* తెదేపా నేతలు ఆదివారం ఉదయం కేంద్ర మహిళా కమిషన్ బృందం సభ్యులను గుంటూరులోని ఆర్అండ్బీ అతిథి గృహంలో కలిశారు. రాజధాని ప్రాంతంలో మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై కమిషన్ సభ్యులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ… గత 26 రోజులుగా పోలీసులు మహిళలపై దాడులు చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని కమిషన్ సభ్యులకు వివరించినట్లు చెప్పారు. అమరావతి ఘటనలపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించకపోయినా.. దిల్లీ నుంచి కేంద్ర మహిళా కమిషన్ స్పందించి అమరావతికి రావడం శుభసూచకమన్నారు.
* ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ స్టాండ్ ఆ పార్టీ నాయకులు చెప్పుకోవచ్చని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ శ్రమ, శక్తిని హైదరాబాద్‌లో కేంద్రీకృతం చేసుకున్నామని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోవడంతో వేర్పాటువాద ఉద్యమాలు వచ్చాయన్నారు. ఫలితంగానే తెలంగాణ, హైదరాబాద్‌ను కోల్పోయామని.. అమరావతితో అదే పరిస్థితి కొనసాగితే ఎలా అని ప్రశ్నించారు. విశాఖలో తమ్మినేని మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానులతో వేర్పాటువాద ఉద్యమానికి అవకాశం ఉండదన్నారు.
* మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి నరసరావుపేట పర్యటనకు బయల్దేరిన తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయం నుంచి నరసరావుపేటకు ప్రారంభమైన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకుని నిలిపివేశారు. యువకుల బైక్ తాళాలను పోలీసులు తీసుకున్నారు. అనంతరం బైక్ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు ర్యాలీ చేస్తుంటే ఎలా అనుమతిస్తున్నారని.. తన వెంట వస్తున్న కార్యకర్తలను అడ్డుకోవాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.
* రాజధాని పరిధిలోని తుళ్లూరులో జాతీయ మహిళా కమిషన్ విచారణ కొనసాగుతోంది. రాజధాని ఉద్యమంలో మహిళలపై పోలీసుల దాడి ఘటనకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు. మహిళలపై లాఠీ ఛార్జి, దాడి ఘటనలకు సంబంధించి తుళ్లూరు తహసీల్దార్, డీఎస్పీతో ..కమిషన్ సభ్యులు కాంచన కట్టర్, ప్రవీణ్ సింగ్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తుళ్లూరు గ్రామానికి చేరుకునే ముందు మార్గ మధ్యంలో మహిళలపై దాడి జరిగిన ప్రదేశాన్ని వారు పరిశీలించారు.
* రాజధాని విషయంలో భాజపాలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని.. ఆ పార్టీకి విలువలు లేకుండా పోవడానికి అదే ఆధారమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రూ.లక్షా 9వేల కోట్లు ఇస్తే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ పేరుతో రాజధాని అమరావతిలోనే కొనసాగిస్తామని వ్యాఖ్యానించారు. విశాఖలో వెల్లంపల్లి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏదో అన్యాయం జరిగిపోతోందంటూ చంద్రబాబు, పవన్, కన్నా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలకు అలవాటుపడి పవన్ అలా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు.
* పాక్ వంటి దేశాల్లో హింసకు గురవుతున్న ప్రజలకు అండగా నిలవడం కోసమే పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) తీసుకొచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దీనివల్ల భారత్‌లోని ఏ ఒక్కరి పౌరసత్వం రద్దు కాదని మరోసారి హామీ ఇచ్చారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బంగాల్లో ఉన్న ఆయన హావ్‌డాలోని బేళూరు మఠంలో జరిగిన వివేకానంద జయంతి ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. సీఏఏకి వ్యతిరేకంగా బంగాల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ అక్కడి వారికి హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ చట్టంపై ప్రతిపక్షాలు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శించారు.
* ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై నోబెల్ పురస్కార విజేత అభిజిత్ బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యలోటు కట్టడిని మరింత బిగించడాన్ని తాను సమర్థించబోనని తెలిపారు. కేంద్రం విద్యపై నిధుల కేటాయింపును తగ్గించడం పెద్దగా ప్రభావం చూపదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ద్రవ్యలోటు లక్ష్యం ఇప్పటికే తప్పింది.. అదేం పెద్ద విషయం అని నేను అనుకోను. కానీ, ఇప్పటికైతే ద్రవ్యలోటును కట్టడి చేయటం కోసం కఠిన చర్యలు తీసుకోవడాన్ని నేను సమర్థించబోను’’ అని స్పష్టం చేశారు.
