‘మారగలిగే సామర్థ్యమే తెలివితేటలకు కొలబద్ద’ అన్నారు భౌతిక, తత్త్వ శాస్తవ్రేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ . ‘మార్పుకు అనుగుణంగా ఎవరైతే మారగలిగారో వారే తెలివైనవారు’ అన్నది నగ్న సత్యం. జీవితం చాలా గొప్పది. అది ఎంతో నేర్పిస్తుంది. ఎన్నో మార్పులు తెస్తుంది. అయితే ఆ మార్పునకు అనుగుణంగా మనలో మార్పులు అవసరం. పుట్టినప్పటినుంచి చివరిదాకా మనిషి నేర్చుకొంటూనే ఉంటాడు. తెలివైనవాడు ఎప్పుడూ నిత్య విద్యార్థిగానే ఉంటాడు. మార్పులు ద్వారా ఇంకా నేర్చుకొంటుంటాడు. జీవితం కూడా నేర్చుకోమని చెపుతుంది. మారమని చెపుతుంది. నిత్యం కొత్తదనంతో కొత్తకోణంలో ఉజ్వల భవిష్యత్తుకై ఆలోచించండి. అలా ఆలోచించేది కూడా పెద్దదిగా ఆలోచించండి. మార్పుకోసం చేసే పయనంలో కొన్ని లోటుపాట్లవల్ల ఒడిదుడుకులు ఎదుర్కోవచ్చు. వాటిని మన సంపత్తితో మరింత ఆలోచనతో సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు.
మహనీయుల విజయగాథలు తెలుసుకొని మారాల్సిన అవసరం ఉందని గుర్తించారు మేధావులు. ఈ కోవలో ఐన్స్టీన్ ప్రతిపాదించిన ‘ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతం’ ఇదే! కాంతికంటే వేగంగా ఏదీ ప్రయాణించలేదని, అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుందని ఐన్స్టీన్ గుర్తించాడు. న్యూటన్ కాలాన్ని ఒక నదీ ప్రవాహంగా భావించాడు. అది వింటిని వదలిన బాణంలాగా గతం నుండి వర్తమానం గుండా భవిష్యత్తు వైపుకు అవిచ్ఛిన్నంగా, ఏక రూపంగా ప్రయాణిస్తుందనీ, దాని గతి ఏ కారణంగానూ మారదని చెప్పాడు. కానీ ఐన్స్టీన్ కాలమనే నదీ ప్రవాహం ఏకరీతిగా సాగదని, గ్రహాలూ, నక్షత్రాలు, గెలాక్సీల వంటివాటిలో సమక్షంలో అది వంపు తిరుగుతుందని, వాటి చుట్టూ కాలం వేగంగా సాగడమో లేక నిదానంగా సాగడమో జరుగుతుందని తెలిపాడు. సముద్రంలో ఈదే చేప తన చుట్టుప్రక్కల వున్న నీటిని ఎలా వెనక్కి నెడుతుందో అలాగే ఒక నక్షత్రము లేదా తోకచుక్క లేదా గ్రహము తను ప్రయాణించే అంతరిక్షంలో దాని దిక్కాలలో మార్పును తీసుకువస్తుంది. దిశ, కాలాలు వేర్వేరు కావు. అవి ఒకటి లేకుండా ఒకటి మనలేవు అని ఐన్స్టీన్ నిరూపించారు.మనం చూస్తున్నవాటిల్లో కొన్ని ఎన్నడూ మారనట్లు, నిత్యం తెల్లవారడం పొద్దుకుంగడం, సూర్యోదయం, సూర్యాస్తమయం గమనిస్తాం. కొండలు సముద్రాలు అలాగే వుంటాయి. కాని మనం మాత్రం మారుతుంటాం. పుట్టుక, పెరుగుదల, మరణం మార్పులో భాగమే. అలాగే కొన్ని వస్తువులు తుప్పుపడుతుంటాయి. మరికొన్ని శిథిలమవుతుంటాయి. మారనిది అంటూ ఏదీ లేదు. ఎంతసేపట్లో మారతాయనేదే ప్రశ్న. మార్పుకు పట్టే కాలాన్ని బట్టి కొన్ని అసలు మారనట్లే అన్పిస్తాయి. మార్పుతో ముడిపడి కాలం వున్నది. మనం దీనినే గతం, వర్తమానం, భవిష్యత్తు అని విభజించాం. భౌతిక విజ్ఞానం గతం- భవిష్యత్తునే పేర్కొంది. కాలాన్ని విడిగా చూచిన తీరును ఐన్స్టీన్ మార్చేసి, కాలం ప్రదేశం కలిపేడు. ఈ ప్రపంచలో ఎన్నో వస్తువులు ఉండగా వాటిలో మార్పులు వివిధ రకాలుగా కనిపిస్తున్నవి. సైన్సులోని భిన్న శాఖలు ఆయా రంగాలలోని మార్పుల్ని అధ్యయనం చేసి చెబుతున్నాయి.ఒకప్పుడు న్యూటన్ ప్రపంచంలో వున్న మనం ఇప్పుడు ఐన్స్టీన్ విశ్వంలో అడుగుపెట్టాం. మన భావాలెన్నో మార్చుకోవలసి వస్తుంది. ఖగోళ శాస్త్ర పరిశోధనలు మన సంప్రదాయ ఆలోచనల్ని పూర్తిగా మార్చివేస్తున్నాయి. మార్పు పరిణామంలో ఆధునిక భావాలు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో మనమూ మారుతున్నాం.. మారాలి.. మార్పు కోసం మారాలి. వివేకంతో ఎవరైతే మారగలరో వారే అత్యుత్తమ ఫలితాలతో ఘనవిజయాన్ని సాధిస్తారు. మారకపోతే మాత్రం జీవితంలో వారి ఎదుగుదల వుండదు. ఈ సమాజంలో తెలివైనవారుగా గుర్తింపు పొందరు. లేదంటే, గొంగళిపురుగుగా మారుతారు ఎక్కడి గొంగళి అక్కడేలా.. అదే మార్పు వైపు అడుగులు వేస్తే గొంగళిపురుగు దశనుంచి సీతాకోక చిలుక చందాన పరిణామం చెందుతారు. ఉజ్వల భవిష్యత్తును చవిచూస్తారు.
