ScienceAndTech

హాల్‌మార్క్ సరికొత్త నిబంధనలు ఇవి

Hallmark releases new guidelines for gold jewellery quality checks

ఆభరణాల్లో బంగారం స్వచ్ఛతకు భరోసా ఇచ్చే హాల్‌మార్కింగ్‌ నిబంధనలు రేపటి నుంచి అమల్లోకి తెస్తున్నట్లు కేంద్ర వినియోగ వ్యవహారాలశాఖ మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ వెల్లడించారు.

ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఈనెల 16న విడుదల చేయనున్నట్లు చెప్పారు.

అప్పటినుంచి ఏడాదిలోపు దుకాణదారులంతా హాల్‌మార్కింగ్‌ లేని ఆభరణాలు విక్రయించుకోవాలని, లేదంటే తిరిగి కరిగించి కొత్త నిబంధనల ప్రకారం నగలు చేసి అమ్మాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.

2021 జనవరి 15 నుంచి విక్రయించే ప్రతి నగకూ హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి అని మంగళవారం ఇక్కడ విలేకరులకు మంత్రి తెలిపారు.

గతంలో ఆభరణాలను 9, 14, 18, 22 క్యారెట్ల స్వచ్ఛతతో చేసిన దాఖలాలున్నాయని, ఇకమీదట 14, 18, 22 క్యారెట్ల ఆభరణాలే విక్రయించాల్సి ఉంటుందని వివరించారు.

బంగారు నగలన్నీ 22 క్యారెట్ల నాణ్యతతో

వజ్రాలు, ఇతర రాళ్లు పొదిగిన నగలైతే 14, 18 క్యారెట్ల నాణ్యతతో మాత్రమే అనుమతిస్తారు.

ప్రతి నగపై తప్పనిసరిగా బీఐఎస్‌ మార్క్‌, ఎన్ని క్యారెట్లు.. అది ఎంత స్వచ్ఛతకు చిహ్నం అనే సంఖ్యలు, హాల్‌మార్క్‌ గుర్తింపునిచ్చిన కేంద్రం ముద్ర, నగ గుర్తింపు సంఖ్యను ముద్రించాల్సి ఉంటుంది.

అంటే 22 క్యారెట్ల నగలపై 22కే అని, స్వచ్ఛతను చూపే 916 అంకె కూడా ముద్రించాలి.

18 క్యారెట్ల నగలపై 18కేతో పాటు 750 అని

14 క్యారెట్ల నగలపై 14కేతో పాటు 585 అని ముద్రించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.

ప్రతి జిల్లాలో అధీకృత హాల్‌మార్కింగ్‌ కేంద్రం

ప్రస్తుతం దేశంలోని 234 జిల్లాల్లో 892 బీఐఎస్‌ (భారతీయ ప్రమాణాల మండలి) నాణ్యతా నిర్థారణ కేంద్రాలున్నాయని, ఏడాదిలోపు మిగిలిన అన్ని జిల్లాల్లో ప్రైవేటు భాగస్వామ్యంలో వీటిని ఏర్పాటుచేస్తామన్నారు.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 28,849 మంది నగల వ్యాపారులు తమ పేర్లను బీఐఎస్‌ వద్ద నమోదుచేసుకున్నారని, ఇంకా 3-4 లక్షల మంది వచ్చే ఏడాది లోగా నమోదు చేసుకోవాల్సిందేనని వెల్లడించారు.

నగల తయారీదారు ఎన్ని నగలు విక్రయిస్తే, అన్నింటినీ తప్పనిసరిగా సమీప బీఐఎస్‌ కేంద్రానికి తీసుకొచ్చి విధిగా ముద్ర వేయించుకోవాలని చెప్పారు.

ఒకవేళ విక్రయదారు ప్రకటించిన క్యారెట్ల కంటే, తక్కువ నాణ్యత గనుక ఆభరణంలో ఉంటే, తిరిగి కరిగించి కొత్తది చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

తాము కొన్న నగల్లో బంగారం నాణ్యతను వినియోగదారులు కూడా బీఐఎస్‌ కేంద్రాల్లో పరీక్షించుకోవచ్చన్నారు.

5 రెట్ల వరకు జరిమానా

దుకాణదారులు విక్రయించిన నగల్లో వారు చెప్పిన దానికంటే తక్కువ స్వచ్ఛత కలిగిన బంగారం ఉన్నట్లు బయటపడితే రూ.లక్ష నుంచి నగల విలువపై 5 రెట్ల వరకు జరిమానాతో పాటు ఏడాది వరకు జైలు శిక్ష విధించే నిబంధన కూడా చేరుస్తున్నామన్నారు.

వినియోగదారులు ఇప్పటికే కొనుగోలు చేసి, ఇళ్లలో ఉంచుకున్న బంగారానికి హాల్‌మార్క్‌ అవసరం లేదన్నారు.

ప్రజలు తమవద్ద ఉన్న పాతబంగారం ఇచ్చి తయారు చేయించుకునే కొత్త నగలకూ ఈ నిబంధన వర్తించదన్నారు.

అలాంటి నగలు వినియోగదారులు కోరుకున్న విధంగా చేయించుకోవచ్చని చెప్పారు.

ఒక ఆభరణానికి రూ.150-250: వినియోగదారులు బీఐఎస్‌ కేంద్రాలకు వెళ్లి తమ నగలను పరీక్షించుకోవాలనుకుంటే ఒక్కో నగకు రూ.150-250వరకు చెల్లించాల్సి ఉంటుందని, అదే ఎక్కువ సంఖ్యలో అయితే ఒక్కోదానికి రూ.35 మాత్రమే వసూలు చేస్తారని తెలిపారు.