Politics

ఎన్నికల్లో పోటీ చేయాలంటే అర్హతలు ఇవే

Rules & Eligibility to contest in Indian elections

పురపాలిక ఎన్నికల కోలాహలం మొదలైంది. రిజర్వేషన్లు కూడా కేటాయించడంతో ఆశావహులు బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే పార్టీ టికెట్‌ ఇచ్చినా, ఓట్లు పడినా అభ్యర్థి ఎన్నికల అధికారులు జారీ చేసిన నియమాలు తెలుసుకోకుంటే ఆ గెలుపు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇదివరకు చాలా మంది అభ్యర్థులు ఎన్నికల నియమాలు తెలియక చేసిన తప్పులు వారిని బరి నుంచి వై దొలగేలా చేయడమే కాకుండా మరి కొందరిని గద్దె దింపిన సంఘటనలూ లేకపోలేదు. అందుకే పోటీలో ఉండే అభ్యర్థులు అర్హతలు, నిబంధనల గురించి తెలుసుకోండి. *పోటీకి అర్హులు ఎవరు?
కొత్త చట్టం మేరకు ఇద్దరు, అంతకంటే ఎక్కువమంది సంతానమున్నా పోటీ చేయొచ్చు. ఏ వార్డు నుంచి పోటీ చేస్తే అక్కడ ఓటు హక్కును కలిగి ఉండాలి. అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాల కంటే తక్కువ ఉండరాదు. పోటీ చేసే అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి మాత్రం తప్పకుండా అదే వార్డులో ఓటరుగా నమోదై ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కేటగిరీలకు కేటాయించిన వార్డుల్లో ఆయా రిజర్వేషన్‌ కేటగిరీలకు చెందిన వారి నామినేషన్లు మాత్రమే అంగీకరిస్తారు.
*అనర్హులు
1995 పౌర హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం క్రిమినల్‌ కోర్టు ద్వారా జైలు శిక్ష అనుభవించినవారు. అప్పులు తీర్చలేక దివాలా దారుడిగా ప్రకటించిన వ్యక్తులు మున్సిపల్‌ కౌన్సిల్‌కు సంబంధించిన ఆస్తులు లీజుకు తీసుకున్న వారు కౌన్సిల్‌లో కాంట్రాక్టర్లుగా నమోదైన వారు మున్సిపాలిటీలో గత ఆర్థిక సంవత్సరం, ప్రస్తుతం నేటి వరకు బకాయిలు(ఇంటిపన్ను, ఆస్తిపన్ను, నీటి పన్ను తదితరాలు) చెల్లించని వారు
**ఎన్నికల నిబంధనలు..
మున్సిపాలిటీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాభదాయక పదవులు చేపట్టరాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్‌ నుంచి తొలగించి ఉంటే పోటీకి అనర్హులు. గతంలో పోటీ చేసి ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించనందుకు ఎన్నికల సంఘం అనర్హుడిగా ప్రకటించి ఉండకూడదు. కౌన్సిలర్‌గా పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రూ. 1 లక్ష వరకు మాత్రమే ఖర్చు చేయాలి. అభ్యర్థి తరపున నిర్వహించే ప్రతీ కార్యక్రమం ఎన్నికల ఖర్చులో జమ అవుతుంది. నామినేషన్‌ సమర్పించిన రోజు నుంచి ప్రతిరోజు ఎన్నికల ఖర్చును నిర్ధేశిత ఫార్మాట్‌లో ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే వాహనాలను అధికారి నుంచి అనుమతి తీసుకోవాలి ఎన్నికల ప్రచారం, ర్యాలీలకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, మైదానాలు ఉపయోగించరాదు. సంబంధిత వాహనం(ద్విచక్ర వాహనం సహా) ఏ పరిధిలో, ఏయే ప్రాంతాల్లో తిరుగుతుందనే విషయాన్ని ముందస్తుగానే సమాచారమివ్వాలి. నిర్ధేశిత పరిధి దాటితే ఆ వాహనాన్ని సీజ్‌ చేస్తారు. ప్రచార వాహనంపై డ్రైవర్‌ సహా ఐదుగురు మాత్రమే ఉండాలి రెండు వాహనాలకు మించి కాన్వాయ్‌ వాడకూడదు వాహనానికి లౌడ్‌ స్పీకర్‌ అమర్చుకోవాలంటే, ఎన్నికల అధికారి, పోలీస్‌ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. విద్యాలయాలు, దేవాలయాలు, ప్రార్ధనా మందిరాల సమీపంలో లౌడ్‌ స్పీకర్లు వాడొద్దు. రాత్రి 10గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో లౌడ్‌ స్పీకర్లు వాడొద్దు ఎన్నికల సమయానికి 48గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాలి.
