DailyDose

ట్రిలియన్ డాలర్లకు ఆల్ఫాబెట్-వాణిజ్యం

Alphabet Reaches Trillion Dollar Mark-Telugu Business News Roundup

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు మందకొడిగా ట్రేడవుతున్నాయి. శుక్రవారం ఉదయం 9.24 సమయంలో నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 12,344 వద్ద.. 6 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ 41,926 వద్ద ట్రేడవుతున్నాయి. చాలా కార్పొరేట్‌ సంస్థల ఆదాయాల అంచనాలపై సానుకూలతలు లేకపోవడంతో మార్కెట్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరోపక్క టెలికం సంస్థలు ఏజీఆర్‌ ఛార్జీలు చెల్లించాలని సుప్రీం ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను తిరస్కరించడం కూడా మార్కెట్‌ను ప్రభావితం చేసింది. నేడు మొత్తం 18 కంపెనీలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటిల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. మరోపక్క అమెరికా ఉత్పాదకరంగ డేటా బలంగా ఉండటంతో వాల్‌స్ట్రీట్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. వీటి ప్రభావం ఆసియా మార్కెట్లపై కూడా చూపుతోంది.

* గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ అరుదైన ఘనత సాధించింది. గురువారం కంపెనీ మార్కెట్‌ విలువ తొలిసారిగా 1 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఈ మైలురాయిని తాకిన నాలుగో అమెరికా టెక్‌ కంపెనీ ఇదే కావడం విశేషం. గురువారం నాటి ట్రేడింగ్‌లో ఆల్ఫాబెట్‌ షేరు ధర 0.76శాతం పెరగడంతో కంపెనీ విలువ లక్ష కోట్ల డాలర్లను చేరుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థలు యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ ఇప్పటికే ట్రిలియన్‌ డాలర్ల జాబితాలో ఉన్నాయి. 2018లో తొలిసారిగా యాపిల్‌ ఈ ఘనత సాధించింది. గురువారం నాటికి ఈ కంపెనీ మార్కెట్‌ విలువ 1.38 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. బిల్‌గేట్స్‌ స్థాపించిన మైక్రోసాఫ్ట్‌ ప్రస్తుత మార్కెట్‌ విలువ 1.26 ట్రిలియన్‌ డాలర్లు. ఇక ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 2018 సెప్టెంబరులో ట్రిలియన్‌ డాలర్ల కంపెనీగా ఎదిగింది. అయితే ఆ తర్వాత నుంచి ఈ కంపెనీ విలువ పడిపోతూ వస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌ విలువ 930 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

* వచ్చే బడ్జెట్‌లో కొన్ని రకాల నిత్యావసర వస్తువులపై సుంకాలను పెంచే అవకాశం ఉంది. వీటిల్లో పేపర్‌, ఫుట్‌వేర్‌, రబ్బర్‌ తయారీ వస్తువులు ఉండవచ్చు. ముఖ్యంగా ఉత్పాదక రంగంలో ‘మేకిన్‌ ఇండియా’ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇటీవల కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నుంచి ఆర్థిక శాఖకు కొన్ని ప్రతిపాదనలు వెళ్లాయి. వీటిల్లో వివిధ రంగాలకు చెందిన దాదాపు 300 వస్తువులపై కస్టమ్స్‌, దిగుమతి సుంకాలను సవరించాలని పేర్కొంది. వీటిల్లో ఫర్నిచర్‌, రసాయనాలు, రబ్బర్‌, కోటెడ్‌ పేపర్‌, పేపర్‌ బోర్డ్స్‌ వంటివి ఉన్నాయి.

* భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతామని ప్రకటించిన ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మరో కీలక ప్రకటన చేసింది. రానున్న ఐదేళ్లలో భారత్‌లో పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించింది. అమెజాన్‌ సొంతలాభం కోసం తప్ప భారత్‌ కోసం పనిచేయడం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ కంపెనీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్‌ బెజోస్‌ మూడు రోజుల పర్యటనకు వచ్చిన సందర్భంగా భారత్‌లో రూ.7వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. దీనిపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టినంత మాత్రాన భారత్‌కు మీరేదో మేలు చేస్తున్నట్లు కాదంటూ పరోక్షంగా బెజోస్‌నుద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బెజోస్‌ శుక్రవారం ఓ ప్రకటన చేశారు. 2025 నాటికి పది లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రణాళిక ఉందన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఐటీ, నైపుణ్యాభివృద్ధి, కంటెంట్‌ క్రియేషన్‌, రిటైల్‌, లాజిస్టిక్స్‌, తయారీ పరిశ్రమల్లో ఉద్యోగాలు సృష్టించనున్నట్లు బెజోస్‌ పేర్కొన్నారు. గత ఆరేళ్లలో అమెజాన్‌ పెట్టుబడుల ద్వారా 7 లక్షల మందికి ఉపాధి లభించిందని, రానున్న ఐదేళ్లలో కల్పించే ఉద్యోగాలు దీనికి అదనమని వివరించారు.

* ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌ ద్వారా నిత్యం సమకాలీన అంశాలపై స్పందించడంలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. తాజాగా ఆయన మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లకు అభినందనలు తెలిపారు. దీనికో కారణం ఉంది.. తమ సంస్థ స్థాపించిన నాటి నుంచి వెలువరించిన కార్బన్‌ ఉద్గారాలను 2050 నాటికి తొలగిస్తామని మైక్రోసాఫ్ట్‌ ప్రతిజ్ఞ చేసింది. ఈ నిర్ణయాన్ని అభినందిస్తూ మహీంద్రా ట్విట్టర్‌ వేదికగా సత్య నాదెళ్లకు అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘‘శెభాష్‌ (బ్రావో) సత్య నాదెళ్ల, గతంలో 2040 నాటికి తాము వెలువరించిన కార్బన ఉద్గారాలను తొలగిస్తామని మహీంద్రా సంస్థ ప్రతిజ్ఞ చేసింది. ఆ గడువు తర్వాత పదేళ్లకు మీ సంస్థ వెలువరించిన కార్బన ఉద్గారాలను తొలగిస్తామని ప్రతిజ్ఞ చేయడం ఎంతో అభినందనీయం. నాకు తెలిసి ఇది ఎంతో సాహసోపేతమైన నిర్ణయం’’ అని ట్వట్టర్లో పేర్కొన్నారు.

* భారత వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా ఫ్రాన్స్‌లోని ఓ ద్వీపంలో కొనుగోలు చేసిన విలాసవంతమైన భవనం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుందంట. 17 పడక గదులు, సినిమా థియేటర్‌, హెలిప్యాడ్‌, నైట్‌క్లబ్‌ ఉన్న ఈ సౌధానికి గత కొన్నేళ్లుగా ఎలాంటి మరమ్మతులు చేయించకపోవడంతో చాలా వరకు దెబ్బతిన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. ఫ్రెంచ్‌ ద్వీపమైన ఇలీ సెయింటీ మార్గరైట్‌లో 1.3 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ‘లీ గ్రాండ్‌ జార్డిన్‌’ భవనాన్ని మాల్యా 2008లో కొనుగోలు చేశారు. ఇందుకోసం ఖతార్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఎస్‌ఏక్యూకు చెందిన అన్స్‌బాచర్‌ అండ్‌ కో యూనిట్‌ నుంచి మాల్యా 30 మిలియన్‌ డాలర్ల రుణం తీసుకున్నారు. గిజ్మో ఇన్వెస్ట్‌ కంపెనీ పేరుతో ఈ లోన్‌ తీసుకోగా.. ఆ తర్వాత రుణాన్ని తిరిగి చెల్లించలేదు.