* కిలో ఉల్లిపాయలు రూ.22కే ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఉల్లి, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకడంతో రిటైల్ ద్రవ్యోల్బణం అయిదున్నరేళ్ల గరిష్ఠానికి చేరి ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఉల్లి ధరలు తగ్గుతాయని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశవాన్ తెలిపారు. ఇక నుంచి కిలో ఉల్లి రూ.22కే అందిస్తామని ఆయన ప్రకటించారు. ‘18వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకున్నాం. కేవలం 2000 టన్నుల ఉల్లిపాయలు మాత్రమే అమ్ముడుపోయాయి. ఇక కిలో ఉల్లి రూ.22కే అందిస్తాం’ అని ఆయన తెలిపారు.
* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా ప్రముఖ ఆర్థిక వేత్త మైఖేల్ పాత్రా నియమితులయ్యారు. 59 ఏళ్ల మైఖేల్ పాత్రా ప్రస్తుతం ఆర్బీఐ పరిశోధన విభాగంలో ద్రవ్య విధాన కమిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే డిప్యూటీ గవర్నర్‌గా ఆయనకు ఏ విదమైన బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఆర్బీఐ వర్గాల సమాచారం మేరకు ఆయనకు ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. పాత్రా ఐఐటీ నుంచి ఆర్థిక శాస్తంలో డాక్టరేట్ పొందారు. 2019లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వలో వడ్దీ రేట్లను తగ్గించడంలో మైఖేల్ పాత్రా కీలక పాత్ర పోషించారు. గతంలో డిప్యూటీ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విరాల్ ఆచార్య స్థానంలో కొత్త డిప్యూటీ గవర్నర్‌గా పాత్రా బాధ్యతలు చేపడతారు.
* ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో వరుసగా రెండో సమీక్షలోనూ కీలక వడ్డీరేట్లలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి మార్పు చేయకపోవచ్చని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉల్లి, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటడంతో డిసెంబరులో రిటైల్ ద్రవ్యోల్బణం అయిదున్నేరళ్ల గరిష్ఠానికి చేరి 7.35శాతంగా నమోదైంది. ఇక జనవరిలో ఇది 8శాతాన్ని దాటొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. మరోవైపు టోకు ద్రవ్యోల్బణం కూడా ఏడు నెలల గరిష్ఠానికి చేరింది. ఈ పరిణామాలు ఆర్‌బీఐ వడ్డీరేట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.
* వాహనప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వాహనం భారత మార్కెట్లోకి వచ్చేసింది. మంగళవారం చేతక్ ద్విచక్రవాహనాన్ని కంపెనీ నిర్వాహకులు విడుదల చేశారు. అర్బన్, ప్రీమియం పేరిట రెండు వేరియంట్లలో ఇది వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. చేతక్ ఎలక్ట్రిక్ వాహనం ధర రూ.1లక్ష(ఎక్స్ షోరూం పుణె, బెంగళూరు)గా నిర్ణయించారు. అర్బన్ వేరియంట్ ధర రూ.లక్ష కాగా.. ప్రీమియం వేరియంట్ ధర రూ.1.15లక్షలుగా నిర్ణయించారు. రేపటి నుంచి చేతక్ బుకింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. వచ్చే నెల నుంచి వాహనాలను డెలివరీ చేయనున్నారు. ప్రస్తుతం పుణె, బెంగళూరులో మాత్రమే దీన్ని విడుదల చేశారు.
* సీఎండీ పదవిపై తీసుకొచ్చిన నూతన మార్గదర్శకాలు అమలు చేసేందుకు సెబీ కంపెనీలకు మరింత గడువు కల్పించింది. ఛైర్మన్, ఎండీ బాధ్యతలు వేర్వేరుగా ఉండాలన్న సెబీ మార్గదర్శకాలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా.. దాన్ని 2022 ఏప్రిల్ వరకు పొడగిస్తున్నట్లు మార్కెట్ రెగ్యులేటర్ తాజాగా వెల్లడించింది.
* దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగించాయి. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలతో ప్రారంభమైనప్పటికీ.. ఊగిసలాటలోనే మార్కెట్లు కొనసాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 92 పాయింట్లు లాభపడి.. 41,952 వద్ద ముగించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 12,362 వద్ద ముగించింది. మరో రెండు రోజుల్లో అమెరికా చైనా మధ్య జరగనున్న వాణిజ్య ఒప్పందం ప్రభావం మార్కెట్లపై కనిపించలేదు. యూఎస్ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.70.84 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో వేదాంత, బ్రిటానియా, హీరో మోటర్స్, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఐటీసీ షేర్లు లాభాల్లో పయనించగా.. యస్ బ్యాంకు, ఇండస్‌ఇండ్, యూపీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కొటక్ మహీంద్రా షేర్లు నష్టాలతో ముగిశాయి.