* ఈ సారి ఫిబ్రవరి 7 నుంచి 12వ తేదీ వరకూ గ్రేటర్ నోయిడాలో జరిగే 15 ఎడిషన్ ఆటో ఎక్స్పో భారీ సంఖ్యలో వాహనాలను విడుదలకు వేదిక కానుంది. దాదాపు 60 వరకు వాహనాలను వివిధ కంపెనీలు ఈ వేదికపై విడుదల చేయనున్నాయి. ఈ సారి నిర్వహించే కార్యక్రమంలో రిలయన్స్ జియో, ఫేస్‌బుక్‌లు కూడా భాగస్వాములు కానున్నాయి. ‘‘ఆటోఎక్స్‌పో 2020 తర్వాత డిమాండ్ భారీగా పెరుగుతుంది. ప్యాసింజర్ వాహనతయారీ దారుల్లో 85శాతం, కమర్షియల్ వాహన తయారీదారుల్లో 75శాతం మంది దీనిలో పాల్గొననున్నారు’’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మేనన్ తెలిపారు.
* ఈ సారి బడ్జెట్ రోజు కూడా స్టాక్‌మార్కెట్లు ట్రేడింగ్‌ను నిర్వహించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఫిబ్రవరి1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు శనివారం. కానీ ఈ సారి శనివారం కూడా స్టాక్‌మార్కెట్లు తెరిచే ఉంటాయని ఆంగ్లపత్రిక లైవ్‌మింట్ కథనంలో వెల్లడించింది. ఎన్ఎస్ఈ కూడా ఆ రోజు పనిచేయవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని ఇప్పటికే కీలకమైన పారిశ్రామిక వేత్తలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక వృద్ధిరేటు తగ్గుతుండటంతో ఈ అంశంపై తీవ్రంగా దృష్టిపెట్టారు.
* భారత దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్, ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు బెన్‌స్టోక్స్‌తో పోల్చుకోనని టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అన్నాడు. ‘‘జట్టు కోసం పోరాడటమే నా బాధ్యత. హార్దిక్ పాండ్య ఎలా బ్యాటింగ్ చేశాడు? గొప్ప ప్రదర్శన చేశాడా లేదా అని ఆలోచించను. నేను 10 పరుగులు చేసిన జట్టు విజయం సాధిస్తే ఎంతో ఆనందిస్తాను. అదే 30 పరుగులు చేసినా జట్టు ఓడితే ఎంతో బాధపడతాను. ఆల్‌రౌండర్స్ కపిల్‌దేవ్ సర్, బెన్‌స్టోక్స్‌తో నేను పోల్చుకోను. అత్యుత్తమంగా ఆడటానికే ప్రయత్నిస్తా. జట్టు విజయాలే నా లక్ష్యం’ అని వ్యాఖ్యానించాడు.
* అమరావతి ఆందోళనల్లో పోలీసుల దాడిలో గాయపడి విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీలక్ష్మిని ఆదివారం ఉదయం తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఉన్న తండ్రిని పోలీసులు తీసుకెళ్తున్నారని అడ్డుకోబోయిన శ్రీలక్ష్మిపై పోలీసులు దాడి చేయడం దారుణమన్నారు. ‘కిందపడిపోయిన మహిళను బూటు కాలుతో తొక్కడం హేయమైన చర్య. పోలీసులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. ప్రజా ఉద్యమాలను పోలీసుల దౌర్జన్యంతో ఆపలేరు’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
* రాష్ట్రం ప్రతిష్ఠపోతే పెట్టుబడులు ఎలా వస్తాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. కాకినాడలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుందని నిలదీశారు. ‘‘విశాఖను అభివృద్ధి చేస్తామని జగన్ చెబుతున్నారు. ప్రభుత్వ వైఖరి వల్లే విశాఖకు తీరని అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిధులు అరకొరగా ఇస్తోంది. అప్పులు ఇచ్చే వాళ్లు కూడా లేరు’’ అని యనమల అన్నారు.
* రైతులు ఆనందంగా ఉండాల్సిన చోట పోలీసు కవాతు నిర్వహిస్తారా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఒక్కో గ్రామానికి వెయ్యి మంది పోలీసులను దింపి ఉద్యమాన్ని అణచివేయాలని అనుకోవడం జగన్ అవివేకమన్నారు. గ్రామస్థులను ఇళ్లలో బందిస్తారా?అని నిలదీశారు. ఇంత ఘోరం మరొకటి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో యుద్ధ వాతావరణం తీసుకొచ్చినందుకు వైకాపా ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేశ్ హెచ్చరించారు.
* అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ‘అల..వైకుంఠపురములో’ సినిమాలోని ‘సామజవరగమన’ పాటను విడుదల చేసినప్పటి నుంచి రికార్డ్స్ క్రియేట్ చేస్తోన్న విషయం తెలిసిందే. మామూలుగా చెబితే విద్యార్థులు వినకపోవచ్చు అని ఓ ఉపాధ్యాయుడు అనుకున్నారేమో.. ‘సామజవరగమన’ పాట ట్యూన్లో ‘నీ కళ్లకు కావాలి కాస్త నీ భవిష్యత్తుపై కలలు.. సమయమంతా వృథా చేస్తే ఉండదురా ఫ్యూచరూ.. నీ మనసు గాలి ఊయ్యాలలూగుతూ ఉంటే చెడిపోతావ్.. నీ ధ్యాసను చదువులో పెడితే మంచోడివి అవుతావ్..’ అని పాటలా పాడి వినిపించారు.
* ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ వ్యవహారంపై ఉద్యోగుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతిలో ఆదివారం ఉదయం ఉద్యోగ సంఘం నేతలు మీడియా సమావేశం నిర్వహించి పృథ్వీరాజ్ ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడిన విషయాలకు సంబంధించిన ఆడియో టేపులను బహిర్గతం చేశారు. పృథ్వీ.. ఎస్వీబీసీ ఛాంబర్‌ను తప్పుడు పద్ధతులకు వాడుతున్నారని ఆరోపించారు. పృథ్వీరాజ్ రాసలీల వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. వెంటనే ఆయనని ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
* పౌరసత్వ సవరణ చట్టంతో దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై భారత మాజీ క్రికెటర్ గావస్కర్ స్పందించాడు. ప్రస్తుతం దేశం సంక్షోభంలో ఉందని, త్వరలో ఈ దశను అధిగమిస్తామని అన్నాడు. ‘‘ప్రస్తుతం మన దేశం సంక్షోభంలో ఉంది. తరగతి గదుల్లో ఉండాల్సిన కొందరు విద్యార్థులు రోడ్లపై కనిపిస్తున్నారు. వీరిలో కొందరు ఆస్పత్రిలో చేరాల్సి వస్తోంది. అయితే ఎక్కువ మంది చదువుపైనే దృష్టి పెట్టారు. మనం అందరం భారతీయులిగా కలిసి ఉన్నప్పుడే దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలం’’ అని చెప్పారు.
* టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తరహాలో అత్యుత్తమ ఫినిషర్ అవ్వాలనుకుంటున్నానని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అలెక్స్ క్యారీ అన్నాడు. ‘‘నా ఆటలో ఉన్న కొన్ని బలహీనతలను అధిగమించాల్సి ఉంది. మిడిల్ ఆర్డర్ లేదా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగి జట్టును విజయతీరాలకు చేర్చాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. ఈ విషయంలో ప్రపంచంలోనే ధోనీ అత్యుత్తమం. అతడి నుంచి వీలైనంత నేర్చుకోవాలి. టీమిండియా కోసం అతడు ఆఖరి వరకు పోరాడి జట్టును గెలిపించిన తరహాలోనే.. నేను నా దేశం కోసం పోరాడాలని భావిస్తున్నానన్నారు.
* కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ నిధులపై మరోసారి ఆదారపడే పరిస్థితి నెలకొంది. ఈ సారి ఆదాయాల అంచనాలు తప్పడంతో.. మరోసారి ఆర్బీఐ నుంచి మధ్యంతర డెవిడెండ్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కొన్ని నెలల క్రితం ఆర్బీఐ రూ.1.76లక్షల కోట్లను డివిడెండ్ రూపంలో చెల్లించింది. ఆర్బీఐ కరెన్సీ ట్రేడింగ్, బాండ్ల ట్రేడింగ్ నుంచి భారీగా ఆదాయం పొందుతుంది. దీనిలో తన కార్యాకలాపాల కోసం కొంత మొత్తం ఉంచుకొని మిగిలిన మొత్తం ప్రభుత్వానికి అందజేస్తుంది. గత ఏడాది ఈ రకంగా రూ.1.23లక్షల కోట్లను ఆర్జించింది.