అన్నీ బాగుంటేనే పిల్లలను పెంచటం కష్టం. ఇక ఏదైనా వైకల్యముంటే? ప్రతి క్షణమూ సవాలే. అభం శుభం తెలియని చిన్నారుల మనసులను నొప్పించకుండా.. తాము నొచ్చుకోకుండా పిల్లల అవసరాలను తీర్చటం కత్తిమీద సామే. చదువుల దగ్గర్నుంచి సామాజిక సంబంధాల వరకూ అన్నివిధాలా వారికి దన్నుగా నిలుస్తూ.. నిత్య జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను తట్టుకుని నిలబడేలా తీర్చిదిద్దటం అంత తేలికైన పనికాదు. కానీ మనసుంటే మార్గం దొరక్కపోదు. ఒకింత ఓపిక, మానసిక స్థైర్యంతో వారి భవితకు దివ్యమైన మార్గాలు వేయొచ్ఛు.
*** అరుదైన బహుమతిగా..
ఎవరి పిల్లలు వారికి ముద్ధు శారీరకంగానో.. మానసికంగానో మిగతావాళ్లలా లేకపోయినా వారిపై ప్రేమ తగ్గేది కాదు. వాళ్లు మన బంగారు కొండలే. నిజానికి పిల్లలకు చిన్న సమస్య వచ్చినా తల్లిదండ్రులు తట్టుకోలేరు. అలాంటిది జీవితాంతం వెంటాడుతూ వచ్చే వైకల్యాన్ని ఎదుర్కొంటుంటే ఇంకెంత బాధపడాలి? దీన్ని తట్టుకోవటం కష్టమే అనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ‘అలాంటి చిన్నారిని అద్భుత వరంగా, అరుదైన బహుమతి’గా భావిస్తే మనసు కొంతైనా తేలికపడుతుంది. మరింత ప్రేమను పంచటానికి, శ్రద్ధ చూపటానికి వీలవుతుంది. అలాగే చిన్నారులకు ఎలాంటి విషయాలు సంతోషాన్ని కలిగిస్తున్నాయో గుర్తించటం కీలకం. కొందరు బొమ్మలను చూసి కేరింతలు కొట్టొచ్చు, కొందరు బయటి వాతావరణాన్ని చూసి సంతోషించొచ్చు, పక్షులను చూసి కిలకిలమని నవ్వొచ్ఛు ఇలా వారికి ఇష్టమైనవేంటో తెలుసుకొని మసలుకొంటే పిల్లల్లోనే కాదు, పెద్దల్లోనూ మానసిక ఆందోళన తగ్గుముఖం పడుతుంది. ఒత్తిడికి లోనవటమూ తగ్గుతుంది.
*** అంగీకరించటం ప్రధానం
పిల్లలకు ఏదో వైకల్యముందని, మిగతావాళ్లలా లేరని తెలియగానే ఎవరికైనా మనసు కలుక్కుమనే అంటుంది. తాము కన్న మధురమైన కలలు తమ ముందే విరిగిపోతే మదిలో కలతే నిండుకుంటుంది. అది సహజం కూడా. అందరిలా ఆడలేక, పాడలేక, గెంతలేక, కేరింతలు కొట్టలేక పిల్లలు బాధపడుతుంటే తల్లిదండ్రుల మనసు సంతోషంగా ఎలా ఉంటుంది? ఇది క్రమంగా కొందరిలో మనస్తాపానికీ దారితీస్తుంది. తమకే ఎందుకిలా జరిగింది? ఎవరికేం పాపం చేశామో? అనే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు. అయితే వాస్తవాన్ని గుర్తించి, అంగీకరించటం అన్నింటికన్నా ప్రధానం. ఇలా జరగాలనేమీ కోరుకోలేదు, అయినా జరిగిపోయింది. ఇప్పుడిక దాన్ని వెనక్కి తిప్పటం సాధ్యం కాదు. ఈ నిజాన్ని గుర్తించగలిగితే కర్తవ్యం బోధపడుతుంది. పిల్లల అవసరాలేంటి? వాటినెలా తీర్చగలం? సవాళ్లను ఎలా ఎదుర్కోగలం? అని ఆలోచనలతో ముందడుగు వేయటానికి వీలవుతుంది.
