Editorials

నేడు నవ్వుల దినోత్సవం

World Laughter Day 2020

ప్రశాంతత అనేది నవ్వుతోనే మొదలవుతుంది.. నీ చిరునవ్వే.. నీ జీవితాన్ని అందంగా తయారు చేస్తుంది.. నవ్వు రాళ్లనైనా కరిగిస్తుంది.. హృదయాలను కదిలిస్తుంది.. నవ్వుకు కులం, మతం, ప్రాంతం.. అన్న భేదం లేదు. అందరినీ అందంగా, ఆనందంగా ఉంచే ఒకే ఆయుధం నవ్వు.. ఒక్క చిరునవ్వు కొత్త వారిని సైతం నీకు పరిచయం చేస్తుందనడంలో అతిశయోక్తి కాదు.. అలాంటి నవ్వు.. అందిరికీ చిరకాలం ఉండాలి.. తద్వారా ప్రేమను, ఆహ్లాదాన్ని, ఆప్యాయతను, ఆనందాన్ని తెచ్చిపెట్టాలి. నేడు అంతర్జాతీయ నవ్వుల దినోత్సవం.
****చిరునవ్వును మానవ భాషగా అభివర్ణిస్తారు. అది వ్యక్తిత్వానికి ప్రతిబింబం. మనోభావాల మాధ్యమం. సంస్కారానికి సజీవ చిత్రం. ప్రపంచం అతి సులువుగా అర్థం చేసుకోగల శాంతి సంకేతం. ఆత్మీయంగా నవ్వితే ఇతరుల మనసు మన సొంతమే…! ఈ లోకంలో పసిపిల్లల నవ్వును మించిన సౌందర్యం లేదు. ఇది ఎన్ని లోకాలనైనా తనవైపుకు ఛటుక్కున తిప్పుకోగలదు.
*ఎదుటి వారిని చిరునవ్వుతో పలకరించండి. ఇక మీరూ అజాత శత్రువే. ద్వేషించేవారు సైతం మీ ‘ప్రపంచ భాష’కు దాసోహమంటారు. ముఖంపై చిరునవ్వు ఉంటే మరే అలంకారం అవసరం ఉండదు. గొప్ప సౌందర్యానికి అంతకంటే ఏముంటుంది? ప్రశాంత వదనంపై నుంచి కాస్త నవ్వు చిందించండి. ఏ రంగులూ పూసుకోవాల్సిన అవసరం లేదు.
*నవ్వు వ్యక్తిత్వానికి ప్రతిబింబంగా నిలుస్తుంది. ఒక నవ్వు కళ్లతోనే లోతుగా పలకరిస్తుంది. మరో నవ్వు కొనగంట ఆత్మీయతను ప్రకటిస్తుంది. ఇంకో నవ్వు హృదయపు లోతుల నుంచి తొంగిచూస్తుంది. అవతలి వాళ్లు మూడీగా ఉంటే మీ నవ్వే వాళ్లలో ఉత్తేజాన్ని నింపుతుంది.
*అప్పుడే పుట్టిన పసికందు నవ్వు ప్రకృతి అంత సహజమైంది. ఆ తర్వాత తల్లిని, పక్కన ఉన్న వాళ్లను గుర్తుపడుతూ నవ్వుతుంది. అప్పటి నుంచి నవ్వు సామాజికమైందని అంటారు.
*శత్రువునైనా ఆకట్టుకునేది చిరునవ్వేనన్న విషయాన్ని గమనించాలి. నవ్వుతో కొన్ని రకాల రోగాలు దూరమవుతాయంటారు ఆరోగ్య నిపుణులు. శరీరంలో రోగ నిరోధక శక్తిని మింగేసే కార్టిసోల్ పదార్థంపై చిరునవ్వు ప్రభావం చూపి దానిని అణిచివేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
*ఆధునిక జీవితంలో ఉరుకుల పరుగుల జీవితం గడపడం సాధారణమైంది. వేగంగా సాగకుంటే జీవితమే గడవని పరిస్థితి. విద్యార్థులకు చదువు ఒత్తిడి.. గృహిణికి వేళాపాళా లేకుండా ఇంటి పని.. ఇంటి యజమానికి ఉద్యోగ, వ్యాపార ఒత్తిడి.. ఇలా ప్రతి ఒక్కరూ తీరిక లేని జీవితం గడుపుతున్నారు. దీంతో ఆనందం కరవైంది. నవ్వు అనేది లేకుండా పోయింది. ఇంట్లోని కుటుంబ సభ్యులు కూడా పరస్పరం నవ్వుకోవడం అరుదుగా మారింది. పిల్లలకైతే పాఠశాలకు ఆలస్యమవుతే అసహనం, పెద్దలకు కార్యాలయానికి సమయానికి వెళ్లకపోతే కోపం, ఇంట్లో వంట కాకపోతే, అన్ని కుదరకపోతే ఇల్లాలికి చికాకు.. దాంతో ఉదయం లేచినప్పటి నుంచి అసహనంతో ప్రారంభమైన జీవితం నిద్రపోయేసరికి ఒత్తిడితోనే ముగుస్తోంది.
