DailyDose

ఇక ముంబైలో పబ్బులు 24గంటలు తెరిచే ఉంటాయి-తాజావార్తలు

Maharashtra Govt To Enable 24Hours Operations Of All Businesses

* ప్రపంచ ప్రఖ్యాతి నగరాల్లో ఒకటైన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఇకపై దుకాణ సముదాయాలు, రెస్టారెంట్లు, మల్లీప్లెక్స్‌లు 24గంటలు తెరవనున్నారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి ఇది ప్రయోగాత్మకంగానే అమలు చేయనున్నామని తెలిపారు. జనవరి 26 నుంచి ముంబయిలోని ఫోర్ట్‌ అండ్‌ కాలా ఘోడా, బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ ప్రాంతాల్లో అనుమతించిన దుకాణ సముదాయాలు, రెస్టారెంట్లు, మల్టీప్లెక్స్‌లు, పబ్బులు 24X7 తెరుచుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

* ‘సాయిబాబా జన్మభూమి’పై నెలకొన్న వివాదం నేపథ్యంలో ఆదివారం నుంచి శిరిడీ ఆలయం మూసివేయనున్నారని జాతీయా మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ‘సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌’ స్పందించింది. బంద్‌ కేవలం శిరిడీ సహా చుట్టుపక్క గ్రామాలకే పరిమితమని స్పష్టం చేసింది. గ్రామస్థుల బంద్‌తో ఆలయానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. గ్రామస్థులు ఇచ్చిన బంద్‌ పిలుపుపై వారితో చర్చించబోతున్నామని ట్రస్ట్‌ అధికారులు తెలిపారు. ఆలయంలో భక్తుల దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.

* అమరావతి పరిరక్షణకు అందరిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించేందుకు చేపట్టిన చైతన్య యాత్రలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. నారాయణపురంలో చంద్రబాబు నాయడు కొంతదూరం పాదయాత్ర చేస్తూ జోలెపట్టి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి పరిరక్షణకు ప్రాంతాలకు అతీతంగా అందరి భాగస్వామ్యం అవసరమన్నారు. ‘‘ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసం మొదలు పెట్టారు. పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. అమరావతిని విధ్వంసం చేయడానికి కుట్రలు పన్నారు’’ అని చంద్రబాబు అన్నారు.

* మూడు రాజధానుల అంశంతో పాటు సీఆర్డీఏ బిల్లుపై న్యాయ, సాంకేతికపరమైన అడ్డంకులు రాకుండా ఎలా వ్యవహరించాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిపై చర్చించేందుకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమయ్యారు. మూడు రాజధానుల అంశంపై ఇప్పటికే హైపవర్‌ కమిటీ సీఎంతో సమావేశమై చర్చించింది. సీఆర్డీఏ చట్టం రద్దును ఆర్థిక బిల్లుగా పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

* ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ భారతీయ జనతా పార్టీతో కలవడం శుభపరిణామని కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు కృష్ణంరాజు అన్నారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌లో జరిగిన తన 80వ జన్మదిన వేడుకల్లో సినీ, రాజకీయ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా భాజపాతో పవన్‌ పొత్తుపై స్పందించారు. సిద్ధాంతాలు కలుపుకొని 5 కోట్ల మంది ఆంధ్రులకు సేవ చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ విస్తరణకు భాజపా కృషి చేస్తోందని పేర్కొన్నారు.

* వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్‌ వేములవాడలో ప్రసంగించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడను అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వాలు ఏనాడైనా ఆలోచన చేశాయా? అనే విషయాన్ని ఆచోచించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుందని వ్యాఖ్యానించారు. భాజపా నేతలకు మాటలు ఎక్కువ.. పని తక్కువ అని ఎద్దేవా చేశారు.

