహేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు
* బీజేపీ వైపు రాజ్ థాకరే అడుగులు?
బీజేపీతో తెగతెంపులు చేసుకున్న శివసేన తన ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మహారాష్ట్రలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్, సీఎం ఉద్ధవ్ థాకరే సోదరుడు రాజ్ థాకరే తాజాగా బీజేపీతో జతకట్టనున్నట్టు సమాచారం. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలకు గానూ ఎంఎన్ఎస్ తరపున కేవలం రాజ్ థాకరే ఒక్కరే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు సంధించిన సంగతి తెలిసిందే.
*3 రాజధానులపై బీజేపీ స్పష్టంగా ఉంది: యూపీ మంత్రి
మూడు రాజధానులపై బీజేపీ స్పష్టంగా ఉందని యూపీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. 75 జిల్లాలున్న యూపీలో ఒకే రాజధాని ఉందని, అతిపెద్ద రాష్ట్రం యూపీలో లక్నో నుంచి సమర్థంగా పాలన అందిస్తున్నామని తెలిపారు. యూపీకి ఏపీ అధికారులను పంపితే తమ పాలన తీరును వివరిస్తామని అన్నారు. ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలు సీఏఏకు మద్దతిచ్చాయని యూపీ మంత్రి సిద్ధార్థనాథ్ వెల్లడించారు.
* రాజధాని రైతుల ఉద్యమంపై వాసిరెడ్డి పద్మ తీవ్ర వ్యాఖ్యలు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి రైతుల ఉద్యమంపై మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన ఆమె.. విజయవాడలో సమ్మె చేసే సత్తాలేని వారని.. మహిళలను రోడ్డుపైకి తీసుకువచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్నప్పుడు మహిళలను అడిగే అలా ప్రకటించారా? అని ఈ సందర్భంగా పద్మ ప్రశ్నించారు. ‘రాజధాని ఉద్యమంలో మహిళలను పావులుగా వాడుకుని లబ్ధిపొందాలని చూస్తున్నారు. ఇదేం పౌరుషం.. ఇదేం ఉద్యమం. మహిళలను రోడ్డెపైకి తెచ్చి అరెస్ట్ అయ్యేలా చేస్తున్నారు. గతంలో పదవులు అనుభవించి, విర్రవీగిన వారు. ఎందుకు అరెస్టు కావడంలేదు?, ఇది నీచరాజకీయం’ అని వాసిరెడ్డి పద్మ విమర్శలు గుప్పించారు.
* ఇలాంటి సీఎంను చూడలేదు: మంత్రి ఎర్రబెల్లి
40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి ముఖ్యమంత్రి చూడలేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం సొంతూరులో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక విజన్‌తో సీఎం వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, నీళ్లు రావు అని గత ప్రభుత్వాలు వ్యాఖ్యలు చేశారని… కానీ ఇప్పుడు 24 గంటల కరెంట్, ఇంటి ఇంటికీ మంచి నీటిని అందించిన ఘనత సీఎంకే దక్కుతుందని కొనియాడారు. పెన్షన్‌ను పెంచడంతో పెన్షన్ దారుల జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
* తెల్ల ఏనుగులా రాజధాని అయ్యే ప్రమాదం: ఎంపీ గల్లా
గుంటూరు రాజధాని భవిష్యత్తులో తెల్ల ఏనుగు లాగా అయ్యే ప్రమాదం ఉందని ఎంపీ గల్లా జయదేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవంటూ కొత్త నిర్మాణాలు ఎక్కడ కడతారని ఎంపీ ప్రశ్నించారు. ఇప్పటికే అమరావతిలో అవసరమైన నిర్మాణాలు దాదాపు పూర్తి అయ్యాయని చెప్పారు. రాజధానిపై కమిటీ రిపోర్ట్ వచ్చిన తరువాత జగన్ మాట్లాడి ఉంటే బాగుండేదని….ఆయన మాట్లాడిన తర్వాత కమిటీ రిపోర్టు అనేది కచ్చితంగా ప్రభావితం చేసినట్లే అని వ్యాఖ్యానించారు. హైకోర్టు కర్నూలులో పెట్టి ఇంకో చోట రాజధాని నిర్మాణం చేసిన ఖర్చులు పెరుగుతాయాన్నారు. జగన్ ఈగో వల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటి వరకు జగన్ రైతుల ఆందోళనపై స్పందించలేదని ఎంపీ గల్లా మండిపడ్డారు.
