Devotional

14న గోదా కల్యాణం

Godha Kalyanam On 14th

అదో ప్రేమ కథ…

అలౌకికమైన, వినిర్మలమైన ప్రేమ కథ…

శ్రీవిల్లీపుత్తూరులో విష్ణుచిత్తుడనే పెద్దమనిషి. ఆయనకు సర్వం కృష్ణుడే. ఆయన పూజ చేయందే తెల్లవారదు. ఆ భక్తి కారణంగానే ఆయన ఆళ్వారుల్లో ఒకరై పెరియాళ్వారనే పేరును పొందారు. విల్లిపుత్తూరులోని ఆలయంలో ఉన్న వట పత్రశాయికి రోజూ పుష్పమాలా కైంకర్యం చేస్తూ ఉండేవాడు. పుష్ప మాలల కోసం… అలాగే స్వామికి తులసి దళమాల సమర్పణ కోసం అక్కడొక తులసి వనం ఉండేది. ఆ వనంలోని పుష్పాలు తులసీదళాలతో పూలమాలలు అల్లి స్వామికి సమర్పిస్తుండేవారు. ఓ రోజు ఆ వనంలోని ఒక తులసి పాదులో ఓ బంగారు తల్లి విష్ణుచిత్తుడికి కనిపించింది. ఆ శిశువుకు కోదై అని పేరు పెట్టారు పెరియాళ్వారు. కోదై అన్న పదమే కాలక్రమంలో గోదాగా మారింది.

ఇక ఆ చిన్నారి సందడి చూడాలి… చిన్నప్పటి నుంచి కోదై తన తండ్రి చేస్తున్న శ్రీకృష్ణ పూజను ఎంతో ఇష్టంగా చేస్తుండేది. ఆమెకు యుక్తవయస్సు వచ్చేసరికి తండ్రి పూజిస్తున్న ఆ వటపత్ర శాయి మీద మరింత మనస్సు లగ్నమైంది. ఆ ఇష్టమే అలౌకిక ప్రేమగా మారింది. ఆ అనంత ప్రేమ భావనలోనే నిత్యం లీనమై ఉంటూ ఉండేది. తన ప్రేమ భావనలను పాశురాలుగా మార్చి స్వామిని అర్చించింది. రోజుకొక్క పాశురం చొప్పున ముప్ఫై పాశురాలు రచించి తిరుప్పావై నోము నోచింది. ఈ వ్రతం చేసేటప్పుడు ఆ తల్లి ఆనాడు శ్రీవిల్లిపుత్తూరును రేపల్లెగా భావించుకుంది. అక్కడి ఆలయంలోని వటపత్రశాయిని ఆనాడు రేపల్లెలో ఉన్న కృష్ణుడిగా తలచింది. తన స్నేహితురాళ్లను గోపికలుగా ఊహించుకుని వ్రతాన్ని చేసింది.

తాను స్వామికి ఎంతవరకూ తగినదాన్ని అని తెలుసుకోవాలన్న ఒక ఆలోచన ఓ రోజు ఆమెకు కలిగింది. కనీసం తన తండ్రి రోజూ స్వామికి అలంకరించే తులసి మాలకైనా సరితూగుతానా? అని తెలుసుకోవాలనుకుంది. ఓ రోజు స్వామికోసం అల్లిన మాలలన్నీ ముందుగా తాను ధరించి ఆలయం ఆవరణలో ఉన్న బావి నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని మురిసిపోయింది.

ఈ విషయం విష్ణుచిత్తుడికి తెలియదు. గోదామాత ధరించి తీసిన మాలలనే స్వామికి సమర్పిస్తూ ఉండేవాడు.

ఓ రోజు ఆ విషయం విష్ణుచిత్తుడికి తెలిసింది.

అయ్యో! స్వామికి అలంకరిచేందుకు సిద్ధంగా ఉంచిన పూలదండ ముందుగా తన కుమార్తె ధరించిందే అని బాధపడ్డారు.

కానీ అదే రోజు రాత్రి కలలో శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుడికి కనిపించాడు. ఆమె ముడిచి విడిచిన దండే తనకు ముద్దు మురిపెం అని చెప్పాడు…

ఇక పెరియాళ్వార్‌ ఆనందానికి అవధుల్లేవు.

సాక్షాత్తు అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడే ఇష్టపడుతున్నాడంటే ఆమె ఎవరు…

కచ్చితంగా ఆమె జగజ్జనని అయిన లక్ష్మీదేవే అని అనుకున్నారు. అయినా తండ్రి కదా… తన బాధ్యతను నిర్వర్తించాలి కదా… బిడ్డ దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చారు.