*బ్రిటన్లోని వోర్సెస్టర్ ప్రాంతానికి చెందిన కళాకారుడు హార్వేబాల్ ‘స్మైలీ’ ఫేస్ రూపకర్త. 1969లో స్టేట్ మ్యూచువల్ (ప్రస్తుత హ్యానోవర్) ఇన్సూరెన్స్ కంపెనీ కోసం పది నిమిషాల్లో స్మైలీ చిత్రాన్ని గీసిచ్చాడు. హార్వే 45 డాలర్లకు గీసిన ఆ బొమ్మకు కాపీరైట్స్ తీసుకోలేదు. దాన్ని చూసి అంతా నవ్వాలని, నవ్వు ఉచితంగా లభించాలని ఆయన భావించారు. అమెరికా తపాలా కార్యాలయం 1999లో స్టాంపును విడుదల చేసింది. 1994లో స్మైలీ ఫేస్ చిత్రసీమలో ప్రవేశించింది.
**చిరునవ్వుతో ఎంతో మేలు..
ఆత్మీయులుగాని, పరిచయం ఉన్నవారుగాని స్నేహితులు, బంధువులు ఎవరైనా మాటకన్నా ముందు మనస్సులో నుంచి వచ్చే భావనే ‘చిరునవ్వు’. నవ్వినట్లుగా పెదాల మధ్య కనిపించేదే చిరునవ్వు. మహాభారతాన్ని రాసిన తిక్కన 32 రకాల నవ్వులు ఉన్నట్లు పేర్కొనగా.. అందులో మొట్టమొదటిది చిరునవ్వే. ఈ రకం నవ్వును శాంతికి సంకేతంగా భావిస్తారు. కొద్దిపాటి స్నేహాలను అప్పుడే ఏర్పడిన పరిచయాలను గట్టిగా ధ్రువపరిచేదే ‘చిరునవ్వు’. నవ్వు విలువను తెలియని చాలా మంది ఎప్పుడూ రుసరుసలాడుతూ చిర్రుబుర్రు లాడుతూ జీవితాన్ని గడిపేస్తుంటారు. దీంతో వీరు ఎవరికీ దగ్గర కాలేరు. చాలా మందికి దూరమవుతారు.
***నవ్వే ఓ ఆయుధం
నిరాశ, నిస్పృహల నుంచి ముందుగా బయటపడాలంటే నవ్వే ఆయుధం. కొన్ని సందర్భాల్లో మనం చిందించే నవ్వు ఇతరుల బాధను మాయం చేస్తుంది. నగర, పట్టణ జీవనంలో ఒత్తిళ్లతో కూడిన జీవనానికి చిరునవ్వు ఒక టానిక్గా పని చేస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారులు.. ఇలా అందరికీ నవ్వు ద్వారా ఉపశమనం అయ్యే లాఫింగ్ థెరపీ అవసరమని నంద్యాలకు చెందిన మానసిక నిపుణుడు బాలాజీసింగ్ చెబుతున్నారు. ఎదుటి వారిని చిరునవ్వుతో పలకరిస్తే వెంటనే వారు మీకు ఆత్మీయులవుతారు. మీరు నవ్వుతో ఉంటే ఆ ప్రాంతానికి మీరు ప్రత్యేక ఆకర్షణగా ఉంటారనే విషయం మరువకండి. ద్వేషించే వారిని కూడా దగ్గరకు చేర్చే శక్తి దీనికి ఉంది. పలుకరించడమే కాక మనస్సు లోతుల్ని కూడా తడుతుంది. ఎదిగే క్రమంలో మానవ సంబంధాలను కలుపుతుంది. ఒత్తిళ్లను బయటకు పంపే గుణం ఇందులో మాత్రమే ఉంది. ఈ ప్రక్రియను ఇంటి నుంచే ప్రారంభించాలి. పిల్లలు తల్లిదండ్రులను నవ్వుతో పలకరించాలి. పెద్దలు కూడా పిల్లలను చిరునవ్వుతో నిద్ర లేపాలి. విసుగు, అలసట, కోపం, చికాకు అనేవి ఇంట్లో ఎవరూ ప్రదర్శించకపోతే ఆ ఇల్లు చిరునవ్వుల లోగిళ్లుగా మారుతుందనే విషయంలో అనుమానం లేదు. చిరునవ్వుతో బయటకు వెళ్తే ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.