* సీఎంకు చెవి మిషన్, కళ్లజోడు…బుద్ధా వినూత్న నిరసన
రైతుల ఆందోళనలపై ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్య వైఖరి పట్ల టీడీపీ నేత బుద్ధా వెంకన్న వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు చెవి మిషన్, కళ్లజోడును కానుకగా పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నేనున్నాను.. నేను విన్నాను అన్నావు. 22 రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే ఎక్కడున్నావు? ఏం వింటున్నావు?’’ అంటూ మండిపడ్డారు. కేసీఆర్‌పై ఉన్న ప్రేమ రాష్ట్ర ప్రజలపై లేదా? అని ప్రశ్నించారు. ఆరుగురు రైతుల గుండె కోత సీఎంకు వినబడలేదా? అని నిలదీశారు. అన్ని వసతులు ఉన్న అమరావతిని వదలాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. టీడీపీ కార్యకర్తల అంతు చూస్తామన్న మంత్రులపై డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. కార్యకర్తలపై చెయ్యేస్తే సహించేది లేదని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు.
*ఫిరాయించకుండా అఫిడవిట్ ఇవ్వాలి:ఉత్తమ్
త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రేపు ఉదయం స్థానికంగా సమావేశాలు నిర్వహించి అభ్యర్థులను నిర్ణయిస్తామన్నారు. ఈ నెల 9వ తేదీ 11 గంటలలోపు అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించకుండా ఉండేందుకు అభ్యర్థులు స్టాంప్ పేపర్‌తో అఫిడవిట్ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ నెల 14 వరకు అభ్యర్థులకు బి-ఫారాలు అందజేయనున్నట్లు వివరించారు. అభ్యర్థులకు ఎ-ఫారం, బి-ఫారం ఇచ్చే బాధ్యత టీపీసీసీ కార్యదర్శి నిరంజన్‌కు అప్పగించినట్లు తెలిపారు. స్టార్ క్యాంపెన్‌గా కొంత మంది నేతలు ప్రచారం చేస్తారన్నారు.
*తలకిందులుగా తపస్సుచేసినా రాజధానిమారదు’-సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
సుపరిపాలన అందించాలని జగన్‌కు ప్రజలు అధికారం అప్పగిస్తే రాజధాని సమస్య సృష్టించి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతియుతంగా రైతులు ఆందోళన చేస్తుంటే ఏదో జరిగినట్టు వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మూడు రాజధానులు చేయాలంటూ బోస్టన్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. ఐదు కోట్లమంది భవిష్యత్‌ను ఆ కమిటీ ఐదు రోజుల్లో తేల్చేస్తుందా? అని దుయ్యబట్టారు.
*సీమవాసులకు విశాఖ దూరాభారం
అరెస్టులతో రైతుల ఉద్యమాన్ని ఆపలేరని, కఠినంగా అణచి వేయాలని చూస్తే అంతకంటే బలంగా ఆందోళనలు చేపడతారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. రాజధాని రైతులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. చినకాకాని వద్ద మంగళవారం రైతులతో ప్రభుత్వం వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదని ట్విటర్లో పేర్కొన్నారు. రైతులను, మహిళలను భయపెట్టి నిరసన నుంచి దూరం చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. విశాఖపట్నం వాసులూ పాలనా రాజధాని విషయంలో సంతృప్తిగా కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. రాయలసీమ వాసులు విశాఖ వెళ్లాలంటే దూరాభారమవుతుందని, ఈ విషయంలో సీమ వాసుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లిన ఉద్యోగులు ఇప్పుడే కుదురుకుంటున్నారని, మళ్లీ విశాఖ వెళ్లాలంటే ఎన్నో వ్యయ ప్రయాసలు తప్పవని ట్వీట్లో పేర్కొన్నారు.
*ప్రజా ఉద్యమాన్ని నిర్బంధాలు నిలువరించలేవు
అమరావతి ఉద్యమానికి చిన్నారుల నుంచి వృద్ధుల దాకా అందరూ కదం తొక్కడాన్ని జీర్ణించుకోలేకే దొంగ దాడులు, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలకు తెరతీశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. వందలాది మంది తెదేపా నేతల అక్రమ నిర్బంధం వైకాపా ప్రభుత్వ నిరంకుశ పోకడలకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని, రాజధాని ప్రజలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని ట్విటర్లో డిమాండ్ చేశారు. ‘రాజధాని కోసం వేలాది కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే వారికి మద్దతు ఇచ్చేందుకు వెళుతున్న తెదేపా నేతలను అడ్డుకోవడం అప్రజాస్వామికం. తమకు న్యాయం చేయాలని పోరాడుతున్న రైతులు, మహిళలు, రైతు కూలీలపై అక్రమ కేసులు పెట్టడమేంటి? పోలీసు బలగాలతో ప్రజాభీష్టాన్ని కాలరాద్దామంటే కుదరదు.
