DailyDose

చంద్రబాబుపై రాయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు-రాజకీయ

Rayapati's Interesting Comments On Chandrababu-Telugu Political News

* తెదేపా నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో విభేదించి తెదేపా అధినేత చంద్రబాబు తప్పు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. మళ్లీ తెదేపా, భాజపా, జనసేన కలుస్తాయని చెప్పారు. రాజధాని పరిధిలోని మందడం, వెలగపూడి గ్రామాల్లో ఆందోళన చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. రాజధాని ప్రజలెవరూ అధైర్యపడొద్దని చెప్పారు. అనంతరం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కావాలంటే పులివెందులలో రాజధాని పెట్టుకోవాలని.. అంతేకానీ మూడు రాజధానులు తగదని సీఎం జగన్‌కు రాయపాటి హితవు పలికారు. రైతులు పోరాటం ఆపొద్దని.. శృతిమించుతున్న పోలీసులపై తిరగబడాలని ఆయన వ్యాఖ్యానించారు.
* జనసేన, భాజపా కీలక నిర్ణయం!
ఏపీలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కలిసి పనిచేయాలని జనసేన, భాజపా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక నుంచి జరిగే కార్యక్రమాలన్నీ ఉమ్మడిగా చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించినట్లు సమాచారం. దిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్‌.. భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈ మధ్యాహ్నం సమావేశమైన విషయం తెలిసిందే. అమరావతిలో జరుగుతున్న పరిణామాలతో పాటు ఆదివారం కాకినాడలో జనసేన కార్యకర్తలపై జరిగిన దాడి అంశాలను నడ్డాకు పవన్‌ వివరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ అమరావతిలో ఏం జరుగుతుందో తనకూ తెలుసని.. ఏపీ వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నానని పవన్‌తో చెప్పినట్లు సమాచారం. ఈ సమావేశంలోనే రెండు పార్టీలు కలిసి పనిచేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమరావతిపై త్వరలోనే ఇరు పార్టీలు పూర్తిస్థాయి ప్రకటన విడుదల చేసే అవకాశముంది.
* వైకాపా ఎంపీ తడబాటు వ్యాఖ్యలు!
మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ర్యాలీలో పాల్గొన్న తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ తడబడి సొంత పార్టీపైనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైకాపాలో చేరేందుకు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘‘ గేట్లు తెరిస్తే వైకాపాలో ఎవరూ మిగలరు’’ అంటూ వ్యాఖ్యానించారు. దుర్గాప్రసాద్‌ వ్యాఖ్యలతో అక్కడున్న వైకాపా నాయకులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే పక్కనే ఉన్న నేతలు ఆ వ్యాఖ్యలను సరిచేయడంతో తమాయించుకున్న ఎంపీ.. తిరిగి వైకాపాకు అనుకూలంగా మాట్లాడారు.
* అలా జరిగితే రాజకీయాలే వదిలేస్తా:చంద్రబాబు
రాష్ట్రానికి ఒకటే రాజధాని.. అది అమరావతే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా ప్రభుత్వం రాజధానిగా అమరావతిని నిర్ణయించినపుడు ప్రజలంతా ఒప్పుకున్నారని చెప్పారు. అమరావతి పరిరక్షణ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా పెనుకొండలో చంద్రబాబు జోలె పట్టి విరాళాలు సేకరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. అనంతపురం జిల్లాకు కియా మోటార్స్‌ తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. ఏపీకి అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి బాధపడ్డారని.. మూడు రాజధానులు తమకే లాభమంటూ తెలంగాణకు చెందిన ఓ మంత్రి వ్యాఖ్యానించారని చంద్రబాబు గుర్తు చేశారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్‌ఇస్తామని చెప్పింది తానేనన్నారు. ఇప్పుడు హైకోర్టును కూడా 3 ముక్కలు చేస్తామని చెబుతున్నారని వైకాపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు. తాను కష్టపడేది భావితరాల కోసమేనని ఆయన చెప్పారు
* కేసీఆర్ కాళ్లు మెుక్కిన విజయసాయిరెడ్డి
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ప్రగతిభవన్‌లో కొనసాగుతోంది. ప్రగతిభవన్‌కు వచ్చిన జగన్‌కు కేసీఆర్, కేటీఆర్ ఎదురెళ్లి స్వాగతం పలికారు. సరిగ్గా ఇద్దరు సీఎంలు భోజన సమయంలో కలిశారు. దీంతో కేసీఆర్‌తో కలిసి జగన్ భోజనం చేశారు. అయితే ప్రగతిభవన్‌లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. జగన్‌తో పాటుగా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ప్రగతిభవన్‌కు వచ్చారు. జగన్‌తో మాట్లాడుతున్న సమయంలో విజయసాయిని గమనించిన కేసీఆర్, ఆయన్ను పలకరించేందుకు ఆగారు. ఇది గమనించిన విజయసాయి మర్యాదపూర్వకంగా కేసీఆర్‌కు పాదాభివందనం చేసేందుకు ముందుకు వంగారు. వెంటనే విజయసాయిని ఆపేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. ఈ లోపే సగం నడుమువంచిన విజయసాయి, కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు.
