ఉభయ తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు సహా ఇతర అంశాలపై చర్చించేందుకు కృష్ణా నదీయాజమాన్య బోర్డు ఇవాళ సమావేశమైంది. హైదరాబాద్ జలసౌధలో బోర్డు ఛైర్మన్ ఆర్.కె.గుప్తా అధ్యక్షతన బోర్డు 11వ సమావేశం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇరు రాష్ట్రాల ఇంజినీర్-ఇన్-చీఫ్‌లు, ఇంజినీర్లు సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే జూన్ వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు బోర్డు నీటి కేటాయింపులు చేసింది. తెలంగాణకు 140 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 84 టీఎంసీలు కేటాయించింది. వరద సమయంలో ఏపీ వినియోగించుకున్న అధిక జలాలను ఎలా పరిగణించాలన్న విషయమై తేల్చేందుకు కమిటీని నియమించాలని బోర్డు నిర్ణయించింది. ఆ కమిటీ వచ్చే నీటి సంవత్సరంలోగా నివేదిక ఇవ్వనున్నట్లు బోర్డు తెలిపింది. విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డును ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని ఏపీ అధికారులు సమావేశంలో కోరారు. విభజనచట్టం ప్రకారం బోర్డు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిందేనని.. అయితే ప్రస్తుతం రాజధాని విషయంలో సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ఈ అంశంపై భవిష్యత్తులో చర్చించడం మంచిదనే అభిప్రాయాన్ని బోర్డు ఛైర్మన్ ఆర్.కె.గుప్తా వెల్లడించినట్లు తెలుస్తోంది. బోర్డు నిర్వహణా నియమావళికి సంబంధించి మరోమారు విడిగా బోర్డు సమావేశం కానుంది.
ఓ కొలిక్కి వచ్చిన తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ
Related tags :