హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పెరిగే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ ఒప్పందం చేసుకున్నారని.. అందుకే అమరావతిని చంపేస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. పాము తన పిల్లల్ని తానే చంపుకున్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో ట్రయల్ రన్ నిర్వహించుకోవడం సిగ్గు చేటని ఆయన ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దేవినేని మాట్లాడారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ లేని బలగాలను అమరావతి ప్రాంతంలో మోహరిస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేస్తున్నారు కాబట్టే సీఎం జగన్ ఇంతలా భయపడుతున్నారన్నారు. 10వేల మంది పోలీసుల బందోబస్తుతో అసెంబ్లీ నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. విశాఖలో ప్రజాబ్యాలెట్‌ను ప్రభుత్వం అడ్డుకుందని దేవినేని ఉమ ఆరోపించారు. అక్కడ 52వేల ఎకరాలు చేతులు మారాయని.. వీటన్నింటినీ అమ్ముకోవడానికే జగన్ రాజధానిని తరలిస్తున్నారని ఆరోపించారు. మూడు రాజధానులకు కృష్ణా జిల్లా వైకాపా నేతలు మద్దతు పలకడం సిగ్గుమాలిన చర్యగా దేవినేని అభివర్ణించారు.
పాము తన పిల్లలను చంపినట్లుగా…
Related tags :