ఆమేమో తాను ఆ శ్రీకృష్ణుడిని తప్ప మరొకడిని వివాహమాడనంది.

అయ్యవారిదేమో అలౌకిక దర్శనం…అమ్మదేమో భౌతిక రూపలావణ్యం…మరి ఈ వివాహం సాధ్యమయ్యేదెలా?

ఆ ఆలోచనలో ఉండగానే మరోసారి స్వప్నంలో స్వామి సాక్షాత్కరించారు. గోదాదేవి ప్రేమకు నేను వశమయ్యాను. పెళ్లి ఏర్పాట్లు చేయి. ఆమెను పెళ్లి కూతురిగా అలంకరించి నా ఆలయానికి తీసుకురా. నీకు పాండ్యరాజు కూడా సహకరిస్తాడు. అని చెప్పాడు. ఈ విషయం అందరికీ తెలిసింది. పాండ్యరాజు దాకా వెళ్లింది.

ఇంతకన్నా అదృష్టమా… సాక్షాత్తు రంగనాథస్వామి వివాహం తమ చేతులమీదుగానా? రాజుగారు తలచుకున్నారు. శ్రీరంగంలోని ప్రధానాలయంలో పెళ్లికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు.

అయినా చాలా మందిలో సందేహం…

అసలు ఈ వివాహం ఎలా జరుగుతుంది?

అందరూ ఆలోచనల్లో ఉండగానే అపురూపంగా అలంకరించుకున్న గోదాదేవి ఆలయంలో అడుగుపెట్టింది.

పెరియాళ్వారు ఇతర పెద్దలు ఆనందాశ్రువులతో వెంట నడుస్తుండగా ఆమె గర్భాలయంలోకి ప్రవేశించింది.

అక్కడ శేషతల్పశాయి అయిన శ్రీరంగనాథుడి దివ్యమంగళ విగ్రహం పాదాల దగ్గర కూర్చుంది.

నీవు తప్ప ఇహపరంబెరుంగ… అంటూ తన తలను స్వామి పాదాలకు అన్చింది. మరుక్షణంలోనే ఆ ప్రేమమూర్తి శ్రీరంగనాధుడిలో తన ఆత్మను లీనం చేసేసింది. దీన్నంతా గర్భాలయం వెలుపల నుంచి చూస్తున్న వారంతా అవాక్కయ్యారు.

భక్తి, ప్రేమకు ప్రతిరూపమైన ఆండాళ్‌మాతను తలచుకుంటూ అందరూ వెనుదిరిగారు.

గోదాదేవి ప్రేమ అపురూపమైంది… దివ్యమైంది.

అది అనంతానందాన్నిచ్చే కల్యాణఘట్టం.

ఆ ప్రేమ కథనే మననం చేసుకుంటూ ఆనంద పారవశ్యంలో మునిగితేలుతుంటారు భక్తజనులు.

గోదామాతగా, ఆండాళ్‌ తల్లిగా అందరి పూజలు అందుకొంటున్న సాక్షాత్తు లక్ష్మీదేవి చేసిన వ్రతమే శ్రీవత్రం సిరినోముగా భావిస్తారు భక్తులు. ధనుర్మాస వ్రతం పేరుతో

నెలరోజులపాటు నిర్వహించి…చివర్లో ఆ తల్లికి, శ్రీరంగనాథుడికి కల్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది.

గోదామాత ఆవిర్భావం దైవసంకల్పం తప్ప మరొకటి కాదని భక్తులు నమ్ముతారు. ఆ తల్లి రచించిన ముప్ఫై పాశురాలు వేదసమానాలయ్యాయి. ఆ తిరుప్పావై పాశురాలను ద్రవిడ ప్రబంధంగా ఈనాటికీ పండితులు ప్రశంసిస్తుంటారు.

శ్రీకృష్ణదేవరాయలు రచించిన ప్రబంధం పేరు ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యద అంటే ముడిచి విడిచిన దండలను ఇచ్చిన అమ్మ అని అర్థం. గోదామాత ముందుగా తన కొప్పున ముడిచి ఆ తర్వాత విడిచిన దండలను శ్రీకృష్ణస్వామికి సమర్పించింది. అందుకే ఆ పేరొచ్చింది. ఈ అమ్మను తమిళ భాషలో శూడికొడుత్త నాచియార్‌ అని అంటారు. అన్నమాచార్యుడు కూడా అమ్మను కడుత్త నాంచారి అని స్తుతించాడు.