* పెనుకొండలో జోలెపట్టిన చంద్రబాబు
అమరావతి పరిరక్షణ యాత్రలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. కొడికొండ చెక్‌పోస్టు, పెనుకొండలో పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చంద్రబాబు జోలె పట్టి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఐకాస సహా ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. పెద్ద ఎత్తున తెదేపా నేతలు, కార్యకర్తలు పెనుకొండ చేరుకుని చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. పెనుకొండలోని అంబేడ్కర్‌కూడలిలో నిర్వహించనున్న బహిరంగ సభలో చంద్రబాబుతో పాటు ఐకాస నేతలు ప్రసంగించనున్నారు.
* పవర్‌ అంతా ఏ-1, ఏ-2 దగ్గర ఉంది: అనిత
హైపవర్‌ కమిటీకి పవర్‌ లేదని, పవర్‌ అంతా ఏ-1, ఏ-2 దగ్గర ఉందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అనిత అన్నారు. సోమవారం ఆమె మీడియతో మాట్లాడుతూ కమిటీకి పవరే ఉంటే ఒకే భేటీలో నిర్ణయం తీసుకునేదని విమర్శించారు. మహిళలపై దాడులు జరుగుతుంటే.. స్పందించాల్సిన డీజీపీ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కులాలు తెలుసుకొని మరీ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో విజయసాయి బంధువులు సెటిల్‌మెంట్లు చేస్తున్నారని, ఆస్తులు కాపాడుకోవడం కోసమే విశాఖలో రాజధాని అంటున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి విశాఖకు సీఎం అని అనుకుంటున్నారని అనిత ఎద్దేవా చేశారు.
* నా 20 కోట్లు నాకివ్వండి: సుప్రీంలో కార్తీ చిదంబరం పిటిషన్
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం గతంలో తాను సుప్రీం కోర్టులో డిపాజిట్ చేసిన రూ.20 కోట్లను తిరిగి ఇవ్వాలంటూ సోమవారం పిటిషన్ వేశారు. తన విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి ఇచ్చేందుకు షరతుల్లో భాగంగా కట్టిన ఆ సొమ్మును రిటర్న్ చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం.. దీనిపై స్పందన చెప్పాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి నోటీసు పంపింది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
*జగన్ విషయంలో కూడా అదే జరగనుంది: జేడీ లక్ష్మీనారాయణ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ త్వరలోనే జైలుపాలు కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. రాజకీయ వర్గాలు, విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని దాదాపుగా వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ అక్రమాస్తుల కేసులో అసలు ఏం జరగనుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది. దీనికి స్పందించిన ఆయన ఆసక్తికర విషయాలు తెలిపారు.
*సీఏఏపై విపక్షాల భేటీ: దీదీ, మాయావతి దూరం
పౌరసత్వ చట్టం, ఎన్నార్సీపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలు నేడు భేటీ కానున్నాయి. అయితే ఈ భేటీకి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు హాజరుకావట్లేదు. ప్రతిపక్షాల ఐక్యత చాటే ఉద్దేశంతో పిలుపునిచ్చిన ఈ సమావేశానికి కీలక నేతలు దూరంగా ఉండటం గమనార్హం
*వైకాపా కార్యకర్తలకు హెచ్చరిక-బస్తీ మే సవాల్: జేసీ
రాజధాని పరిరక్షణ యాత్రలో భాగంగా చంద్రబాబు అనంతపురం పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాలసముద్రం వద్ద జోలె పట్టి చంద్రబాబు విరాళాలు సేకరిస్తుండగా.. వైకాపా కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌కు అడ్డుపడ్డారు. దీంతో ఆ పార్టీ సీనియర్‌ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి బస్సు దిగి ‘బస్తీ మే సవాల్‌’ అంటూ వారిని హెచ్చరించారు. పోలీసులు కలగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. కొడికొండ చెక్‌పోస్టు నుంచి ప్రారంభమైన చంద్రబాబు ర్యాలీ మరికాసేపట్లో పెనుకొండకు చేరుకోనుంది. అక్కడ ఏర్పాటు చేసిన రోడ్‌షోలో పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం అనంతపురంలో పండ్లు, టీ విక్రయించి చంద్రబాబు నిధులు సేకరించనున్నారు.
*ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అరెస్టు
రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ర్యాలీ చేపట్టిన వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వరకు రామకృష్ణారెడ్డి ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. కానీ, పాదయాత్ర చేసేందుకు రామకృష్ణ భీష్మించడంతో రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి పోలీసు వాహనంలో మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
*17న మరోసారి హైపవర్‌ కమిటీ భేటీ
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ విజయవాడలోని ఆర్టీసీ కాన్ఫరెన్స్‌ హాలులో మూడోసారి సమావేశమైంది. భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఈ నెల 17న మరోసారి సమావేశమవుతామని తెలిపారు. రైతులు చెప్పదలచుకున్న అంశాలు రాతపూర్వకంగా ఇవ్వాలని కోరారు. సీఆర్‌డీఏ కమిషనర్‌కు రైతులు నేరుగా లేదా ఆన్‌లైన్‌లో ఇవ్వొచ్చని సూచించారు. ప్రభుత్వానికి నేరుగా సలహాలు, సూచనలు చెప్పొచ్చన్నారు.
*ఏ కమిటీ వేసినా జగన్‌ ముందే లీక్‌ చేస్తారు: గల్లా జయదేవ్
అమరావతి ఉద్యమం మరో స్వాతంత్ర్య సంగ్రామంలా భావించాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. రాజధాని కోసం ఏ కమిటీ వేసినా జగన్‌ ముందే లీక్‌ చేస్తారన్నారు. మూడు రాజధానులు కొత్త ఐడియా కాదని.. ఫెయిల్‌ అండ్‌ ఔట్‌డేటెడ్‌ ఐడియా అని పేర్కొన్నారు.మూడు రాజధానుల వల్ల అధిక భారం పడుతుందని తెలిసినా.. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి వాళ్ల పనులు చేసుకుంటున్నారన్నారు. రాజధాని కోసం ప్రజలు స్వచ్ఛంధంగా పోరాటానికి ముందుకు రావాలని గల్లా జయదేవ్ విమర్శించారు.
*జోళిపట్టి విరాళాలు సేకరించిన చంద్రబాబు
రాజధాని అమరావతి మార్పును నిరసిస్తూ టీడీపీ ఆందోళనలను ఉధృతం చేస్తోంది. ఈ నేపథ్యంలో నేడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. కొడికొండ చెక్ పోస్టు నుంచి చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రహదారులపై జోళి పట్టి అమరావతి కోసం చంద్రబాబు విరాళాలు సేకరించారు.
*ఏ కమిటీ వేసినా జగన్‌ ముందే లీక్‌ చేస్తారు: గల్లా జయదేవ్
అమరావతి ఉద్యమం మరో స్వాతంత్ర్య సంగ్రామంలా భావించాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. రాజధాని కోసం ఏ కమిటీ వేసినా జగన్‌ ముందే లీక్‌ చేస్తారన్నారు. మూడు రాజధానులు కొత్త ఐడియా కాదని.. ఫెయిల్‌ అండ్‌ ఔట్‌డేటెడ్‌ ఐడియా అని పేర్కొన్నారు.మూడు రాజధానుల వల్ల అధిక భారం పడుతుందని తెలిసినా.. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి వాళ్ల పనులు చేసుకుంటున్నారన్నారు. రాజధాని కోసం ప్రజలు స్వచ్ఛంధంగా పోరాటానికి ముందుకు రావాలని గల్లా జయదేవ్ విమర్శించారు.
*మున్సిపాలిటీల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?మంత్రి కేటీఆర్కు ఎంపీ రేవంత్రెడ్డి సవాల్
ఆరేళ్లలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధి, నిధుల కేటాయింపుపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. హైదరాబాద్లో జూబ్లీహిల్స్లోని తన నియోజకవర్గ కార్యాలయంలో
మున్సిపాలిటీల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెరాసను గెలిపిస్తే ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చెప్పారని, అందుకే ఈ ఎన్నికలు తనకు పరీక్ష అని కేటీఆర్ ప్రకటించారన్నారు. వరంగల్కు రూ. 300 కోట్లు, నిజామాబాద్, రామగుండం, కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్లకు రూ. వంద కోట్ల చొప్పున నిధులు ఇచ్చామని కేటీఆర్ చెబుతున్నారని.. ఆయా కార్పొరేషన్లలో నిధుల లేమి కారణంగా ఏ పనీ ముందుకు సాగలేదన్నారు.
