గోపీచంద్ అకాడమీని వీడాలన్న నిర్ణయం సైనా నెహ్వాల్ స్వయంగా తీసుకుందని ప్రకాశ్ పదుకొణె బ్యాడ్మింటన్ అకాడమీ (పీపీబీఏ) తెలిపింది. ఆమె నిర్ణయంలో తమ జోక్యమేమీ లేదని స్పష్టం చేసింది. తన అకాడమీని వీడేందుకు ప్రకాశ్, విమల్, విరెన్ రస్కిర్హాయే సైనాను ప్రోత్సహించారని గోపీచంద్ అన్న సంగతి తెలిసిందే. త్వరలో విడుదల కానున్న తన బయోగ్రఫీ ‘డ్రీమ్స్ ఆఫ్ ఏ బిలియన్: ఇండియా అండ్ ద ఒలింపిక్ గేమ్స్’ పుస్తకంలో ‘బిట్టర్ రైవల్‌రీ’ అనే అధ్యాయంలో గోపీచంద్ దీని గురించి వెల్లడించారు. గోపీ వ్యాఖ్యలను పదుకొణె అకాడమీ తోసిపుచ్చింది. ‘బెంగళూరులో పీపీబీఏ కేంద్రంలో శిక్షణ తీసుకోవాలన్న సైనా నిర్ణయంలో మా పాత్రేమీ లేదు. ఫామ్ కోల్పోయి కష్టాల్లో పడ్డ సైనాకు విమల్ కుమార్ సాయం చేశారు’ అని తెలిపింది. ప్రకాశ్ సర్ తన గురించి ఆమెకు సానుకూలంగా చెప్పలేదన్న వ్యాఖ్యలపైనా వివరణ ఇచ్చింది. ‘ఆటగాడిగా కోచ్‌గా భారత బ్యాడ్మింటన్‌కు ఎంతో సేవ చేసిన గోపీచంద్‌పై పీపీబీఏకు గౌరవం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో అతడు సాధించిన విజయాలకు మేం గర్విస్తున్నాం. అతడితో ఎప్పటికీ సత్సంబంధాలనే కొనసాగించాం. మా అకాడమీ నుంచి ఎంతో మంది షట్లర్లు ఎదిగారు. వెళ్లిపోయారు. వారి ఎదుగుదలను అడ్డుకొనే విధానమేమీ మాకు లేదు’ అని పదుకొణె అకాడమీ వెల్లడించింది.
నీకెందుకు గోపీ?
Related tags :