రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని ఎక్కడికీ తరలించడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణపైనే అధ్యయనం చేసినట్లు చెప్పారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. మూడు ప్రాంతాల్లో పాలన ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. రైతులను మోసం చేసింది చంద్రబాబు మాత్రమేనని దుయ్యబట్టారు. రైతును క్షోభ పెట్టిన వారెవరూ బాగుపడలేదన్నారు. రాజకీయంగా రైతులను రెచ్చగొట్టి చంద్రబాబు బినామీలను కాపాడుకునేందుకే ఈ ఉద్యమం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా జోలెపట్టి సేకరించిన నిధులు చంద్రబాబు, ఆయన కుమారుడు ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు సహా 23 మంది తెదేపా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు రాగలరా అని సవాల్ విసిరారు. కొత్త నగరం నిర్మించే కంటే ఆ నిధులతో రాయలసీమ, ఉత్తరాంధ్రలను అభివృద్ధి చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పొరుగు రాష్ట్ర సూచనలు సలహాలు తమకు అవసరం లేదని తేల్చి చెప్పారు. వారితో సఖ్యతగా ఉండాలనే సీఎం జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారని చెప్పారు. గతంలో రూ.వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.
చంద్రబాబు…నీ జోలెలోని నిధులు ఏమవుతున్నాయి?
Related tags :