‘నిన్ను చూసి వంగుతుంది ఆశపడి ఆకాశం… ఆ మబ్బు చీర పంపుతుంది మోజుపడి నీకోసం…’ అని ఓ సినీకవి చెప్పినట్లు అమ్మాయిల్నీ అబ్బాయిల్నీ మురిపించే ఫ్యాషన్ల కోసం ఆ నింగి నీల వర్ణాన్నే ఈ ఏడాదికి ఎంపిక చేసేశారు అంతర్జాతీయ రంగుల నిపుణులు.
సాయంసంధ్యలోని నీలాకాశాన్నీ ఆ రంగుని ప్రతిఫలించే నీలి సాగరాన్నీ చూసినప్పుడు మనసులో ఎంతో ప్రశాంతత… ఆ నిశ్శబ్ద ప్రకృతిలో ఏదో తెలియని నిశ్చింత… అందుకేనేమో నీలిరంగుని ఆశావాదానికీ ఆత్మవిశ్వాసానికీ స్వప్నలోకానికీ స్థిరత్వానికీ సంకేతంగా భావిస్తారు. నిజాయతీకీ విశ్వసనీయతకీ ఈ రంగునే ప్రతీకగా చెబుతారు. తెలివితేటల్నీ దృఢత్వాన్నీ సమగ్రతనీ శక్తినీ ప్రతిబింబిస్తుందనీ; భద్రతని కలిగిస్తుందనీ అంటారు కలర్ థెరపిస్టులు. ఆ కారణంతోనే ఈ ఏడాది ఫ్యాషన్ కలర్‌గా క్లాసిక్ బ్లూ(ముదురూ లేతా కాని నీలిరంగు… దీన్నే రాయల్ బ్లూ అనీ, ఊదా కలిసిన నీలం అనీ అంటారు)రంగుకే ఓటేశాం అంటున్నారు అంతర్జాతీయ రంగుల పరిశోధన సంస్థ- పాంటోన్‌కి చెందిన నిపుణులు. ‘ఇది సంధి కాలం. ఓ పక్క వాతావరణ మార్పులు ఒత్తిడి కలిగిస్తుంటే, మరోపక్క జీవితాల్లోకి చొరబడుతున్న టెక్నాలజీ భయాందోళనల్ని కలిగిస్తుంది. అలాంటి ఈ సమయంలో భావోద్వేగాల్లో సమన్వయం ఎంతో అవసరం. అది నీలిరంగులో లభిస్తుందనే దాన్ని ఎంపికచేశాం’ అంటూ చెప్పుకొస్తున్నారు సదరు నిపుణులు. ఏటా మార్కెట్లోకి వచ్చే బ్రాండెడ్ ఉత్పత్తులమీద ఈ సంస్థ ఎంపికచేసే రంగు ప్రభావం చూపుతుందన్నది తెలిసిందే. ఈ ఒక్క ఏడాదనే కాదు, నీలం ఎప్పుడూ ఫ్యాషనే. ఓ వంద మందిని ‘మీకే రంగు ఇష్టం’ అని అడిగితే, అందులో అరవై మంది నీలం ఫెవరెట్ కలర్ అంటే, మిగిలినవాళ్లు నచ్చే రెండో మూడో రంగుగా నీలాన్ని చెప్పారట. ఇష్టం లేదని చెప్పినవాళ్లు ఒక్క శాతం కూడా లేరనీ ముఖ్యంగా మగవాళ్లంతా నీలానికే ఓటేశారని గతంలో ఓ అధ్యయనంలో తేలింది. అందుకే నీలి వర్ణాన్ని యూనివర్సల్ ఫేవరెట్ కలర్ అంటారు. అంతెందుకు… సినిమా, సీరియల్, పత్రిక, పుస్తకం… ఏవి తీసుకున్నా వాటిల్లోని దృశ్యాలూ ప్రకటనలూ అన్నింటినీ నిశితంగా పరిశీలిస్తే నేపథ్యంలో ఓ రంగు తప్పక కనిపిస్తుంది. అదే నీలి వర్ణం. ముఖ్యంగా సినిమాల్లోని ప్రతి సీనులోనూ బ్యాక్‌గ్రౌండ్లోనో హీరోహీరోయిన్ల దుస్తుల్లోనో నీలిరంగు ఉండాల్సిందే. డెల్, ఫోర్డ్, ఇంటెల్, హెచ్‌పీ, శామ్‌సంగ్, ఇంటెల్… ఇలా కంపెనీల లోగోలన్నీ కూడా ఆ రంగులోనే మెరుస్తుంటాయి. ఎందుకంటే- నీలం కెమెరా క్యాచింగ్ కలర్. ఆ కారణంతోనే నీలి వర్ణానికి అంత డిమాండ్. నీలం లేకుండా చిత్రకారుల కుంచె కదలదంటే అతిశయోక్తి కాదు.