**నామినేషన్‌ ఇలా వేయాలి..
అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్ధేశించిన నమూనా ప్రకారం నామినేషన్‌ పత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసినంత మాత్రాన నామినేషన్‌ వేసినట్లు కాదు. ఒరిజినల్‌ నామినేషన్‌ కాపీని రిటర్నింగ్‌ అధికారికి నేరుగా ఇవ్వాల్సిందే. అభ్యర్థులుగా పోటీచేసే వారికి నామినేషన్‌ ఫారాలు ఉచితంగా ఇస్తారు. అభ్యర్థి, ప్రతిపాదకుల వివరాలు వరుస సంఖ్య, పేరు యథావిధిగా నామినేషన్‌ పత్రంలో రాయాలి. ఒక్కో అభ్యర్థి తరపున నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వ్‌ చేసిన స్థానాల్లో పోటీ చేసే ఆయా వర్గాల వారు రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్‌ హోదాకు తగ్గని అధికారి సమక్షంలో చేసిన డిక్లరేషన్‌ విధిగా జత చేయాలి. నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతకు సంబంధించి రూ.20స్టాంపు పేపర్‌పై అఫిడవిట్‌ను నామినేషన్‌ దాఖలు సమయంలో సమర్పించాలి. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వేసినా ఒక దానికి డిపాజిట్‌ చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులు నామినేషన్‌కు ముందు రోజు బ్యాంకు ఖాతా తెరిచి ఎన్నికల వ్యయాన్ని దాని ద్వారానే నిర్వహించాలి. కార్పొరేషన్‌లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.2500లు, ఇతరులు రూ.5వేలు డిపాజిట్‌ చెల్లించాలి. మున్సిపాలిటీలో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1250, ఇతరులు రూ.2500లు డిపాజిట్‌ చెల్లించాలి ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ వార్డుల్లో పోటీ చేయకూడదు. వేర్వేరు వార్డుల్లో నామినేషన్‌లను దాఖలు చేసినా ఒక వార్డులో మినహా ఇతర నామినేషన్లు ఉపసంహరించుకోవాలి. రెండు అంత కంటే ఎక్కువ వార్డుల్లో పోటీలో ఉంటే అనర్హులుగా ప్రకటిస్తారు. ఒక్కో అభ్యర్థిని ప్రతిపాదిస్తూ ఇద్దరు ఓటర్లు నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేయాలి నామినేషన్‌ పత్రాన్ని అభ్యర్థి స్వయంగా కానీ, ప్రతిపాదకుల ద్వారా గాని ఎన్నికల అధికారికి సమర్పించవచ్చు. ఒకే వ్యక్తి ఒకరికి మించి అభ్యర్థులను ప్రతిపాదిస్తే మొదటి నామినేషన్‌ను మాత్రమే స్వీకరించి మిగతావి తిరస్కరిస్తారు. నామినేషన్‌ ఉపసంహరణ తుది రోజు మధ్యాహ్నం 3గంటల్లోపు సంబంధిత పార్టీ ద్వారా జారీ అయ్యే బీ ఫారాన్ని ఎన్నికల అధికారికి సమర్పించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వ్‌ అయిన వార్డులకు పోటీ చేసే ఆయా సామాజిక వర్గాల అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. నామినేషన్‌ దాఖలు సమయంలో అభ్యర్థి, ప్రతిపాదించే వ్యక్తి కాక మరొకరిని మాత్రమే ఎన్నికల అధికారి కార్యాలయంలోకి అనుమతిస్తారు. తప్పుడు సమాచారం ఇచ్చిన అభ్యర్థులు సెక్షన్‌ 182, 191ల ప్రకారం శిక్షార్హులవుతారు.