Sports

అది బౌలర్ల విజయం

KL Rahul Praises Bowlers For Winning T20

శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. గువాహటి వేదికగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం రాహుల్‌ మాట్లాడాడు. ‘‘లక్ష్యం పెద్దదేమి కాదు. మా ప్రణాళిక కేవలం ఎక్కువసేపు క్రీజులో ఉండి పరుగులు సాధించడమే. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. బ్యాటింగ్‌ వికెట్‌పై కూడా 170 పరుగుల లోపు ప్రత్యర్థులను కట్టడిచేశారు. ఈ మ్యాచ్‌ విజయం క్రెడిట్‌ మొత్తం వారికే దక్కుతుంది. ఆటను అర్థం చేసుకుంటూ మంచి ఇన్నింగ్స్‌ ఆడాలనుకున్నా. పరుగులు సాధిస్తున్నందుకు సంతోషంగా ఉంది. జట్టుకు విజయాన్ని అందించాలనే మేం బరిలోకి దిగుతాం. దీన్ని రోహిత్‌శర్మ సులువుగా చేస్తాడు. టెస్టు కెరీర్‌ ఆరంభంలో శిఖర్ ధావన్‌తో కలిసి బ్యాటింగ్ చేశాను. మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంటుంది. హిట్‌మ్యాన్‌, గబ్బర్‌తో కలిసి ఆడటాన్ని ఎంతో ఆస్వాదిస్తా’’ అని రాహుల్ తెలిపాడు.