DailyDose

సరిహద్దును మరిపిస్తున్న రాజధాని-తాజావార్తలు

AP Capital Amaravathi Resembles The Border-Telugu Breaking News Roundup

* జగన్‌ అక్రమాస్తుల కేసులో భాగంగా పెన్నా సిమెంట్స్‌ వ్యవహారంలో సీబీఐ కోర్టు అనుబంధ ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో పలువురికి సమన్లు జారీ అయ్యాయి. తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి, విశ్రాంత అధికారులు శామ్యూల్‌, వీడీ రాజగోపాల్‌, డీఆర్వో సుదర్శన్‌రెడ్డి, తహసీల్దార్‌ ఎల్లమ్మకు సీబీఐ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా ఈ నెల 17న నిందితులు హాజరు కావాలని ఆదేశించింది.

* తుళ్లూరులో మహిళల మీద పోలీసుల చర్యలపై జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది. రేపు అమరావతికి నిజనిర్ధరణ కమిటీని పంపించనున్నట్లు కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తుళ్లూరు, మందడంతో పాటు మొత్తం 29 గ్రామాల్లో నిరసన తెలియజేస్తున్న మహిళలపై పోలీసులు ఇష్టారీతిన దాడి చేశారని, కించపరిచే విధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ మహిళలు ట్విటర్‌, ఆన్‌లైన్‌ ద్వారా జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినందువల్లే రేఖా శర్మ స్పందించినట్లు తెలుస్తోంది.

* తుళ్లూరు ఘటనపై ఎస్పీ విజయరావు స్పందించారు. శాంతి భద్రతలను పరిరక్షించడం తమ బాధ్యత అని అన్నారు. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్టు అమల్లో ఉన్నట్లు ముందుగానే ప్రకటించామని, చట్టవిరుద్ధంగా ఒకేసారి గుంపుగా రావడం వల్లే వారిని అడ్డుకున్నామని వివరించారు. పోలీసులు ఎవరిపైనా దాడి చేయలేదని, నకిలీ వీడియోలు వైరల్ చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నట్లు ఎస్పీ వివరించారు.

* ఏపీ రాజధాని గ్రామాలు సరిహద్దును తలపిస్తున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. రాజధాని గ్రామాల్లో పోలీసుల మొహరింపుపై ఆయన ట్విటర్‌ ద్వారా స్పందించారు. భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో కూడా ఇంతమంది పోలీసులు ఉండరని అన్నారు. అన్యాయంగా, క్రూరంగా పోలీసు బలంతో ఉద్యమాన్ని అణచివేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రంలో యుద్ధ వాతావరణం తీసుకొస్తు్న్నారని మండిపడ్డారు. ఉద్యమాన్ని ప్రభుత్వం ఎంత అణచివేస్తే అంత ఉగ్రరూపం దాలుస్తుందని చెప్పారు.

* రాజధాని ప్రాంతంలో అరెస్టు చేసిన మహిళలు, రైతులను గుంటూరు, మంగళగిరి, తాడికొండ పోలీసు స్టేషన్లకు తరలించారు. మహిళా కానిస్టేబుళ్లు లేకుండా వారిని వాహనాల్లో తరలించడంపై మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాగేందుకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో నల్లపాడు వద్ద రాజకీయ ఐకాస ఆందోళన చేపట్టింది. అదుపులోకి తీసుకున్న రైతులు, మహిళలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

* కేంద్ర బడ్జెట్‌లో మెరుగైన ప్రతిపాదనల కోసం వివిధ వర్గాల నిపుణులు, ప్రముఖులతో ప్రధాని మోదీ సమావేశమవడంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. తన సంపన్న స్నేహితుల కోసమే మోదీ ఈ విస్తృత స్థాయి సంప్రదింపులు జరుపుతున్నారని దుయ్యబట్టారు. వీటిపై ట్విటర్‌ వేదికగా స్పందించిన రాహుల్‌.. ‘మన రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, మధ్య తరగతి పన్ను చెల్లింపుదారుల అభిప్రాయాలు, ఆలోచనలపై మోదీకి ఎలాంటి ఆసక్తి ఉండదు’ అని ఆరోపించారు. ‘సూట్‌బూట్‌బడ్జెట్‌’ అని హ్యాష్‌ట్యాగ్‌ను జతచేస్తూ విమర్శలు చేశారు.

* 370 అధికరణ రద్దు అనంతరం జమ్మూకశ్మీర్‌లో విధించిన ఆంక్షలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. జస్టిస్‌ ఎన్వీ రమణ తీర్పు ప్రతులను చదివారు. ‘భావవ్యక్తీకరణ స్వేచ్ఛలో అంతర్జాలాన్ని ఉపయోగించుకునే హక్కు కూడా ఉంది. కశ్మీర్‌ చాలా హింసను ఎదుర్కొంది. మానవ హక్కులు, భద్రతా సమస్యలను సమతుల్యం చేయడం మాపని. జమ్ముకశ్మీర్‌లో విధించిన అన్ని ఆంక్షలపై వారంలోగా సమీక్షించాలి. ఇంటర్నెట్‌ సేవలను శాశ్వతంగా నిలిపివేయడానికి అనుమతించబోము.

* ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ దిగ్గజం అలీబాబాకు చెందిన యాంట్‌ ఫైనాన్షియల్‌ జొమాటోలో పెట్టుబడి పెట్టనుంది. ఈ క్రమంలో కంపెనీ విలువను 3 బిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టారు. ఈ విషయాన్ని శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో జొమాటో ప్రధాన వాటాదారు ఇన్ఫోఎడ్జ్‌ వెల్లడించింది. ఈ ఫండింగ్‌ మూగిసిన తర్వాత కంపెనీలో తన వాట 26.38 శాతం నుంచి 25.13 శాతానికి తగ్గనుందని వెల్లడించింది. భారత్‌లో ఫుడ్‌ డెలివరీ మార్కెట్లో పోటీ పెరిగిపోవడంతో జొమాటో కూడా విస్తరణపై దృష్టిపెట్టింది.

* మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టినవేళ వరుసగా రెండో రోజు సూచీలు లాభాలను దక్కించుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, ఐటీ, బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌, ఫార్మా, లోహ రంగాల షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 147 పాయింట్ల లాభంతో 41,600 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 41 పాయింట్లు లాభపడి 12,256 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.02గా కొనసాగుతోంది.

* రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో ఉద్రిక్తత కొనసాగుతోంది. తుళ్లూరు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి పాదయాత్రగా బయల్దేరిన మహిళలను గ్రామ శివారులో పోలీసులు అడ్డుకున్నారు. తాము దైవదర్శనానికి వెళ్తున్నామని ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి కాదని, తమకు అనుమతివ్వాలని మహిళలు పోలీసులను వేడుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని, విరమించుకోవాలని చెప్పడంతో మహిళలు… పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది.

* రాజధాని ఉద్యమం ఉద్ధృతం కావడంతో ఎక్కడికక్కడ తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మహిళల పాదయాత్రకు తెదేపా నేతలు హాజరయ్యే అవకాశం ఉందన్న సమాచారంతో విజయవాడ నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో తెదేపా నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. విజయవాడలో ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చందు తదితరులను గృహనిర్బంధం చేశారు.

* రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో ఆందోళనలు 24వ రోజుకు చేరాయి. మందడంలో రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామ దేవత పోలేరమ్మకు మొక్కులు చెల్లించేందుకు గ్రామస్థులు ఆలయం వద్దకు చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు భారీగా మోహరించి ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతించలేదు. ఈక్రమంలో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

* అమరావతిలో రాజధాని పెట్టినందుకే దూరాభారంతో బాధపడ్డామని, ఇప్పుడు తల ఒక చోట మొండెం ఒక చోట అన్నట్లు.. రాజధానిని ముక్కలు చేసి మరోచోటికి తీసెకెళ్తానంటే కుదరదని తెదేపా నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ‘‘ మీరు తలకాయ అక్కడ పెడతా కాళ్లు ఇక్కడే ఉంచుతా.. చెయ్యి ఒకచోట.. కాలు ఒక చోట విసిరేస్తా అంటే.. మా పనుల కోసం ఇక్కడికీ.. అక్కడికీ పరుగెత్తాలా?’’ అని జేసీ ప్రశ్నించారు.

* సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 17కి వాయిదా పడింది. కేసు విచారణ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి నాంపల్లి గగన్‌ విహార్‌లోని ప్రత్యేక న్యాయస్థానానికి హాజరయ్యారు. గత 8ఏళ్లుగా ఈకేసు విచారణ జరుగుతోంది. ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ సీబీఐ కోర్టుకు హాజరుకావడం ఇదే తొలిసారి.

* దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై కేంద్ర మానవ వనరుల అభివృధ్ధి శాఖ(హెచ్‌ఆర్డీ) వర్సిటీ వీసీ జగదీశ్‌ కుమార్‌కు సమన్లు జారీ చేసింది. ఈ ఉదయం 11.30 గంటలకు హెచ్‌ఆర్డీ సెక్రటరీతో జగదీశ్‌ సమావేశమవ్వాలని ఆదేశించింది.

* సైరస్‌ మిస్త్రీ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ పునర్నియామకంపై సుప్రీంకోర్టు స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మిస్త్రీకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సైరస్‌ మిస్త్రీని తిరిగి టాటా సన్స్‌ ఛైర్మన్‌గా నియమించాలంటూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ) డిసెంబరు 18న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

* అంతర్జాతీయ వేదికగా భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు ప్రయత్నించిన దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత్‌ దీటుగా బదులిచ్చింది. చీకటి కళలకు పాక్‌ ఉత్తమ ఉదాహరణ అని విమర్శించింది. ‘‘పాకిస్థాన్‌కు మా సమాధానం ఒక్కటే.. ముందు మీ దేశంలో ఉన్న సమస్యలను చూసుకుని వాటిని పరిష్కరించుకోండి. మీ అబద్ధపు కుట్రలను సాగనిచ్చేందుకు ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు’ అని ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ స్పష్టంగా చెప్పారు.

* ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలా లేవు. తాజాగా ఇరాన్‌ మద్దుతు ఉన్న పాపులర్‌ మొబిలైజేషన్‌ దళాలకు చెందిన ఆయుధాగారంపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడి నిర్వహించినట్లు భావిస్తున్నారు. ఈ విషయాన్ని అరబిక్‌ మీడియా సంస్థ డెర్రెజ్జార్‌24 పేర్కొంది. లెబనాన్‌కు చెందిన అల్‌ మైదీన్‌ న్యూస్‌ సంస్థ కూడా ఇజ్రాయిల్‌ విమనాలే ఈ దాడి చేసినట్లు పేర్కొంది.