*దిల్లీ నుంచి నేరుగా కాకినాడ వస్తా: పవన్
జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్లదాడి దురదృష్టకరమని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తమ పార్టీ వారిని అన్యాయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే..దిల్లీ పర్యటన నుంచి నేరుగా కాకినాడకు వచ్చి వారికి అండగా నిలుస్తానని చెప్పారు. రాళ్ళ దాడిలో గాయపడిన జన సైనికులు, నాయకులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి జనసైనికుడు వారికి ధైర్యాన్నిచ్చి బాసటగా నిలవాలన్నారు. వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి అసభ్యకర వ్యాఖ్యలను అందరూ తప్పుబడుతున్నారన్నారు. రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించిన ఆ నేతపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.
*ఈ ఉద్యమం ఏ ఒక్కరిదో కాదు..: చంద్రబాబు
ఈ రాజధాని అమరావతి కోసం ఎందరో సొంతపనులు మానుకుని పోరాడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఐకాసకు కూలీలు కూడా విరాళం ఇచ్చారని చెప్పారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాచైతన్య యాత్రలో చంద్రబాబు సహా ఐకాస నేతలు జోలె పట్టి విరాళాలు సేకరించారు.
*తెరాస రెండు జట్లుగా విడిపోయింది: రేవంత్
పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రేవంత్రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మున్సిపల్ ఎన్నికలు కేటీఆర్ పనితనానికి పరీక్ష అని చెబుతున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి కృష్ణుడిగా ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఆ హామీలేవీ నేటికీ నెరవేర్చలేదు. ఇప్పుడు రెండో కృష్ణుడు కేటీఆర్ నా పనితనానికి నిదర్శనం అంటున్నారు. కేటీఆర్ పనితీరు గురించి గతంలోనే సిరిసిల్ల మున్సిపల్ ఛైర్మన్ చెప్పారు. 3శాతం కమీషన్ తీసుకోవాలని స్వయానా ఆ మున్సిపల్ ఛైర్మనే చెప్పారు.
*తెరాస ఎంపీలు పాక్ ముస్లింల కోసం పాటుపడుతున్నారా?: లక్ష్మణ్
పౌరసత్వ సవరణ చట్టం దేశ పౌరులకు వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ చెబుతున్నా, చట్టంలో ముస్ల్లిం అన్న పదం లేదంటూ తెరాస ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేయడం చూస్తుంటే వారు పాకిస్థాన్ ముస్ల్లింల కోసం పాటుపడుతున్నారా? అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్ లాలాపేటలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌరసత్వ సవరణ చట్టం అవగాహన ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లాలాపేట లేబర్ అడ్డా నుంచి ఘడి(ప్రభుత్వ) పాఠశాల వరకు ర్యాలీలో స్థానికులకు చట్టం గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ చట్టాన్ని వక్రీకరించి, రాజకీయ దురుద్దేశాలతో కాంగ్రెస్, తెరాస, మజ్లిస్లు మతం రంగును పులుముతున్నాయని ఆరోపించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్లలో వివక్షకు గురైన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు మన దేశానికి ఆశ్రయం కోసం వస్తే వారికి పౌరసత్వం ఇవ్వాలని గతంలో ఉన్న చట్టాన్ని కేంద్రం సవరించి సులభతరం చేసిందన్నారు. ఒవైసీ అడుగుజాడల్లో కాంగ్రెస్, తెరాసలు నడుస్తున్నాయని ఆరోపించారు. చట్టం వాస్తవాలను ప్రజలకు వివరించడానికి రాష్ట్రవ్యాప్తంగా భాజపా ఇంటింటికీ వెెళుతుందన్నారు. లాలాపేటలోని వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
*తెదేపా తరఫున 600 మందికి బీ ఫారాలు
మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 600 మంది అభ్యర్థులు తెదేపా తరఫున బరిలోకి దిగారని, వారందరికీ బీ ఫారాలను అందజేశామని పార్టీ అధినేత చంద్రబాబుకు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నివేదించారు. ఆదివారం హైదరాబాద్లోని నివాసంలో చంద్రబాబును రమణ ఆధ్వర్యంలో పలువురు రాష్ట్ర నేతలు కలిశారు. పురపాలక ఎన్నికల్లో పార్టీ వ్యూహం గురించి ఈ సందర్భంగా వివరించారు. గెలుపు కోసం గట్టిగా పోరాడాలని తెదేపా అధినేత వారికి సూచించారు.