* ఈ నెల 20న అమరావతి రాజకీయ ఐకాస, ప్రజా సంఘాల ఆందోళనల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజధాని పరిధిలో ఉండే రాజకీయ నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, రైతులకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 149 కింద నోటీసులు జారీ చేస్తున్నారు. అసెంబ్లీ ముట్టడితో పాటు జైల్‌భరో, గుంటూరు కలెక్టరేట్‌ ముట్టడి అంటూ పత్రికల్లో వచ్చిన ప్రకటనల ఆధారంగా నోటీసులు ఇస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

* ప్రజలను మోసం చేసి సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులకు దేవుళ్ల పేరు పెట్టి మసిపూసి మారేడుకాయ చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల మేనిఫెస్టోను తెరాస వెబ్‌సైట్‌ నుంచి తొలగించిందని.. కాంగ్రెస్‌ మేనిఫెస్టో ప్రజలకు అందుబాటులో ఉంచామని పొన్నాల పేర్కొన్నారు. తాను అడిగే ప్రశ్నలకు సీఎం కేసీఆర్‌ వద్ద సమాధానం ఉన్నట్లయితే బహిరంగ చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు.

* వైకాపా ప్రభుత్వ అప్రజాస్వామిక పరిపాలనను వ్యతిరేకించడానికి భాజపా – జనసేన కలిశాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన ఆయనకు భాజపా, జనసేన నాయకులు స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన, భాజపా పొత్తు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తమ పార్టీలు జట్టు కట్టడం వల్ల వైకాపా నాయకుల్లో వణుకు పుడుతోందన్నారు.

* ఉగ్రవాదులకు సాయం చేస్తూ పోలీసులకు చిక్కిన శ్రీనగర్‌ డీఎస్పీ దవీందర్‌ సింగ్‌ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన ఎన్‌ఐఏ.. డీఎస్పీపై కేసు నమోదు చేసింది. వచ్చే సోమవారం ఎన్‌ఐఏ బృందం కశ్మీర్‌ వెళ్లి విచారణ నిమిత్తం దవీందర్‌ను దిల్లీకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఆయన కారు, నివాసంలో లభించిన ఏకే-47, గ్రనేడ్లు, పిస్టోల్‌, మొబైల్‌ ఫోన్‌లను ఫోరెన్సిక్‌ విభాగానికి పంపించనున్నారు.

* మద్రాస్‌ ఐఐటీ నివేదికపై ఏపీ ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని వెలగపూడి రైతులు డిమాండ్‌చేశారు. తాము ఎలాంటి నివేదిక ఇవ్వలేదని మద్రాస్‌ ఐఐటీ చెప్తోందని వారు తెలిపారు. చంద్రబాబు బినామీలు ఇక్కడ ఎవరున్నారో శ్రీకాంత్‌రెడ్డి, ఇతర నేతలు నిరూపించాలని రైతులు సవాల్‌చేశారు. కనీసం తమ సమస్య వినకపోగా బినామీలమంటూ సన్న, చిన్నకారు రైతులను కించపరుస్తారా అంటూ మండిపడ్డారు. ఎక్కడో ఏసీ గదుల్లో కూర్చుని మట్లాడటం కాదు బినామీలెవరో చూపించాలని వారు సవాల్‌ చేశారు.

* తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ 24వ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్రహానికి తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, నారా లోకేశ్‌, కనకమేడల రవీంద్ర, టీడీ జనార్దన్‌, వర్ల రామయ్య, కాలువ శ్రీనివాసులుతో పాటు పలువురు తెదేపా నేతలు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… అమరావతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, సేవ్‌ అమరావతి ప్రతి ఒక్కరి నినాదం కావాలి’’ అని అన్నారు.

* మాదాపూర్‌లో ఇండియా-థాయ్‌లాండ్‌ మ్యాచింగ్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌, థాయ్ లాండ్‌ ఉప ప్రధాని జరీన్ లక్సనావిసిత్‌ తదితరులు పాల్గొన్నారు. రబ్బర్‌ వుడ్‌ పరిశ్రమలో థాయ్‌ లాండ్‌ భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ…థాయ్‌కు భారత్‌కు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశ వృద్ధిరేటును మించి అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణలో వాణిజ్య రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయని, ఫర్నిచర్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని థాయ్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు.

* రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 32వ రోజు కొనసాగుతున్నాయి. ‘ప్రాణాలైనా అర్పిస్తాం.. రాజధానిని సాధిస్తాం’ అంటూ 29 గ్రామాల రైతులు ఉద్యమిస్తున్నారు. మందడం, తుళ్లూరులో నిర్వహించిన మహాధర్నాలో మహిళలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంతో 29 గ్రామాల రైతులు, మహిళలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ స్పందించి మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

* ‘సాయిబాబా జన్మభూమి’పై నెలకొన్న వివాదం నేపథ్యంలో జనవరి 19వ తేదీ ఆదివారం నుంచి శిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసి వేయనున్నట్లు ‘సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌’ ప్రకటించింది. ఈ మేరకు ట్రస్ట్‌ సభ్యుడొకరు శుక్రవారం ప్రకటన చేసినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. తదుపరి కార్యాచరణపై చర్చించడానికి శనివారం సాయంత్రం శిరిడీ గ్రామస్థులంతా సమావేశం కానున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఆలయ సందర్శనకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

* రాబోయే రెండు నెలలకు జీఎస్‌టీ వసూళ్ల లక్ష్యాన్ని పెంచుతూ పన్ను అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జనవరి, ఫిబ్రవరిలో రూ. 1.15లక్షల కోట్లు, మార్చి నెలలో రూ. 1.25లక్షల కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే నేతృత్వంలో శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయిలో సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు నెలకు రూ. 1.1లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు.. తాజాగా దాన్ని రూ. 1.15లక్షల కోట్లకు పెంచారు.

* ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ని ఎన్నుకొని కేరళ ప్రజలు ఘోరమైన పని చేశారని వ్యాఖ్యానించారు. కేరళలో ‘లిటరేచర్‌ ఫెస్టివల్‌’లో ‘దేశభక్తి వర్సెస్‌ యుద్ధోన్మాదం’ అనే అంశంపై ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కష్టపడి పనిచేసే, స్వయంగా ఎదిగిన ప్రధాని నరేంద్ర మోదీపై ఐదోతరానికి చెందిన రాహుల్‌’ గెలిచే అవకాశం లేదు. స్వాతంత్ర్య పోరులో గొప్ప పార్టీగా వెలుగొందిన కాంగ్రెస్‌ దయనీయమైన కుటుంబ సంస్థగా మారడమే.. దేశంలో హిందుత్వ, యుద్ధోన్మాద ప్రాబల్యం పెరిగడానికి కారణం’ అని చెప్పుకొచ్చారు.

* టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ భవితవ్యంపై నెలకొన్న సందిగ్ధత గురించి మాట్లాడటానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ నిరాకరించాడు. 2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబర్‌ కాలానికి కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ధోనీ చోటు కోల్పోయాడు. దీంతో ధోని రిటైర్మెంట్‌ కథ క్లైమాక్సుకు చేరుకున్నట్లేనానని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై స్పందించాలని దాదాని కోరగా అతడు నిరాకరించాడు. ‘‘దీనిపై నేను స్పందించను’’ అని తెలిపాడు.

* గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండల పరిధిలోని రామచంద్రపురం వద్ద జాతీయ రహదారి పక్కనున్న పెట్రోల్‌ బంకులో ఘోర ప్రమాదం జరిగింది. ఇనుప స్టాండ్‌ సాయంతో పెట్రోల్‌ బంకులో విద్యుత్‌ బల్బు మారుస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. విద్యుత్‌ వైరు ఇనుప స్టాండ్‌కు తగిలి విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృతి చెందారు. డేరంగుల శ్రీనివాసరావు(45), షేక్‌ మౌలాలి(22) అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శేఖర్‌ (48) ప్రాణాలు కోల్పోయాడు.