దాయాది పాకిస్థాన్ మరోసారి బరి తెగించింది. పూంచ్ జిల్లాలోని సరిహద్దు రేఖ సమీపంలో పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీం (బీఏటీ) ఇద్దరు కశ్మీరీ కూలీలను హతమార్చినట్లు భారత ఆర్మీ అనుమానం వ్యక్తం చేస్తోంది. మృతుల్లో ఒకరి తల, మొండెం వేరుచేసినట్లు భారత ఆర్మీ అధికారులు ఇవాళ జమ్ములో వెల్లడించారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకున్నట్లు వారు వెల్లడించారు. భారత్, పాక్ దళాల మధ్య కాల్పులు సర్వసాధారణమైనప్పటికీ కశ్మీర్ కూలీలను పాక్ సైన్యం ఇలా శిరచ్ఛేదం చేయడం ఇదే తొలిసారి. మృతుడు అస్లాం (28) దేహం పూర్తిగా ఛిద్రమై ఉందని, సంఘటన స్థలిలో అతడి తల కనిపించలేదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఈ ఘటనపై ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్.ఎమ్. నరవణె మాట్లాడుతూ.. నిజమైన సైన్యాలు ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడవని, సైనిక నియమ నిబంధనల ప్రకారం నడచుకుంటాయని వ్యాఖ్యానించారు. అంతకు ముందు మరో ఆర్మీ అధికారి మాట్లాడుతూ.. పాక్‌సైన్యం మోర్టార్లతో దాడికి దిగిందని, ఈ ఘటనలో అస్లాం, హుస్సేన్ (23) ఇద్దరూ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలైనట్లు చెప్పారు. మృతులు గుల్పూర్ సెక్టార్లోని కస్సాలియన్ గ్రామానికి చెందిన వారని అన్నారు. అస్లాం తలను బ్యాట్ బృందమే తీసుకొని వెళ్లిపోయి ఉంటుందని భారత్ ఆర్మీ అనుమానిస్తోంది. కేసు విచారణ నిమిత్తం కూలీల మృతదేహాలను భారత్ ఆర్మీ స్థానిక పోలీసులకు అప్పగించింది. పాక్ దుందుడుకు ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపడతామని ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె దిల్లీలో వెల్లడించారు.
కూలీ తల నరికిన పాక్
Related tags :