Devotional

యద్భావం తద్భవతి

You are what you think-Hindu devotional stuff

ఒక సన్యాసి, దేవుడి కోసం తపస్సు చేశాడు. అతడి దీక్ష ఫలించి దేవుడు ప్రత్యక్షమై- మూడుసార్లు అతను మనసులో ఏది తలచుకుంటే అదే జరుగుతుందనే వరమిచ్చాడు. వెంటనే ఆ సన్యాసి సకల సదుపాయాలతో ఒక రాజభవనం లాంటి భవంతి కావాలనుకున్నాడు. వెంటనే భవంతి ప్రత్యక్షమయింది. అందమైన యువతితో వివాహం జరగాలి అనుకున్నాడు. అదీ జరిగింది. ఒక్కసారిగా సంప్రాప్తించిన సుఖభోగాలకు తట్టుకోలేని ఆ వ్యక్తి ‘కొంపదీసి ఇవన్నీ మాయమవుతాయా!’ అనుకున్నాడు. అంతే, తక్షణం ఆ సన్యాసి తన పూర్వపు స్థితికి వచ్చేశాడు. మన మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తాయో, ఫలితాలు అలానే ఉంటాయనేది ఈ కథలోని నీతి. ఈ భావాన్నే శ్లోకం రూపంలో ‘యాదృశీ భావనా యత్ర సిద్ధిర్భవతి తాతృశి’ అన్నారు వేదాంతులు. మృతుల్ని బతికించే మృత సంజీవనితోపాటు పిచ్చిమొక్కలు, విషపుమొక్కలు కూడా నేలతల్లినుంచే ఉద్భవిస్తాయి. అలాగే మంచి ఆలోచనలతోపాటు చెడుతలంపులకూ మానసిక క్షేత్రమే కేంద్రబిందువు. మంచి ఆలోచనలు ఆచరణలో పెడితే మానవాళికి మహోపకారం. చెడు ఆలోచన కలిగించే ఫలితాలతో మానవాళికి మారణహోమం. ఒక మంచి తలంపు మనిషికి జీవం పోస్తే ఒక చెడు ఆలోచన ప్రాణం తీస్తుంది. మంచి ఆలోచనల విలువ అపారం. అది వెలకట్టలేనిది.ఒక వూళ్ళో పాపయ్య, పోచయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. ఒకరంటే ఒకరికి పడదు. ఒకరిని మించి ఇంకొకరు గొప్పవాళ్ళయిపోవాలనే దురాశతో దేవుడు ప్రత్యక్షం కావడం కోసం దీక్ష చేపట్టారు. దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకొమ్మన్నాడు, ముందుగా పాపయ్యను. తన శత్రువు పోచయ్య ఏం కోరుకుంటాడో దానికి రెట్టింపు ఇమ్మన్నాడు పాపయ్య. తరవాత దేవుడు పోచయ్యకు ప్రత్యక్షమయ్యాడు. పాపయ్య కోరుకున్నదేమిటో తెలుసుకొని పోచయ్య తన కన్ను ఒకటి తీసెయ్యమన్నాడు. అలా తన శత్రువైన పాపయ్య రెండుకళ్ళు పోగొట్టాడు పోచయ్య. మనం చెడిపోయినా ఫరవాలేదు, తోటివాడు మాత్రం బాగుపడకూడదనే పాశవిక ఆలోచనలు ఎంతటి దుష్ఫలితాలు కలిగిస్తాయో ఈ కథ తెలియజేస్తుంది. ‘చెరపకురా చెడేవు’ అనే సామెత ఇలాగే పుట్టింది. మనం ఇతరులకు ఏమి ఇస్తామో, అదే మనకు దక్కుతుంది. ఆనందం ఇస్తే ఆనందం, బాధ కలిగిస్తే బాధ. ఈ లోకం నుంచి ఏది కావాలని కోరుకుంటామో అదే లోకానికి ఇవ్వాలి. మనం కోరుకున్నదే మనకు దక్కుతుంది. ‘యద్భావం తద్భవతి’. మనం శుభం జరగాలని మనసా వాచా కర్మణా వాంఛిస్తే అదే జరుగుతుంది. అంచేత అందరికీ మంచే జరగాలని కోరుకుందాం. సమస్త మానవాళి సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో సుఖంగా జీవించాలని దీవించే పవిత్ర వేదప్రవచనాన్ని మననం చేసుకుందాం.

సర్వే జనాః సుఖినోభవంతు… లోకాః సమస్తాః సుఖినో భవంతు!