*** చదువులపై ప్రత్యేక శ్రద్ధ
దివ్యాంగులంతా ఒకేలా ఉండాలనేమీ లేదు. వారి అవసరాలూ వేర్వేరుగా ఉండొచ్ఛు ముఖ్యంగా విషయగ్రహణలో చాలా తేడాలుండొచ్ఛు ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన పద్ధతిలో చదువులు చెప్పాల్సిన అవసరం ఉండొచ్ఛు మనదగ్గర దివ్యాంగ పిల్లలకు అన్నివిధాలా, అన్ని అవసరాలకు సరిపడిన పాఠశాలలు లేవనే చెప్పుకోవాలి. ఉపాధ్యాయులకూ అలాంటి పిల్లలకు చదువులు చెప్పే నైపుణ్యం లేకపోవచ్ఛు దీనికి వాళ్లను తప్పుపట్టలేం. వారికి అలాంటి ప్రత్యేక శిక్షణ ఏదీ ఇచ్చి ఉండకపోవచ్ఛు అందువల్ల బడుల్లో సదుపాయాలు అంతగా లేకపోయినా సర్దుకుపోవటమే మంచిది. తోటి పిల్లలు హేళన చేస్తారనే భయం వద్ధు కొంతకాలానికి అన్నీ సర్దుకుంటాయని గుర్తించాలి. నలుగురితో కలవటం వల్ల పిల్లల్లో మానసిక వికాసమూ మెరుగవుతుంది. మరీ ఇబ్బంది పడుతున్నారని అనుకుంటే ఇంట్లోనే ప్రత్యేకంగా చదువు చెప్పించొచ్ఛు ●
*** సమస్యను సమగ్రంగా అర్థం చేసుకోవాలి
పిల్లలకు వచ్చిన వైకల్యమేంటి? దానికి గల కారణాలేంటి? అనేవి వీలైనంత ఎక్కువగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అలాంటి సమస్యలపై నిర్వహించే సదస్సులకు హాజరు కావటం.. అలాంటి సమస్యలతో బాధపడుతున్న ఇతర పిల్లల కుటుంబాలను కలవటం వంటివి ఎంతో మేలు చేస్తాయి. దీంతో సమస్య గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకోవచ్ఛు అలాంటి పిల్లల కుటుంబాలు ఎలా నెట్టుకొస్తున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి? అనేవి అర్థమవుతాయి. ఇలా వీలైనంత ఎక్కువగా అర్థం చేసుకుంటున్నకొద్దీ పరిష్కార మార్గాల అన్వేషణా సులభమవుతుంది.
*** వింతేమీ కాదు..
అందరిలా లేనివారిని చుట్టుపక్కల వాళ్లు వింతగా చూస్తుంటారు. పెళ్లిళ్లకో, పేరంటానికో తీసుకెళ్లినప్పుడు ఇలాంటి పరిస్థితి మరింత ఇబ్బందికరంగానూ పరిణమిస్తుంటుంది. అంతమాత్రాన నొచ్చుకోవాల్సిన పనేమీ లేదు. భిన్నంగా ఉన్నవాటిని చిత్రంగా చూడటమనేది మానవ నైజమని అర్థం చేసుకోవాలి. మన సమాజంలో ఆయా వైకల్యాల పట్ల అవగాహన లేకపోవటమే దీనికి కారణం. ఇలాంటి పరిస్థితులు తరచుగా ఎదురవుతుంటే పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చుట్టుపక్కల వాళ్లకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేయాలి. దీంతో అపార్థాలేవైనా ఉంటే తొలగిపోతాయి.
*** మీ ఆరోగ్యాన్నీ పట్టించుకోవాలి
నిరంతరం పిల్లలను కనిపెట్టుకొని చూసుకోవటం శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి దారితీస్తుంటుంది. అందువల్ల తల్లిదండ్రులు తమ ఆరోగ్యం మీదా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మనం బాగుంటేనే పిల్లలు బాగుంటారని గుర్తించాలి. అన్నిసార్లూ మనమే అన్ని అవసరాలను తీర్చలేకపోవచ్ఛు కాబట్టి అవసరమైతే బంధువులు, స్నేహితుల సాయమూ తీసుకోవచ్ఛు దీంతో కొంత వెసులుబాటు దక్కినట్టూ అవుతుంది.