నాటినుంచి నేటివరకు తెలివైనవారు ఎందరో మారడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాలచక్రంలో, మారుతున్న కాలంతో, ఎన్నో ఎనె్నన్నో మార్పులు వచ్చాయి. మానవ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం వందసార్లు విఫలమైనా పట్టువదలని విక్రమారుడిలా మార్పులు చేస్తూనే, చివరికి తన మేధోసంపత్తితో థామస్ అల్వా ఎడిసన్ బల్బును కనుగొన్నారు. విద్యుత్ కనుగొన్నందున జీవనశైలి మారింది. ఇలా ఒకటేమిటీ ఎన్నో మార్పులు వచ్చాయి… వస్తున్నాయి.. ఇంకా వస్తాయి. తెలివితేటలతో మార్పుకోసం పయనిస్తే మన జీవన విధానంలో ఇంకా అనేక మార్పులు కూడా చోటుచేసుకుంటాయి.ప్రపంచంలో మార్పులు రావాలని, మార్పులు తీసుకురావాలని ఎనె్నన్నో చెబుతారు. కానీ తనదాకా వచ్చేసరికి దాన్ని ఆచరించరు. మార్చగల సామర్థ్యం ఒకరి తెలివితేటలను నిర్ణయిస్తుందనేది పచ్చి నిజం. మార్పు గొప్ప గుణం. మార్పును స్వీకరించగలిగితే ఏదైనా సాధించవచ్చు. మార్పు రావటం అనేదే తెలివితేటలకు నిదర్శనం. విజయం అనేది అంత సులభం కాదు. కష్టపడితేనే వస్తుంది. తన భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకోవాలంటే తన ఆలోచనలను, అలవాట్లను దృక్పథాన్ని మార్చుకోవాలి. పట్టుదల, కృషి వుంటే మార్పుతో అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది.నిన్నటిరోజు ఈ రోజు రాదు. అలా వుండదు. కాబట్టి మార్పు అవసరం. మార్పుకు అనుగుణంగా మారాలి. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఒక్క మార్పు తప్ప. కాలక్రమంలో ఈ మార్పులను గుర్తించినవాడే చార్లిస్ డార్విన్. ఆధునిక జీవశాస్త్రంలో డార్వినిజం చాలా మార్పు తెచ్చింది ఆయన జీవ పరిణామ సిద్ధాంతమే భూమిమీది జీవుల పరిణామక్రమాన్ని తెలియజేస్తుంది. భూమిపై జీవజాలం ఏ విధంగా పరిణామక్రమం చెందాయి అనే విషయంపై పరిశోధనలు చేశాడు. జీవపరిణామ సిద్ధాంతాన్ని వర్ణించాడు.బాబాసాహెబ్ అంబేద్కర్, సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలామ్ లాంటివారు ఎందరో మార్పుకోసం పాటుపడినవారే. ఇలాంటి మేధావుల విజయగాథలను స్ఫూర్తిగా తీసుకొని మనం మారుతూ.. మారుకోసం కృషి చేస్తూ తెలివైనవాడిగా సమాజంలో గుర్తింపు పొందుతారు. అభివృద్ధి సాధించాం అంటే.. మార్పు కోరుకోవటమే. ఇపుడు అన్ని రంగాలలోనూ అనేక మార్పులు వచ్చాయి. నాటి తాళపత్ర గ్రంథాల స్థాయి నుంచి పుస్తక ప్రతుల స్థాయికెదిగి తాజాగా అంతర్జాలం వరకు మార్పు చోటుచేసుకొంది.నేటి సమాజంలో మార్పు రావాలంటే ముందు మనం మారాలి. మన ఆలోచనలు మారాలి. మన ఇంట్లో ఉండేవారు మారాలి. మన చుట్టూ ఉండేవారు మారాలి. ప్రతిఒక్కరిలో మార్పు రావాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది.మార్పు అనివార్యం. అదే తెలివైనవాడి లక్ష్యం. ఆ లక్ష్యం ఏర్పడాలి. ఆ లక్ష్యమే తెలివైనవారిగా తీర్చిదిద్దుతుంది. అందుకే అందరిలో మార్పును కోరుకుందాం. మారగలిగే సామర్థ్యమే తెలివితేటలకు కొలబద్దగా నిలుద్దాం!