DailyDose

మిస్త్రీకి సుప్రీంలో ఎదురుదెబ్బ-వాణిజ్యం

Cyrus Mistri Faces Stay From Supreme Court-Telugu Business News Roundup

* సైరస్‌ మిస్త్రీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ పునర్నియామకంపై సుప్రీంకోర్టు స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మిస్త్రీకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సైరస్‌ మిస్త్రీని తిరిగి టాటా సన్స్‌ ఛైర్మన్‌గా నియమించాలంటూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ) డిసెంబరు 18న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తీర్పును సవాలు చేస్తూ టాటా సన్స్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్య కాంత్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మిస్త్రీ పునర్నియామకంపై స్టే ఇస్తూ తీర్పునిచ్చింది. 2016 అక్టోబరు 24న మిస్త్రీని తొలగించారు. కార్పొరేట్‌ నియమ నిబంధనలకు విరుద్ధంగా తనను తొలగించారని ఆరోపిస్తూ మిస్త్రీ న్యాయపోరాటం చేశారు. ఇందులో భాగంగానే ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించగా.. అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. టాటా సన్స్‌ లేదా ఇతర గ్రూపు కంపెనీల్లో ఛైర్మన్‌/ఎగ్జిక్యూటివ్‌ పదవులు చేపట్టాలనే ఆసక్తి తనకు లేదని, హోల్డింగ్‌ కంపెనీ బోర్డులో మాత్రం చోటు కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

* ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 2020లో మొదటి ‘గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌’ తేదీలను ప్రకటించింది. ఈ ఆన్‌లైన్‌ కొనుగోళ్ల పండగ భారత దేశంలో జనవరి 19 నుంచి 22 వరకు ఉంటుంది. కాగా ప్రైమ్‌ వినియోగదారులకు మాత్రం 12 గంటలు ముందుగా అంటే జనవరి 18 మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలవుతుంది. అంతేకాకుండా ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారులకు ఈ సేల్‌లో ప్రతి కొనుగోలుపై అదనంగా 10 శాతం డిస్కౌంటు లభిస్తుందని సంస్థ ప్రకటించింది.

* వీడియోకాన్‌ రుణాల మంజూరు వ్యవహారంలో మనీలాండరింగ్‌ క్రిమినల్‌ కేసును ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందాకొచ్చర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరో షాకిచ్చింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా కొచ్చర్‌ ఇల్లు, ఆస్తులను అటాచ్‌ చేసింది. ముంబయిలోని చందాకొచ్చర్‌ ఫ్లాట్‌, ఆమె భర్త దీపక్‌ కంపెనీకి చెందిన కొన్ని ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. వీటి విలువ రూ.78కోట్లు అని అధికారులు వెల్లడించారు.

* ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ దిగ్గజం అలీబాబాకు చెందిన యాంట్‌ ఫైనాన్షియల్‌ జొమాటోలో పెట్టుబడి పెట్టనుంది. ఈ క్రమంలో కంపెనీ విలువను 3 బిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టారు. ఈ విషయాన్ని శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో జొమాటో ప్రధాన వాటాదారు ఇన్ఫోఎడ్జ్‌ వెల్లడించింది. ఈ ఫండింగ్‌ మూగిసిన తర్వాత కంపెనీలో తన వాట 26.38 శాతం నుంచి 25.13 శాతానికి తగ్గనుందని వెల్లడించింది.

* ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువగా అమ్ముడైన లగ్జరీ కారు బ్రాండ్‌గా వరుసగా తొమ్మిదో ఏడాది మెర్సిడెస్‌ బెంజ్‌ అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది 23.4 లక్షల బెంజ్‌ ప్యాసింజర్‌ కార్లు అమ్ముడైనట్లు ఈ జర్మనీ కంపెనీ తాజాగా వెల్లడించింది. జర్మనీ, చైనా, అమెరికాల్లో బెంజ్‌ గతేడాది రికార్డు విక్రయాలను నమోదు చేసింది. చైనాలో ఈ కారు విక్రయాలు 6.2శాతం పెరిగాయి.

* చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ రియల్‌మీ బడ్జెట్‌ ధరలో మరో ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ 5కు కొనసాగింపుగా తక్కువ ధరలో 5ఇ పేరిట మరో కొత్త మొబైల్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, క్వాడ్‌ కెమెరా ఈ ఫోన్‌ ప్రత్యేకత. 4జీబీ/64జీబీ వేరియంట్‌ను మాత్రమే తీసుకొచ్చారు. దీని ధరను రూ.8,999గా నిర్ణయించారు. ఆక్వా బ్లూ, ఫారెస్ట్‌ గ్రీన్‌ రంగుల్లో లభిస్తోంది. జనవరి 15 మధ్యాహ్నం 12 గంటలకు మొదటి సేల్‌ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ.కామ్‌ వెబ్‌సైట్లలో విక్రయాలు జరుగుతాయి. లాంచ్‌ ఆఫర్‌ కింద జియో వినియోగదారులకు రూ.7,550 విలువైన ప్రయోజనాలు అందిస్తున్నారు. అలాగే మోబిక్విక్‌తో కొనుగోలుపై 10 శాతం సూపర్‌ క్యాష్‌ను అందిస్తున్నారు. క్యాషిఫై ద్వారా కొనుగోలుపై అదనపు ఎక్స్ఛేంజ్‌ డిస్కౌంట్‌ను పొందొచ్చు.