Fashion

నగలు సరిగ్గా ఇలా శుభ్రం చేసుకోవాలి

Here are some tips to clean your jewellery properly

ఆభరణాలను అలంకరించుకోవడంలో ఉన్నంత శ్రద్ధ వాటిని శుభ్రంగా ఉంచటంలో చాలామందికి ఉండదు. అందుకే ఆభరణాలు త్వరగా మెరుపు కోల్పోయినట్టుగా కనపడతాయి. బంగారు ఆభరణాలను శుభ్రపరచడానికి కొన్ని మేలైన చిట్కాలు ఉన్నాయి. ఆభరణాలను దాదాపు ఇంట్లోనే శుభ్రపరుచుకోవడం మంచిది. ఖర్చు కూడా తగ్గుతుంది. పైగా బయట శుభ్రపరచడానికి ఇచ్చినప్పుడు తలెత్తే మోసాలనూ అరికట్టవచ్చు. మరి ఇంట్లోనే మన ఆభరణాలను శుభ్రపరుచుకునే చిట్కాలేంటో ఓసారి చూద్దాం..
*వేటికవి విడిగా:
విభిన్న రకాల ఆభరణాలు ఉంటాయి. అందుకే వెండి, బంగారం, ప్లాటినం, పూసలు, రాళ్లు ఇలా ఆభరణాలను శుభ్రం చేసే ముందు వేటికవి విడిగా ఉంచాలి. లిక్విడ్‌ సోప్‌, డ్రాప్ట్స్‌ (మార్కెట్లో లభిస్తాయి). వీటిని ఆభరణాల మీద వేసి మృదువుగా రుద్ది, కడిగి, మెత్తని నూలు వస్త్రంతో తుడవాలి. ఇంకా దుమ్ము, జిడ్డు పోవడం లేదు అనుకుంటే క్లబ్‌ సోడాను ఉపయోగించాలి. బంగారు ఆభరణాల జిడ్డు వదలాలంటే 15 నిమిషాల పాటు సబ్బు నీటిలో ఉంచి, తర్వాత శుభ్రపరచాలి.
*మృదువైన టూత్‌ బ్రష్‌:
ఆభరణాల మురికిని తొలగించడానికి చాలామంది బ్రష్‌ను వాడుతుంటారు. అయితే మృదువైన బ్రష్‌ను మాత్రమే ఉపయోగించాలి. టూత్‌బ్రష్‌ కొనుగోలు చేసే ముందు లేబుల్‌పై ‘సాఫ్ట్‌ బ్రిస్టల్స్‌’ అని ఉన్నదాన్ని చూసి తీసుకోవాలి. బ్రష్‌తో ఆభరణాలను శుభ్రం చేయడానికి ముందు దానిని పది నిమిషాలు వేడి నీటిలో నానబెట్టి, ఆ తర్వాత ఉపయోగించాలి. దీనివల్ల బ్రష్‌ కుచ్చు మృదువుగా తయారవుతుంది. ఫలితంగా ఆభరణాలకు హాని కలగదు. మురికి కూడా వదులుతుంది. ఐబ్రో, హెయర్‌ డ్రై బ్రష్‌లను ఆభరణాల శుభ్రతకు ఉపయోగించకూడదు.
*అమ్మోనియా ద్రావణం:
అమ్మోనియా ద్రావణానికి ఆరు భాగాల నీళ్లు కలపాలి. ఆభరణాలను సబ్బు నీటితో శుభ్రపరిచిన తర్వాత వాటిని అమ్మోనియా నీటిలో ముంచి, తడి లేకుండా తుడవాలి. ఇలా చేస్తే ఆభరణాలకు మెరుపు వస్తుంది. అయితే ధరించిన ప్రతిసారీ అమ్మోనియాతో శుభ్రపరచకూడదు. ఒక్కోసారి అమ్మోనియా కారణంగా ఆభరణం రంగు మారే అవకాశం ఉంటుంది.
*వేడి నీరు:
ఆభరణాన్ని బ్రష్‌తో రుద్దుతున్నప్పుడు గోరువెచ్చని నీటిని పోస్తూ రబ్‌ చేస్తూ ఉంటే మురికి వదులుతుంది. ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం ఉండదు. అయితే, ఆభరణాలను అన్నింటినీ కాకుండా విడివిడిగా శుభ్రపరచాలి.
రత్నాలను నీటిలో ఉంచొద్దు: రత్నాలు పొదిగి ఉండే ఆభరణాలను ఎక్కువసేపు నీళ్లలో ఉంచకూడదు. సబ్బు నీటిలో ముంచి, వెంటనే తీయాలి. గోరువెచ్చని నీటిని పోస్తూ మృదువుగా రుద్దాలి. తర్వాత మెత్తని వస్త్రంతో ఆభరణం వెనుక, ముందు తడి లేకుండా తుడిచి, భద్రపరచాలి.
*టూత్‌పేస్ట్‌ ఉపయోగం:
టూత్‌బ్రష్‌కి కొద్దిగా పేస్ట్‌ అద్ది, దాంతో బంగారు ఆభరణాలను శుభ్రపరచాలి. గోరువెచ్చని నీళ్లుపోస్తూ రుద్దుతూ కడిగితే, చక్కగా శుభ్రపడతాయి.
*మరిగితే మెరుపు:
మైనం, గ్రీజ్‌ వంటివి ఆభరణాలకు అంటితే త్వరగా పోవు. ఇలాంటప్పుడు మరుగుతున్న నీటిలో ఆభరణాలను వేసి, తర్వాత సబ్బు నీటితో శుభ్రపరచాలి.