Fashion

స్త్రీ సున్నిత మనస్తత్త్వాన్ని అర్థం చేసుకుంటున్నారా?

Try To Understand And Embrace The Sensitive Minds Of Women Without Abuse

తల్లి, చెల్లి, ఆలి ఇలా అనేక బాధ్యతలను నిర్వహిస్తున్న స్త్రీలు.. వారి అనుకున్న జీవితాన్ని నిజంగా జీవిస్తున్నారా.. ఎలాంటి కష్టాలు లేకుండా జీవనగమ్యాన్ని చేరుతున్నారా.. అసలు సమాజంలో ఏం జరుగుతుందంటే..
*​పుట్టినప్పటి నుంచి..
పుట్టింది మొదలు.. అమ్మ, నాన్న మాటలు వినాలి. బయటికి వెళ్లాలంటే ఎవరైనా తోడు ఉండాలి. గట్టిగా నవ్వకూడదు.. ఎందుకంటే నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అని అంటారు కాబట్టి.. ఈడొచ్చిందంటే పెళ్లి కోసం పక్కవారింటి మొదలు ప్రతీ ఒక్కరూ ఆరాటమే.. ఈ జీవిత పరీక్షలు ఉండగానే.. ఆమె విద్య పరీక్షలు కూడా ఉంటాయి. అయినా వీటన్నింటిని పట్టించుకోకుండానే వాటిని అధిగమిస్తుంది. అయినా.. అవేం పట్టవుగా అందరికీ.. చదువు ఎందుకు పనికొస్తుంది. ఎవరో ఓ అయ్య చేతిలో పెడితే సరిపోతుందనే మాటలు… వీటిని పట్టించుకోని పెద్దవారి కొంతమందైతే.. మరికొంతమంది అవే వేదమంత్రాల్లా గోచరించి వివాహ కార్యక్రమాలు మొదలుపెడతారు.
*​వివాహం అనంతరం..
వివాహం జరిగాక ఇక కథ మొదలు.. పుట్టినింట్లో ఉండే ఆ కాస్తా కూడా ఉండదు.. అత్తింటి వారు కూర్చొమంటే కూర్చోవాలి.. లేవమంటే లేవాలి.. బాధనిపిస్తే భరించాలి.. సంతోష క్షణాలు తక్కువే.. అయితే, ఇలాంటి క్షణాల్లో మరొకరికి జన్మ ఇవ్వడం.. వారి ఆలనా పాలనా, అత్త, మామ, మరుదులు, ఆడపడుచులు, భర్త ఇలా మొత్తం అదే లోకం..
*​కనుమరుగవుతున్న జీవనం..
ఇలాంటి సమస్యలతో పోరాడి ఒంటరి జీవనాన్ని ఎంచుకున్న వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. అయితే, ఇలాంటి జీవనంలో కాసింత ప్రశాంతత దొరికినా.. వారిని కొన్ని మృగాళ్లాంటి జీవాలు వదలడం లేదు. దీంతో.. ఏం చేయాలో తెలియక సతమయ్యే మహిళలు వారి జీవనాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. కానీ, అలాంటి తొందరపాటు నిర్ణయాలు ఎంతమాత్రం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. మహిళలు ఇలాంటి సమస్యలతో సతమతమవుతుంటే.. వారికి కౌన్సెలింగ్ చాలా అవసరం అని చెబుతున్నారు.
*​మనుగడ ఎక్కడ..
మరి ఇన్నింటి నడుమ ఆమె మనుగడ ఎక్కడ ఉంది.. ఇవి కేవలం ఆమెకేంటి.. చక్కని భర్త, పిల్లలు అనుకునే ఆడవారి జీవితాలే.. ఆ ఆకృత్యాలను భరించలేక బయటికొచ్చిన వారు, వరకట్నపు మంటల్లో దగ్ధమయ్యే అబలలు చాలా మందే ఉన్నారు.. వారి జీవితాలు ఏంటి.. ఒక్కో క్షణం కొంతమంది మహిళలు.. ఇలాంటి జీవనం కొనసాగించే బదులు.. ఒక్క క్షణం మృత్యుఒడిని కౌగిలించుకుంటే బావుంటుందని ఆలోచించే వారి సంఖ్య ఎక్కువ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
*​స్వచ్చంధ సంస్థలు..
అవును.. చాలా మంది మహిళలు ఈ మధ్యకాలంలో మృత్యు ఒడికి చేరుకుంటున్నారని, ఇందులో దాదాపు వివాహ సమస్యలు కారణం అయితే, మరి కొన్ని ఇతరత్రా సమస్యలు అని చెబుతున్నారు. ఇలాంటి చెరశాల సమామనమైన జీవితం నుంచి ఆమెకి ఎప్పుడు స్వేచ్ఛ దొరుకుతుందోనని బిక్కు బిక్కు ఎదురుచూసేవారు ఎక్కువైపోయారు. మరి అలాంటి వారు ఇప్పటికైనా మేల్కొని తమ జీవన గమనం ఎటో నిర్ణయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలతో సతమతమయ్యేవారికి పరిష్కారం చూపేందుకు ఎన్నో స్వచ్చంధ సంస్థలు కూడా సిద్ధంగా ఉన్నాయి.