Health

పరుగెత్తే పద్ధతి ఇది

Tips for running outdoors or on treadmill

బరువు తగ్గాలని నిర్ణయించుకున్న వెంటనే పరుగు మొదలుపెడతారు చాలామంది మహిళలు. కొన్నాళ్లు దీన్ని కొనసాగించి ఒక స్థాయికి వచ్చాక బరువు తగ్గడంలేదని ఆపేస్తారు. పరుగు అనేది బరువును కచ్చితంగా తగ్గిస్తుంది. కానీ, మన శరీర పరిస్థితిని అంచనా వేసుకొని పరుగులో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. దీంతోపాటు పరుగెత్తే సమయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే వేగంగా బరువు తగ్గి మంచి శరీరాకృతి సొంతమవుతుంది. ●

* మొత్తం 27 నిమిషాలు పరుగుకు కేటాయించాలి. తొలి పది నిమిషాలు శరీరం వార్మప్‌ అయ్యేలా ట్రెడ్‌మిల్‌పై లేదా మైదానంలో మెల్లగా పరుగెత్తాలి. లేదంటే కొంచెం వేగంగా బ్రిస్క్‌వాక్‌ లేదా సైక్లింగ్‌ చేయాలి.

* ఆ తర్వాత మీ అత్యధిక వేగంతో రెండు నిమిషాలు పరుగెత్తాలి. అంటే ఒక వ్యక్తి అత్యధిక వేగం గంటకు 8 కిలోమీటర్లు అనుకుంటే.. ఆ వేగంతో రెండు నిమిషాలు పరుగెత్తాలి.

* మనిషి శరీర పరిస్థితి.. సాధనను బట్టి వేగం ఉంటుంది. తర్వాత మరో నిమిషం పాటు వేగాన్ని సాధారణ స్థాయికి తగ్గించాలి. అప్పుడు శరీరం అలసట తీర్చుకొంటుంది. ఇలా వరుసగా మరో మూడుసార్లు చేయండి. అక్కడికి వార్మప్‌తో కలిపి మొత్తం 22 నిమిషాలు పూర్తవుతుంది.

* ఆ తర్వాత ఒక అయిదు నిమిషాలు మెల్లగా నడవండి. ఇలా చేస్తే కనీసం 300 కెలొరీలను శరీరం ఖర్చుచేస్తుంది.

జాగ్రత్తలు..

* ఎక్కువ బరువు ఉన్నవారు మెల్లగా పరుగెడుతున్నామని నిరుత్సాహపడొద్ధు వాస్తవానికి బరువు ఎక్కువ ఉన్నవారిలోనే కెలొరీలు అత్యధికంగా ఖర్చవుతాయి. వీరు బరువు తగ్గే కొద్దీ కెలొరీలు కరిగే వేగం కూడా తగ్గుతుంది. అప్పుడు పరుగులో వేగాన్ని పెంచుకోవాలి. అంటే బరువు తగ్గేకొద్దీ వేగాన్ని పెంచి శరీరంపై ఒత్తిడి పెంచుతున్నామన్నమాట. అప్పుడే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

* చుట్టుపక్కలవారితో పోటీపడుతూ ప్రమాదకరమైన వేగాన్ని ఎంచుకోవద్ధు మీ శరీరం అదుపులో ఉండి.. అత్యధిక శక్తిని వాడుకునేలా చూసుకోవాలి.

● * ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తేవారు హ్యాండిల్స్‌ను పట్టుకోకూడదు. వాటిని పట్టుకోవడం వల్ల శరీరంపై భారం పడదు. కేవలం అలసట తీర్చుకోవడానికి, బ్యాలెన్స్‌ చేసుకోవడానికి మాత్రమే పట్టుకోవాలి.

గమనిక: ఎటువంటి శారీరక సమస్యలు, అనారోగ్యాలు లేనివారు మాత్రమే వీటిని చేయాలి.