మన రాష్ట్రంతోపాటు దేశంలోని 14 రాష్ట్రాలలో పతంగుల పండుగను భారీ ఎత్తున నిర్వహించుకుంటారు. జనవరిలో గాలిపటాలను ఎగురవేసేందుకు అనుకూల వాతావరణం ఉంటుంది. గాల్లో తేమ తక్కువగా ఉండి, అవి ఎగిరేందుకు ఒకవైపు నుంచి మరో వైపునకు గాలులు వీస్తుంటాయి. గ్రామాల్లోని చిన్నచిన్న దుకాణాల్లో కూడా గాలిపటాలు విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ వీటి అమ్మకాలు సాగుతున్నాయి. ఒక్కో గాలిపటం దారంతో కలిపి రూ.300 నుంచి రూ.1000 వరకు ఉన్నాయి. గ్రామాల్లో చిన్నారులు ఎక్కువగా కాగితంతో గాలిపటాలు తయారు చేసుకుని ఎగురవేస్తుంటారు.
**మొదలయ్యింది ఇలా..
ప్రస్తుతం మనం ఎగురవేస్తున్న గాలిపటాలకు ఎంతో చరిత్ర ఉంది. చైనాలో 2,300 సంవత్సరాల క్రితం గాలిపటం రూపొందింది. తొలిదశలో విభిన్న ఆకృత్తుల్లో రూపొందించిన వీటిని సైనిక అవసరాలకు ఎక్కువగా వినియోగించేవారు. చైనా నుంచి ప్రపంచంలోని ఇతర దేశాలకు విస్తరించింది. 14వ శాతాబ్దం వచ్చేసరికి మనదేశంలో గాలిపటం వినియోగంలోని వచ్చింది. గ్రామాల్లో పది మంది కలిసి గాలిపటాలు ఎగురవేస్తే కనుల పండువగా ఉంటుంది. మరి వందల మంది ఒకేసారి గాలిపటాలు ఎగరవేయడాన్ని చూడాలంటే గుజరాత్ వెళ్లాల్సిందే. అక్కడ అంతర్జాతీయస్థాయి గాలిపటాల పండుగ నిర్వహిస్తారు. మన దేశంతోపాటు జపాన్, కెనడా, ఇండోనేషియా, చైనా, బ్రెజిల్, మలేషియా, అమెరికా వంటి 40 దేశాల వారు పాల్గొంటారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది పతంగులను ఎగురవేసేందుకు ఉత్సాహం చూపుతారు. అక్కడ గాలిపటాలతోపాటు డ్రాగన్‌లు, చక్రాలు, బొమ్మలను గాల్లో ఎగుర వేస్తుంటారు.
**విభిన్న రకాల్లో…
గాలిపటాలను భిన్న ఆకృతుల్లో రూపొందించి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. చిన్నా, పెద్దా అందరినీ ఆకట్టుకునే విధంగా వినూత్నంగా కనిపించే వివిధ రకాల గాలిపటాలను మార్కెట్లోకి తీసుకువచ్చారు. గరుడపక్షి, కప్ప, విమానం, చేప, వివిధ రకాల పక్షుల ఆకారాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి.
***హైదరబాద్‌లో ప్రపంచ గాలిపటాల పండుగ
ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రపంచ గాలిపటాల పండుగను ఉత్సహంగా నిర్వహిస్తున్నారు. 13 దేశాలకు చెందిన గాలిపటాల ప్రేమికులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. 14వ తేదీన ప్రారంభమయ్యే ఈ పండుగ మూడు రోజులపాటు కనుల పండువగా సాగుతుంది.
**జాగ్రత్తలు తప్పనిసరి…
గాలిపటాలను ఎగురవేయడానికి విశాలమైన మైదానాలను ఎన్నుకుంటే మంచిది.
*ఇరుగ్గా ఉన్న డాబాలపై ఎట్టిపరిస్థితుల్లోనూ ఎగురవేయకూడదు. దారాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి, బిగుతుగా పట్టుకుంటే వేళ్లు తెగే ప్రమాదం ఉంటుంది.
*తెగిన గాలిపటాల కోసం చిన్నారులు పరిగెత్తకూడదు. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
*విద్యుత్ తీగలు, రహదారులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
*చెట్లకు, ఎత్తయిన ప్రదేశాల్లో చిక్కుకున్న వాటిని తీసే సాహసం చేయకూడదు.
*ఎవరికైనా దారం చుట్టుకున్నప్పుడు లాగకుండా వదిలేయాలి. శరీరం కోసుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి.
గాలిపటమా…అలా ఎగిరిపోకమ్మా!
Related tags :