రాజధాని ఉద్యమం ఉద్ధృతం కావడంతో ఎక్కడికక్కడ తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మహిళల పాదయాత్రకు తెదేపా నేతలు హాజరయ్యే అవకాశం ఉందన్న సమాచారంతో విజయవాడ నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో తెదేపా నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. విజయవాడలో ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చందు తదితరులను గృహనిర్బంధం చేశారు. ఉయ్యూరులో యలమంచిలి రాజేంద్రప్రసాద్‌ను హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ… అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. తెదేపా నేతలను అరెస్టు చేయించడం జగన్ ప్రభుత్వం కుట్ర అని ఆరోపించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని విజయవాడ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. ఏపీలో ఉన్నామో..లేక పాకిస్థాన్‌లో ఉన్నామో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు నిర్వర్తించకుండా తనను పోలీసులు గృహనిర్బంధం చేయడం ఏంటని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలను అడ్డుకోవడాన్ని ఖండించారు. అణచివేసిన కొద్దీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జేఏసీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి కూడా వీల్లేదా? అని నిలదీశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరులో తెదేపా అధినేత చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు నిమ్మల రామానాయుడు వెళ్తుండగా..తణుకు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు. కారులో నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. పోలీసు వాహనంలో తణుకు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దుగ్గిరాలలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును పోలీసులు గృహనిర్బంధం చేశారు.
ఇది ఆంధ్రప్రదేశా? పాకిస్థానా?
Related tags :