రాజధాని రైతులపై తప్పుడు వ్యాఖ్యలు చేసే అధికార పార్టీ నాయకులు ఇళ్లల్లోంచి బయటకొచ్చి.. రాజధాని ప్రాంతంలో సమావేశం నిర్వహించాలని జనసేన నాయకుడు నాగబాబు సవాల్ విసిరారు. అపుడు రాజధాని ప్రజలు మీకు చేసే సన్మానం కళ్లారా చూడాలనుందని ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యానించారు. కులం ఎప్పుడూ చెడ్డది కాదని, మనుషుల్లోనే మంచివారు, చెడ్డవారు ఉంటారని ఆయన అన్నారు. కులాల మీద పగబట్టి వాళ్ల జీవితాలతో ఆడుకోవడం ఎవరికీ మంచిది కాదని నాగబాబు అభిప్రాయపడ్డారు. యూదులపై పగబట్టి వాళ్ల జాతిని నాశనం చేసిన ఆడాల్ఫ్ హిట్లర్ కూడా నాశనమయ్యారని చెబుతూ.. దయచేసి అలాంటి తప్పు చేయవద్దని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. రాజధాని విషయంలో తన నిర్ణయాన్ని సరిదిద్దుకునే అవకాశం ముఖ్యమంత్రికి ఇప్పటికీ ఉందన్నారు. మరోవైపు రాజధాని రైతుల పోరాటం ప్రశంసనీయమని, ఏపీ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. రైతులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వారి పోరాటం వృథా కాకూడదన్నారు.
వైకాపాకు నాగబాబు సవాల్
Related tags :