శ్రీత్యాగబహ్మకు జరిగే ఆరాధనోత్సవాలు సంగీత సాహిత్య రంగాలలో బ్రహ్మోత్సవాలు వంటివి. మన తెలంగాణ రాష్ట్రంలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి సన్నిధిలో శ్రీత్యాగరాజ ఆరాధనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ‘పుష్య బహుళ పంచమి’ని పురస్కరించుకొని జనవరి 15 నుంచి 19 వరకు రాజన్న సన్నిధిలో ఈ ఏడాది 67వ వార్షికోత్సవంగా శ్రీత్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు.అనాదిగా వస్తున్న సంప్రదాయ కళా సంపదను త్యాగబ్రహ్మ నుంచి వారసత్వంగా స్వీకరించిన కళాకారులే గాక, స్ఫూర్తిని పొందిన కళా ఆరాధకులు సైతం ఏటా ఆరాధనోత్సవాలను నిర్వహిస్తూ భారతీయ వైభవాన్ని మరింత ఇనుమడింపజేస్తున్నారు. అటువంటి కోవకు చెందిన వారే వేములవాడ ఆలయ ఆస్థాన ప్రవచకులు చౌటి సాంబయ్య. ఆయన 80 యేండ్ల కిందట తిరువాయూరు త్యాగరాజ ఆరాధనోత్సవాలను చూసి స్ఫూర్తి పొంది ఆ త్యాగబ్రహ్మకు ఆరాధనా పూర్వక నివాళిని అర్పించాలనే సంకల్పంతో మొదలు పెట్టినవే వేములవాడ శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు. రామభక్తి అమృతాన్ని సేవించి, కర్ణాటక సంగీత సంప్రదాయంలో అనేక కీర్తనలను రచించి శాశ్వతకీర్తిని పొందిన త్యాగయ్య మన సంగీత ప్రపంచానికి మూలస్తంభం. లోకారాధకుడైన శ్రీ త్యాగరాజ స్వామికి ప్రతీ సంవత్సరం ‘పుష్య బహుళ పంచమి’ని పురస్కరించుకొని ఆరాధనోత్సవాల పేరిట సకల జనులూ ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలర్పిస్తారు. శతాబ్దానికి పైగా ఈ ఆరాధనోత్సవాలు తిరువాయూరు సహా చాలాచోట్ల పుష్య బహుళ పంచమి సందర్భంగా సంప్రదాయ పరంపరను కొనసాగిస్తున్నాయి. వేములవాడలో కూడా గత 66 సంవత్సరాలుగా ఈ త్యాగరాజస్వామి ఆరాధన పరంపర ఉత్సవాల పేరిట నిరాటంకంగా నిర్వహిస్తున్నారు. నగర సంకీర్తన, శ్రీత్యాగరాజ స్వామివారి సుప్రభాతం, త్యాగయ్య రచించిన పంచరత్నకృతి కీర్తనాగానం వంటి ముఖ్యాంశాలతో పాటు వేములవాడ శ్రీత్యాగరాజ ఆరాధనోత్సవాల్లో ఎందరో మహానుభావులు, ప్రముఖుల ప్రదర్శనలు విశేషంగా ఉండేది. గతంలో ఘంటసాల, బాలమురళీకృష్ణ, శోభరాజు, హరికథా పితామహుడు కోటా సచ్చిదానందమూర్తి, నూకల చినసత్యనారాయణ, ఎల్లా వెంకటేశ్వరరావు, శోభానాయుడు లాంటి వారెందరో విద్వాంసులు, కళాకారులు వేములవాడ ఆరాధనోత్సవాల్లో పాల్గొనడం విశేషం. భక్తి భావుకతను సంగీతంలో మేళవించి, సంస్కృత ఆంధ్రులనూ, సంగీత సాహిత్యాలనూ, లౌకికవైదికాలనూ సమన్వయపరిచి శ్రీత్యాగరాజస్వామి వారు సాధించిన కృతిభావ రచనాప్రజ్ఞ అనితరసాధ్యం. సకలశాస్త్ర పారంగతుడై, అపూర్వగాత్ర సంపదకలవాడై, సప్తస్వరాత్మక ప్రణవనాదస్థితిలో గాత్ర సంపదకూ, పాండిత్య ప్రకర్షకూ, సాహిత్య భావుకతకూ ప్రతీకగా నిలిచిన త్యాగయ్యకు ఇలలో సాటిరారెవ్వరూ! అటువంటి శ్రీ త్యాగరాజస్వామికి ఆరాధనోత్సవాలను వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం వారు సమర్పించే సంగీత సమారాధనలు ఆ మహానుభావుడికి అందించే నిజమైన నీరాజనాలు.తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ. అక్కడ నిర్వహించే శ్రీత్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు రాష్ట్ర సంస్కృతికి తలమానికం. విభిన్న సంప్రదాయాలు, విశిష్ఠసంస్కృతులు, సకల కళలు, విభిన్న రంగాలు తెలంగాణ రాష్ట్రంలో భాగమై రాష్ట్ర వైభవాన్ని చాటి చెబుతున్నాయనే సంకల్పానికి సరైన నిర్వచనం చెబుతున్నాయి వేములవాడ శ్రీత్యాగరాజ ఆరాధనోత్సవాలు.
వేములవాడలో త్యాగరాజు ఆరాధనోత్సవాలు
Related tags :