రెండు జాంకాయలున్నాయి కదా నాన్నమ్మా…. ఒకటే తీసుకుని నన్నూ చెల్లినీ పంచుకుని తినమంటావేంటి …. రవి గాడి మాటలకు నవ్వుతూ… అందాకా ఒకటి పంచుకుని తినండిరా…. మళ్ళా కాసేపున్నాక రొండోది పంచుకుని తిందురుగాని అంది నాన్నమ్మ నవ్వుతూ …. అలాగే నాన్నమ్మా అంటూ చెల్లిని తీసుకుని వరండాలోకి వెళ్ళాడు రవిగాడు….పెద్దింటి నుంచి వచ్చిన కోడలికి ఇది నచ్చలేదు… ఎందుకత్తయ్యగారు ఉన్నాయికదా చెరొకటి ఇచ్చేస్తే సరిపోయే కదా అంది నవ్వుతూనే ఈసడింపుగా….అత్తగారు నవ్వేసి ఊరుకుంది….పండక్కి మా ఊరెళదామంటే ఈ పల్లెటూరికి తీసుకొచ్చి పడేశారు… ఇక్కడేమో నాకు బోర్ కొట్టి చచ్చిపోతున్నాను…. మీరేమో మీ చిన్నప్పటి స్నేహితుల్తోటి కబుర్లాడుకుని వస్తున్నారు…. వాళ్లలో ఒక్కడు కూడా చదువుకున్నోడు లేడు…. వాళ్ళతో తిరుగుతుంటే మీరు పెద్ద ఆఫీసర్ అన్న సంగతి కూడా మర్చిపోతున్నారు…. ఇక్కడేమో మాయదారి కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు…. మీ అమ్మ గారు సరేసరి ఒక్క జాంకాయిచ్చి పిల్లలిద్దర్నీ పంచుకుని తినమంటాది… నాకు నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు…. చుట్టుపక్కలవాళ్ళ పిల్లలందరూ వీళ్ళని వరసలు పెట్టి పిలిచి ఆడుతుంటే నాకు కంపరం వస్తోంది బాబూ… అంటూ ఆవిడ ఏకరువు పెడుతుంటే నవ్వుతూ వింటూ నిద్రపోతున్న మొగుణ్ణి చూసి ఖర్మ అనుకుని అటు తిరిగి పడుకుంది…..భోగి నాడు చుట్టుపక్కల పిల్లలంతా ఎక్కడెక్కడ్నుంచో తెచ్చిన చెట్ల దుంగలు,పాత కర్ర సామాను తెచ్చి భోగిమంట వేస్తుంటే రవిగాడు,వాడి చెల్లి ఎప్పుడు లేచిపోయారో… నాన్నమ్మ ఎప్పుడు తలంటిపోసి కొత్తబట్టలు కట్టి ముస్తాబు చేసిందో…. భోగిమంట దగ్గరకు వెళ్లి నించుంటే పిల్లలంతా వాళ్ళు తెచ్చుకున్న భోగిపిడకల దండలు వీళ్ళతో భోగి మంటల్లో వేయిస్తుంటే…. సిటీలో పెరుగుతున్న ఆ పిల్లల ఆనందానికి అంతులేదు….ఒరే రవీ…. నువ్వూ చెల్లీ వెళ్లి ఈ కొత్త బట్టలు మనింట్లో పని చేస్తున్న లక్ష్మి వాళ్ళింటికెళ్లి వాళ్ళ పిల్లలకు ఇచ్చి రండి … అంది నాన్నమ్మ…..రవిగాడు ఆ బట్టలు తీసుకుని చెల్లిని వెంటబెట్టుకుని వెళ్ళాక…. ఎందుకత్తయ్యా పనివాళ్ల ఇంటికి పిల్లల్ని పంపిస్తున్నారు… లక్ష్మి ఎలాగూ వస్తుందిగా…. దాని చేతిలో ఆ బట్టలేవో పెట్టేస్తే సరిపోతుందిగా అంది కోడలు… అత్త గారు నవ్వేసి ఊరుకుంది…. సంక్రాంతి నాడు ప్రసాదం తయారుజేసి పిల్లలిద్దరితోటి గుడిలో పంచిపెట్టించింది…..పండగ సెలవులన్నీ సరదాగా గడిచిపోయాయి ఒక్క కోడలికి తప్ప…..రవిగాడికి కొత్తగా ఏర్పడిన స్నేహితులు, వాళ్ళ నాన్న స్నేహితులు అందరూ కలసి నాన్నమ్మకట్టిన మూటలన్నీ మోసుకుని రైల్వే స్టేషన్ వరకూ వచ్చి దిగబెట్టారు….. రైలు కదిలేదాకా అక్కడే ఉండి వీడ్కోలు చెప్పి వెనుదిరిగారు….సంక్రాంతికి ఊరెళ్ళి వచ్చిన తర్వాత రవిగాడిలో చాలా మార్పు వచ్చిందండి…. ఇంతకుముందు ఎవరితోను మాట్లాడేవాడు కాడు… ఎప్పుడూ ముభావంగా ఉండి తన చదువేదో తన లోకమేదో అన్నట్టుండేవాడు…. ఇప్పుడందరితో కలివిడిగా ఉంటున్నాడు…. వాడికేదైనా పెడితే చెల్లికి తీసుకెళ్లి పెడుతున్నాడు…. నువ్వు తిన్నావా మమ్మీ అని నన్ను కూడా అడుగుతున్నాడు… అంది కన్నీళ్లు తుడుచుకుంటూ….. అతను చిరునవ్వు నవ్వాడు వాళ్ళమ్మను తలుచుకుంటూ.
సేకరణ: వెలిశెట్టి నారాయణరావు