*విజయమ్మ, షర్మిల స్పందించాలి: జనసేన
రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా నిలుస్తున్న మహిళలపై జరుగుతున్న దాడులపై వైఎస్.విజయమ్మ, షర్మిల స్పందించాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట మహేశ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఆదివారం అజిత్సింగ్నగర్లోని పైపులరోడ్డు కూడలిలోని గాంధీ విగ్రహం ఎదుట ఆయన నిరసన తెలిపారు. వెంకట మహేష్ మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వ పాలనను చూస్తుంటే భారత్లో ఉన్నామా? లేకపోతే పాకిస్థాన్లో ఉన్నామా? అనే సందేహం కలుగుతోందన్నారు.
*యోగి సర్కార్ మరో సంచలనం
యూపీలోని యోగి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శాంతిభద్రతలను మరింత పటిష్ఠం చేయడానికి పోలీస్ కమిషనర్ వ్యవస్థ తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. శనివారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకుంది. లక్నో, గౌతమ్ బుద్ధ నగర్‌(నోయిడా)లకు పోలీస్ కమిషనర్‌లను నియమిస్తున్నట్టు సోమవారం జరిగిన మీడియా సమావేశంలో సీఎం యోగి చెప్పారు. అంతేగాక రాజధాని లక్నోలో పోలీస్ స్టేషన్ల సంఖ్యను కూడా పెంచతున్నట్టు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఈ నేపథ్యంలో లక్నోకి ఎస్ఎన్ సబత్ తొలి పోలీస్ కమిషనర్‌గా నియమితులు కానున్నారు. అదేవిధంగా గౌతమ్ బుద్ధ నగర్‌ సీపీ రేసులో అలోక్ కుమార్, ప్రశాంత్ కుమార్‌ ఉన్నారు.
*పాలన చేతకాకే 3 రాజధానులు: యనమల
రాజ్యాంగంపై, పాలనపై సరైన అవగాహన లేకే సీఎం జగన్మోహన్రెడ్డి 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని తెదేపా సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. సీఎం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడంవల్ల రూ.1.50లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రం నుంచి తరలిపోయాయని ఆరోపించారు. విశాఖపై అంత ప్రేముంటే పోలవరం ప్రాజెక్టును ఎందుకు ఆపారని ప్రశ్నించారు.
*రాయలసీమ ఉద్యమం వచ్చే అవకాశం: జేసీ
అన్ని ప్రాంతాలకూ అనుకూలంగా ఉన్న అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని, మారిస్తే కష్టమవుతుందని.. భవిష్యత్తులో గ్రేటర్ రాయలసీమ ఉద్యమం వచ్చే అవకాశం ఉందని మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. పాలకులు రెండు కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆ రెండు సామాజిక వర్గాల జనాభా 50 లక్షలు మించి ఉండదేమోనని.. మిగతా 4 కోట్ల మంది గురించి ఆలోచించాలని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి తనకు పడటం లేదని, అయినా తనను రాజకీయంగా ఏమీ చేయలేరన్నారు. ఆర్థికంగా రోడ్డున నిలబెట్టే పని చేయవచ్చన్నారు. గ్రేటర్ రాయలసీమ వస్తే కడప రాజధాని కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
*మేం విడిపోవడమే వైకాపా బలం
గత ఎన్నికల్లో తెదేపా, భాజపాలతో తాము విడిపోవడంవల్లే వైకాపా బలపడిందని, ఎన్నికల్లో ఆ పార్టీ లాభపడిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రజలకు మంచి పాలన అందించాలనే 2014 ఎన్నికల్లో తెదేపా, భాజపాలకు మద్దతిచ్చామని, 2019 ఎన్నికల్లో కొన్ని కారణాలతో తెదేపాను వ్యతిరేకించామని చెప్పారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి పవన్ మాట్లాడారు.