*మేం కన్నెర్ర చేస్తే ఒక్కరూ తిరగలేరు
‘మేం చేయలేక కాదు..మేం కానీ కన్నెర్ర చేస్తే, ఒక్కసారి సహనం కోల్పోయి దాడులు మొదలు పెడితే చంద్రబాబు కాదు కదా? ఒక్క తెదేపా నాయకుడు, కార్యకర్త తిరగలేని పరిస్థితి ఉంటుంది’ అని మంత్రి అనిల్కుమార్ యాదవ్ అన్నారు. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే అనిల్పై దాడులు చేయడం దారుణమన్నారు. ఇలాంటి దాడులను కొనసాగిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతారు. ముఖ్యమంత్రి జగన్ కచ్చితంగా రైతులను ఆదుకుంటారు.
*ప్రజా ఉద్యమాన్ని నిర్బంధాలు నిలువరించలేవు
అమరావతి ఉద్యమానికి చిన్నారుల నుంచి వృద్ధుల దాకా అందరూ కదం తొక్కడాన్ని జీర్ణించుకోలేకే దొంగ దాడులు, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలకు తెరతీశారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వందలాది మంది తెదేపా నేతల అక్రమ నిర్బంధం వైకాపా ప్రభుత్వ నిరంకుశ పోకడలకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని, రాజధాని ప్రజలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని ట్విటర్లో డిమాండ్ చేశారు. ‘రా
*మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా వ్యూహం ఖరారు
మున్సిపల్ ఎన్నికల వ్యూహాన్ని తెదేపా ఖరారుచేసింది. పోటీచేయాల్సిన వార్డులు, అభ్యర్థుల ఖరారు బాధ్యతలన్నీ స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జులకు అప్పగించారు. బలమున్నచోటే పోటీచేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జి పదవి ఖాళీగా ఉంటే లోక్సభ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. ఏ పార్టీతోనూ పొత్తు లేదని, ఎక్కడైనా ఇతర పార్టీలు స్థానిక పరిస్థితుల ఆధారంగా మద్దతు కోరితే అక్కడి బలాబలాలను బట్టి నిర్ణయించుకోవాలన్నారు.
*హామీలతో మభ్యపెడుతున్న కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను హామీలతో మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా విమర్శించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో కాకుండా రైతు ఆత్మహత్యలు, అప్పులు, మద్యం అమ్మకాల్లో దేశంలో నంబర్వన్ స్థాయికి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు.
*ప్రజల మధ్య చిచ్చుపెట్టడం పాలకులకు తగదు
పాలకులు, ప్రభుత్వాలు..శాంతి, సౌభ్రాతృత్వాలను పెంపొందించేందుకు ప్రయత్నించాలి తప్ప, వాటికి విఘాతం కల్గించే నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. అన్ని మతాలు, వర్గాలు, జాతులు కలిసిమెలిసి, స్వేచ్ఛగా జీవించే దేశంలో వారి మధ్య చిచ్చుపెట్టడం తగదన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు
*ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి: కోదండరాం
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని తెజస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. ఉద్యోగ ఖాళీలపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని, వెంటనే నిరుద్యోగ భృతిని అమలు చేయాలని ఆయన కోరారు. తెజస రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిరుద్యోగుల సమస్యలపై నిర్వహించిన సమావేశంలో కోదండరాం ప్రసంగించారు. ‘తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. ఉద్యోగ నియామకాలపై నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఒప్పంద, పొరుగు సేవల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
*కేంద్ర ప్రోత్సాహంతోనే జేఎన్యూ దాడి ఘటన
దిల్లీలోని జేఎన్యూలో విద్యార్థులు, అధ్యాపకులపై దాడి కేంద్రం ప్రోత్సాహంతోనే జరిగిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఎందరో మేధావులను తీర్చిదిద్దిన, అత్యంత భద్రత కలిగిన విశ్వవిద్యాలయంలోకి చొరబడి విద్యార్థులు, అధ్యాపకులను గాయపరచడాన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇంతవరకు బాధ్యులను అరెస్టు చేయకపోవడం హోంశాఖ వైఫల్యమని ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే.
* మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ బుధవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జనవరి 22న ఎన్నికలు జరగనున్నాయి. 25న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక ఈ నెల 11న నామినేషన్ల పరిశీలన జరగనుంది. తిరస్కరించిన నామినేషన్లపై 12వ తేదీ వరకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 14 గడువు. మున్సిపాలిటీల్లోని 2,727 వార్డులు, కార్పొరేషన్లలోని 325 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
బీహార్‌లో పాగాకు బీజాలు వేస్తున్న భాజపా-రాజకీయ
Related tags :