*కేసుల్లో ఇరికిస్తే..బాలకృష్ణ సైతం వైకాపాలోకే
ఉపముఖ్యమంత్రి ‘ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పిలిస్తే ప్రతిపక్ష తెదేపా ఎమ్మెల్యేలు పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మిగిలేది చంద్రబాబు నాయుడు, నారా లోకేశే. బాలకృష్ణను కూడా కేసుల్లో ఇరికిస్తే ఆయనా పార్టీలోకి వచ్చేస్తారు…’ అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. తిరుపతిలో శనివారం ఆయన మాట్లాడారు. చంద్రబాబు అమరావతి కోసం పోరాటం చేస్తున్నారే తప్ప.. రాయలసీమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఆయన తప్పులను ఎత్తి చూపని మీడియా.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంగ్ల మాధ్యమంపై వార్తలు ఇవ్వడం సరికాదన్నారు. ఎంపీ దుర్గాప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.
*మహిళలే లక్ష్యంగా దాడులు: లోకేశ్
రాజధాని అమరావతి కోసం శాంతియుతంగా పోరాడుతున్న మహిళలనే లక్ష్యంగా చేసుకుని పోలీసులు దాడులు చేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. మందడంలో శనివారం రైతులపై పోలీసు దాడిలో గాయపడి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యర్రపనేని శ్రీలక్ష్మి అనే మహిళను లోకేశ్ పరామర్శించారు. రాజధాని కొనసాగింపునకు మహిళలు, చిన్నారులు ప్రైవేటు స్థలంలో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు లాఠీలతో కొట్టి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ఈ దాడులను మహిళే అయిన రాష్ట్ర హోం మంత్రి, మహిళా ఎమ్మెల్యేలు చూస్తూ ఊరుకుంటున్నారని విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ రెండు రోజుల కిందట మందడం రైతు శ్రీలక్ష్మి తన దృష్టికి తెచ్చారని, అందుకే ఆమెపై శనివారం దాడి చేశారని తెలిపారు.
*ముఖ్యమంత్రి నిర్ణయానికి మద్దతు-జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్
ప్రాంతీయ విభేదాలు తలెత్తకుండా ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని, ఈ నిర్ణయానికి తాను మద్దతిస్తున్నానని రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పేర్కొన్నారు. హైదరాబాద్ విషయంలో ఒకసారి ఇలాగే తప్పు జరిగి రాష్ట్రం విడిపోయిందని, మరోసారి అలా కాకూడదనే ఉద్దేశంతోనే మద్దతు పలుకుతున్నానని తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలో శనివారం మంత్రి కొడాలి నానితోకలిసి విలేకరులతో మాట్లాడారు.
*పౌరయుద్ధానికి తెరతీసిన పాలకులు-వర్ల రామయ్య విమర్శ
అమరావతి ఉద్యమానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కృత్రిమ ఉద్యమంతో పాలకులు పౌరయుద్ధానికి తెరతీశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్లరామయ్య మండిపడ్డారు. శనివారమిక్కడ ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘చరిత్రలో జరిగిన ఏ ఉద్యమానికీ ప్రభుత్వాలు వ్యతిరేక ఉద్యమాలు చేయలేదు. ఆ ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది. వైకాపా నాయకులు కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అసభ్య పదజాలంతో ప్రతిపక్ష నేతను దూషించడంపై సమాధానం చెప్పాలి. డీజీపీ చెప్పిన భావ ప్రకటనా స్వేచ్ఛ రాజధాని ప్రజలకు లేదా? వారిపట్ల పోలీసులు ఎందుకంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు? స్పెషల్బ్రాంచ్ కానిస్టేబుళ్లమని చెబుతూ.. రాజధాని ప్రాంతంలో ఫొటోలు, వీడియోలు తీస్తున్న వ్యక్తులెవరో చెప్పాలి. పోలీసులు చాలక పులివెందుల నుంచి ప్రత్యేకంగా ఎవరినైనా తెప్పించారా’ అని ప్రశ్నించారు.
*బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్గా మల్లాది విష్ణు
ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్గా విజయవాడ మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
*మోదీ, షాలకు పౌరసత్వమంటే తెలుసా?-సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా
పౌరసత్వం అంటే ఏమిటో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాలకు అర్థం తెలుసా? అని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశ్నించారు. ‘‘రాజ్యాంగ పీఠిక ప్రారంభంలోనే.. మేమంతా భారతీయులం అని ఉంటుంది. అంతేగానీ మేము హిందువులం, క్రైస్తవులం, ముస్లింలు, బుద్ధులు, జైనులని ఉండదు’’ అని తెలిపారు. సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం), ఎన్ఆర్సీ (జాతీయ పౌర రిజిస్టర్), ఎన్పీఆర్ (జాతీయ జనాభా రిజిస్టర్)కు వ్యతిరేకంగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.